Ad Code

చనిపోయిన పందులు రక్తప్రసరణ పునరుద్ధరణ !


చనిపోయిన పందుల్లో తిరిగి రక్తప్రసరణ కలిగేలా అమెరికా లోని యేల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల అద్భుత సృష్టికి నిదర్శనంగా కనిపిస్తోందీ పరిశోధన. మృతి చెందిన పందులలో  ఓ గంట తర్వాత తమ పరిశోధనలతో రక్తప్రసరణను వారు పునరుద్ధరించగలిగారు. ఆ పందుల్లోని కొన్ని అవయవాల్లో కణాలు తిరిగి పనిచేయగలిగేలా చేశారు. అంటే ఆ పందుల్ని పూర్తిగా బతికించలేకపోయినా రక్తప్రసరణ కలిగేలా చేయటం, కొన్ని అవయావాల్లో కణాలు తిరిగి పనిచేసేలా చేయటం అంటే అత్యద్భుతమనే చెప్పాలి. సైంటిఫిక్‌ జర్నల్‌ నేచర్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ అద్భుతం గురించి అమెరికాలోని యేల్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మాట్లాడుతూ..'కణాలు తిరిగి పనిచేయటానికి తాము సరికొత్త సాంకేతికతను వాడామని తెలిపారు. అవయవ మార్పిడిలో ఈ పరిశోధన కొత్త అవకాశాలకు నాంది పలుకుతుంది అని వెల్లడించారు. మరణించిన తర్వాత అవయవాలు ఎక్కువ సమయం సజీవంగా ఉండటానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడునుంది. దీంతో చనిపోయినవారి అవయవాలు సేకరించి అవసరమైనవారికి అమర్చే విషయంలో ఇదో గొప్ప పరిశోధన అని చెప్పి తీరాలి. ప్రపంచవ్యాప్తంగా అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మందికి ఈ పరిశోధన ఒక వరంగా మారనుంది. యేల్‌ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌ డేవిడ్‌ యాండ్రిజెవిక్‌ మాట్లాడుతూ..'అన్ని కణాలు వెంటనే మృతిచెందవని..ఆ తరువాత చాలా ప్రక్రియ ఉంటుందని..సరిగ్గా ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఆయా అవయవాలను పునరుద్ధరించవచ్చు'అని వెల్లడించారు. ఇంతకుముందు కూడా అమెరికాకు చెందిన పరిశోధకుల టీమ్ పందుల మెదడులో కణాలు తిరిగి పనిచేసేలా చేసింది. ఈ క్రమంలో ఈ కొత్త అధ్యయనంలో కూడా అదే టెక్నాలజీని ఉపయోగించారు. ఆ టెక్నాలజీతో కేవలం మెదడుకే కాకుండా మొత్తం శరీరానికి విస్తరించారు. ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు ముందుకు పరిశోధనలకు ఉపయోగించిన పందుల్లో గుండెపోటు వచ్చేలా చేశారు. ఆ తరువాత కొంతసేపటికి పందుల శరీరంలో రక్తప్రసరణ ఆగిపోయాక తమ టెక్నిక్‌ను వినియోగించారు. పందుల రక్తం, సింథటిక్‌ హెమోగ్లోబిన్‌, కణాలను రక్షించేలా..రక్తం గడ్డకట్టకుండా చూసే మెడిసిన్ కలిగి ఉన్న లిక్విడ్‌ను చనిపోయిన పందుల శరీరాల్లోకి పంపించారు. అనంతరం రక్తప్రసరణ తిరిగి ప్రారంభమైంది. అలా గుండె, కాలేయం, మూత్రపిండాలు వంటి కీలక అవయవాల్లో మళ్లీ కణాలు పనిచేయడం ప్రారంభించాయి. అలా చేసిన ప్రక్రియలో భాగంగా ఆ అవయవాలు తిరిగి పనిచేయటం ప్రారంభించి ఆరు గంటలపాటు అవి పనిచేశాయని పరిశోధకులు తెలిపారు. కణాల మృతిని నిలుపుదల చేయొచ్చని తమ పరిశోధన ద్వారా అర్థమవుతోందని శాస్త్రవేత్త నేనడ్‌ సెస్టన్‌ తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu