అంగారక గ్రహంపై పరిశోధనలకు ప్రయోగించిన నాలుగేండ్ల తర్వాత నాసా ఇన్‌సైడ్ ల్యాండర్ చివరకు తన కార్యకలాపాలను ముగించేందుకు సిద్ధమైంది. 2018 నుంచి మార్స్ అంతర్గత నిర్మాణంపై కీలకమైన సమాచారాన్ని శాస్త్రవేత్తలకు అందించింది. తన శక్తి తక్కువైపోయిందని, ఇదే చివరి ఫొటో కావచ్చుననే కాప్షన్‌తో నాసా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇన్‌సైట్ ల్యాండర్ తీసిన ఒక ఫొటోను పోస్ట్ చేసింది. అంగారకుడిపై భూకంపాలను గుర్తించి వాటిపై అధ్యయనం చేసేందుకు అమెరికాకు చెందిన నాసా 2018 లో మార్స్ పైకి ఇన్‌సైట్ ల్యాండర్‌ను పంపింది. ఇటీవల తన చివరి ఫొటోను పంపింది. సోలార్ ప్లేట్లపై దుమ్ము, ధూళి చేరడంతో దాని శక్తి మెల్లమెల్లగా క్షీణిస్తున్నది. దీంతో ' నా శక్తి తగ్గిపోయింది. అందుకని ఇదే నా చివరి ఫొటో కావచ్చు. మిషన్ బృందంతో సాధ్యమైతే మాట్లాడుతూ ఉంటాను. త్వరలో సైన్ ఆఫ్ చేస్తాను. నాతో ఇన్నాళ్లు ఉన్నందుకు ధన్యవాదాలు' అని ఇన్‌సైట్ ల్యాండర్ పంపిన సందేశాన్ని నాసా ట్విట్టర్‌లో షేర్ చేసింది. నాసా పోస్ట్ చేసిన ఈ ట్వీట్‌ను ఇప్పటివరకు 6.5 లక్షకు పైగా లైక్ చేశారు. 'సోలార్ ప్యానెల్స్ దుమ్ము, ధూళితో కప్పుకపోవడంతో శక్తిని ఉత్పత్తి చేసుకోవడం కష్టతరంగా ఉన్నదని, తన కార్యకలాపాలు ముగించే సమయం దగ్గర పడింది' అని నవంబర్ 10 న నాసా తన ట్విట్టర్ హ్యాండిల్‌పై రాసింది. ఈ ట్వీట్ కూడా ఇన్‌సైట్ ల్యాండర్ కార్యకలాపాలు త్వరలో ముగుస్తాయనే వాస్తవాలను సూచిస్తుండటం ఆసక్తికరం.
0 Comments