Ad Code

ట్విటర్ ఉద్యోగులు 'బ్లూ బర్డ్‌'తో ట్వీట్లు !


ట్విటర్‌లో మిగిలిన ఉద్యోగుల్లో కొందరు ప్యాకేజీ తీసుకుని బయటపడాలని, ఎలన్ మస్క్  ప్రకటించిన హార్డ్‌కోర్ పని విధానం నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరు ట్విటర్ కంపెనీలో తమ తీపి, చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. తమ లాప్‌టాప్‌లకు బ్లూ బర్డ్ స్టిక్కర్లు, ఇతర సందేశాలు, చిత్రాలను పెట్టి, పోస్ట్ చేస్తున్నారు. వీరు పోస్ట్ చేస్తున్న స్టిక్కర్లు వినూత్నంగా ఉంటున్నాయి. ట్విటర్‌కు చెందిన ఐకానిక్ బ్లూ బర్డ్‌ను రకరకాలుగా చిత్రీకరిస్తున్నారు. #LoveWhereYouWorked, #OneTeam వంటి ప్రజాదరణ పొందిన హ్యాష్‌ట్యాగ్‌లను పోస్ట్ చేస్తున్నారు. పక్షులు నిజమైనవి కాదని, మేలుకోవాలని చెప్తున్నారు. ఎలన్ మస్క్ ట్విటర్  యాజమాన్య బాధ్యతలను స్వీకరించిన వెంటనే ఆ కంపెనీలోని మొత్తం 7,500 మంది ఉద్యోగుల్లో దాదాపు సగం మందిని తొలగించారు. ఆ తర్వాత మిగిలిన ఉద్యోగులు హార్డ్‌కోర్ వర్క్ కల్చర్‌తో పని చేయాలని చెప్పారు. ఇష్టపడినవారు ఆ విషయాన్ని ధ్రువీకరించేందుకు ఓ లింక్‌ను పంపించారు. ఈ లింక్ క్లిక్ చేసి,  గురువారం సాయంత్రం 5 గంటల్లోగా సైన్ అప్ చేయాలని చెప్పారు. అలా పని చేయడానికి ఇష్టం లేనివారు మూడు నెలల జీతం తీసుకుని వెళ్లిపోవచ్చునని చెప్పారు. భారత దేశంలోని ట్విటర్ ఉద్యోగులకు రెండు నెలల జీతం మాత్రమే ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం మిగిలిన సుమారు 4,000 మంది ఉద్యోగుల్లో సగం మందికి పైగా ఈ ప్యాకేజ్ తీసుకుని వెళ్లిపోవడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. మస్క్ చెప్పిన హార్డ్‌కోర్ పని విధానంలో పని చేయడం సాధ్యం కాదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటువంటివారు తమ ల్యాప్‌టాప్‌లకు బ్లూ బర్డ్, ఇతర బొమ్మలను, సందేశాలను పెడుతూ ట్వీట్లు చేస్తున్నారు. ''నేను నిజంగా రోలర్‌కోస్టర్ నుంచి బయటపడ్డాను'' అని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లియీ చోంగ్ పేర్కొన్నారు. ఏడేళ్ళకుపైగా తాను పని చేసిన వ్యక్తులతో పని చేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ట్విటర్‌లో తాను చాలా నేర్చుకున్నానని, అందుకు అందరికీ కృతజ్ఞతలని మరో ఉద్యోగి తెలిపారు. ఆరు సంవత్సరాలుగా తాను అద్భుతమైన సహోద్యోగులు, స్నేహితులతో కలిసి పని చేశానని, ఇది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇక ముందడుగు వేయవలసిన సమయం ఆసన్నమైందన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu