Ad Code

ట్విట్టర్‌ బ్లూ టిక్‌పై యూటర్న్‌ ?


ఎలాన్‌ మస్క్‌ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. సీఈవో సహా ఉన్నతాధికారులకు ఊస్టింగ్‌ ఆర్డర్స్‌ ఇచ్చి ఇంటికి పంపిన ఆయన, ఇక, డబ్బులు వసూలు కార్యక్రమానికి తెరలేపారు.. ట్విటర్లో అధికారిక ఖాతాలకు ఇచ్చే 'బ్లూ టిక్'ను ప్రీమియం సర్వీసుగా మార్చేశార. ఈ బ్లూ టిక్స్‌కు నెలవారీ ఛార్జీలు ప్రకటించిన మస్క్ ఇప్పటికే దానిని అమల్లో పెట్టారు. అయితే, ఇదే ఈ సోషల్‌ మీడియా దిగ్గజానికి తలనొప్పిగా మారిపోయిందట.. దీనివల్ల నకిలీ ఖాతాలు ఇబ్బ డిముబ్బడిగా పెరిగిపోవడంతో ఈ సర్వీసును నిలిపివేయడమే ఉత్తమమా? అనే సందిగ్ధంలో ఉన్నారని తెలుస్తోంది.. అయితే, శుక్రవారం మధ్యాహ్నం నుంచి ట్విటర్ బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్‌ కనిపించడం లేదని కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి.. అయితే, ట్విటర్‌ మస్క్‌ చేతిలోకి వెళ్లకముందే.. ప్రభుత్వ విభాగాలు, కార్పొరేట్ సంస్థలు, ప్రముఖులు, జర్నలిస్టులు.. ఇలా ఎవరి ఖాతాలనైనా వెరిఫై చేసి ఈ 'బ్లూ టిక్' కేటాయించేవారు. దీంతో ఆ ఖాతా ఆ సంస్థది.. ఆ వ్యక్తిది అని నమ్మేందుకు కచ్చితమైన ఆధారం ఉన్నట్టుగా ఉండేది.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఈ 'బ్లూ టిక్' సర్వీసులో మార్పులు చేశారు. నెలవారీ ఛార్జీలతో ప్రీమియం వెర్షన్‌ తీసుకొచ్చారు.. అంటే.. బ్లూటిక్‌ కావాలంటే.. డబ్బులు చెల్లించాలని.. అంతేకాదు.. నెలకు 8 డాలర్లు చెల్లించినవారికి ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే 'బ్లూ టిక్' ఇవ్వడం ప్రారంభించారు.. ఇప్పటికే భారత్‌లోనూ ఈ సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చారు.. ఇదే సమయంలో.. నకిలీ బెడద మరింత పెరిగిపోయినట్టు విమర్శలు వస్తున్నాయి.. ప్రముఖ బ్రాండ్లు, సంస్థలు, ప్రముఖ వ్యక్తుల పేర్లతో నకిలీ ఖాతాలను తెరిచి.. డబ్బులు చెల్లించి.. బ్లూటిక్‌ పొందుతున్నారు. అంతేకాదు.. వారికి ఇష్టంవచ్చినవి ఆ ఖాతాల్లో ట్వీట్‌ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు.. వాటికి కూడా బ్లూటిక్ ఉండటంతో.. ఇదే అసలైనా ఖాతానా? లేకా నకిలీదా? అనేది గుర్తించడం కూడా గందరగోళంగా మారిపోయింది.. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుండడంతో.. ఈ సర్వీసును ట్విట్టర్‌ నిలిపివేసినట్లు సమాచారం.. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఈ ఆప్షన్‌ కనిపించకపోవడంతో.. 'బ్లూ టిక్'పై ట్విట్టర్‌ యూ టర్న్‌ తీసుకుందనే ప్రచారం సాగుతోంది. మరి.. మన మస్క్‌ ఎలాంటి స్టెప్‌ తీసుకుంటారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది.. ట్విట్టర్‌లో నకిలీ ఖాతాలు ఎక్కువగా ఉన్నాయని.. కొనుగోలు సమయంలోనే ఆరోపించి వెనక్కి తగ్గిన మస్క్‌.. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో దిగివచ్చి.. ట్విట్టర్‌ కొనుగోలు చేశారు.. కానీ, ఇప్పుడు మస్క్‌ తీసుకున్న నిర్ణయంతో ట్విట్టర్‌లో మరింత గందరగోళమైన పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu