Ad Code

వాట్సాప్‌లో కాల్ లింక్స్‌ ఫీచర్‌ !


జూమ్, గూగుల్ మీట్, ఫేస్‌టైమ్ వంటి కాలింగ్ యాప్స్‌ వీడియో కాల్స్‌లో యూజర్లు ఈజీగా జాయిన్ అయ్యేందుకు కాల్ లింక్స్‌ ఫెసిలిటీని ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్  కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. ఈ వారంలోనే అందుబాటులోకి రానున్న కాల్ లింక్స్ ఫీచర్‌తో ఒకే ఒక ట్యాప్‌తో వాట్సాప్‌ కాల్‌లో జాయిన్ అవ్వచ్చని ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ప్రకటించారు. వాట్సాప్ హెడ్ విల్ క్యాథ్‌కార్ట్ కూడా ట్విట్టర్ వేదికగా ఈ ఫీచర్ ఈ వారంలోనే రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు. ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్ యూజర్లు కాల్ లింక్‌ను ఉపయోగించి ఆన్ గోయింగ్ కాల్‌లో చేరవచ్చు. ఈ ఫెసిలిటీ ఈ వారం నుంచి ఆడియో, వీడియో కాల్స్ రెండింటికీ అందుబాటులో ఉంటుంది. కాల్ లింక్‌ను కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు. తద్వారా వారు ఒకే ఒక్క క్లిక్‌తో మీ ఆడియో/వీడియో కాల్స్‌లో జాయిన్ అవ్వడం సాధ్యమవుతుంది. ఈ ఫీచర్ మీకింకా రాకపోతే వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. ఒకవేళ న్యూ అప్‌డేట్ ఇప్పటికీ రాకపోతే ఈ వారం చివరి వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన వారు కాల్స్ ట్యాబ్‌పై క్లిక్ చేసి "క్రియేట్ కాల్ లింక్ ఆప్షన్‌పై నొక్కి కాల్ లింక్‌ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కాల్ లింక్‌ను ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మాత్రమే కాదు మీ కాంటాక్ట్స్‌లో లేని వారితో కూడా షేర్ చేసుకోవచ్చు. అయితే వాట్సాప్‌ను ఉపయోగించని వారికి లింక్ పంపితే, వారు యాప్‌ డౌన్‌లోడ్ లింక్‌కి రీడైరెక్ట్ అవుతారు. వాట్సాప్‌లో గరిష్ఠంగా 32 మంది ఒకేసారి సేఫ్ & ఎన్‌క్రిప్టెడ్ గ్రూప్ వీడియో కాల్స్‌ చేసుకునేందుకు వీలుగా ఒక ఫీచర్ టెస్ట్ చేయడం ప్రారంభించినట్లు జుకర్‌బర్గ్ తాజాగా తెలిపారు. ప్రస్తుతానికి వాట్సాప్‌లో గ్రూప్ కాలింగ్‌తో ఎనిమిది మంది ఒకేసారి వీడియో కాల్స్ చేయడం కుదురుతుంది. ఈ లిమిట్‌ను 32కి పెంచుతామని ఏప్రిల్‌లోనే మెటా ప్రకటించింది. అయితే ఇప్పుడు దీనిని కొందరికే టెస్ట్ చేస్తున్నట్లు మెటా సీఈవో వెల్లడించారు. ఏప్రిల్ నెలలో కంపెనీ కేవలం వాయిస్ కాల్ లిమిట్ మాత్రమే పెంచింది. వాట్సాప్‌లో కమ్యూనిటీల ఫీచర్‌లను టెస్ట్ చేయడం కూడా మెగా కంపెనీ మొదలెట్టింది. దీని సహాయంతో చాలా గ్రూప్స్‌ అడ్మిన్లు ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసుకొని అక్కడ అనేక విషయాలపై చర్చించవచ్చు. పంపించిన వాట్సాప్ మెసేజ్‌లను ఎడిట్ చేసేందుకు కూడా ఒక ఫీచర్‌ను మెటా తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ ఫీచర్ టెస్టింగ్‌ను కూడా ఆరంభించింది. ఓన్ చాట్, కెమెరా షార్ట్‌కర్ట్, వీడియో కాల్ డిజిటల్ అవుతార్‌ లాంటి మరెన్నో ఫీచర్లను కూడా వాట్సాప్ త్వరలోనే పరిచయం చేయనుంది.

Post a Comment

0 Comments

Close Menu