Ad Code

సగటున 3 గంటలు సెల్ ఫోన్లను వాడుతున్న పిల్లలు !


మొబైల్ ఫోన్ ని గతంలో దూరంగా ఉన్నవారితో మాట్లాడటానికే ఎక్కువగా వినియోగించేవారు. కానీ ఇప్పుడు మాటలు తక్కువ, సెల్ ఫోన్ తో ఆటలు ఎక్కువ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. పెద్దలే కాదు, చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. వారికంటూ సొంతగా ఓ ఫోన్ లేకపోయినా పిల్లలు రోజులో సగటున 3 గంటలు సెల్ ఫోన్లను అంటి పెట్టుకుని ఉంటున్నారని లోకల్ సర్కిల్స్ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు దేశంలోని 287 జిల్లాల్లో దాదాపు 65 వేలమంది పేరెంట్స్ నుంచి సేకరించిన సమాచారం ద్వారా ఈ సర్వే రిపోర్ట్ విడుదల చేశారు. వయసుతో సంబంధం లేదు, 9 ఏళ్లనుంచి 17 ఏళ్లలోపు ఉన్న పిల్లలు తక్కువలో తక్కువ 3గంటలసేపు సెల్ ఫోన్ తో కాలక్షేపం చేస్తున్నారు. వీడియోలు చూడటం, ఆన్ లైన్ గేమ్స్ ఆడటం, సోషల్ మీడియాలో చాటింగ్.. ఇలా ఉంటుంది వారి వ్యవహారం. తల్లిదండ్రులు కోప్పడినా, భయపెట్టినా, బతిమిలాడినా ఫలితం ఉండటంలేదు. విచిత్రం ఏంటంటే.. తల్లిదండ్రులు కూడా అదే స్థాయిలో ఫోన్లకు బానిసలైపోతున్నారు, ఇక పిల్లల సంగతి చెప్పేదేముంది. 9 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలు సెల్ ఫోన్లకు బానిసలుగా మారారని 40 శాతం తల్లిదండ్రులు వెల్లడించారు. 13-17 ఏళ్లలోపు వారు రోజూ మూడు గంటలకుపైగా సెల్ ఫోన్లు చూస్తున్నారని, 62 శాతం మంది తల్లిదండ్రులు తెలిపారు. సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్‌ చేసేందుకు కనీస వయస్సును 13 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచాలని 68 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చాలావరకు సోషల్ మీడియా, ఆన్‌ లైన్ వీడియో ప్లాట్‌ ఫాంలలో అకౌంట్‌ తెరిచేందుకు కనీస వయస్సు 13 ఏళ్లుగా ఉంది. దీన్ని పెంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే వయస్సు నిర్థారణకు ఎలాంటి రుజువులు అడగరు కాబట్టి, చిన్న వయసు వారు కూడా తమ పేరుతో సోషల్ మీడియా అకౌంట్లను ఈజీగా ఓపెన్ చేస్తున్నారు. కరోనా సమయంలో ఆన్ లైన్ చదువులకోసం తల్లిదండ్రులే పిల్లలకు ఫోన్లు అలవాటు చేశారు. కొన్ని సందర్భాల్లో తమ స్థోమతకు మించి తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు కొనివ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆన్ లైన్ క్లాసులు లేకపోయినా పరిస్థితి మాత్రం మారలేదు. అప్పుడు పాఠాలకోసం చూసేవారు, ఇప్పుడు గేమ్స్ ఆడుకోడానికి ఫోన్లను వాడుతున్నారు. దాదాపుగా ప్రతి ఇంట్లో ఉన్న సమస్య ఇదే. ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయింది. ప్రతి పిల్లవాడు సెల్ ఫోన్ కి బానిస అయిపోతున్నాడు. 

Post a Comment

0 Comments

Close Menu