Ad Code

దేశీయ మొబైల్‌ ఓఎస్‌ 'భారోస్‌' !


దేశీయంగా స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మరో కొత్త ఓఎస్‌ అందుబాటులోకి వచ్చింది. భారోస్‌ పేరుతో ఐఐటీ మద్రాస్‌, జండ్‌కాప్స్‌ సంస్థ సంయుక్తంగా ఈ ఓఎస్‌ను రూపొందించాయి. కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ నిధులతో ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసినట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా వంద కోట్ల మొబైల్‌ వినియోగదారుల సమాచారం భద్రంగా ఉండేలా, సౌకర్యంగా వినియోగించుకునేలా ఇది ఉంటుందని వెల్లడించింది. ఈ ఓఎస్‌లో ఎలాంటి డీఫాల్ట్‌ యాప్‌లు ఉండవు. యూజర్‌ తనకు నచ్చిన, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే యాప్‌లను ఎంపిక చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. సాధారణంగా ఆండ్రాయిడ్‌ లేదా ఐఓఎస్‌ లో కొన్ని యాప్‌లు డీఫాల్ట్‌గా వస్తాయి. యూజర్‌కు వాటి అవసరం లేకున్నా ఫోన్‌లో ఉండిపోతాయి. దీనివల్ల ఫోన్‌ మెమొరీపై భారం పడుతుంది. భారోస్‌లో డీఫాల్ట్‌ యాప్స్‌ లేకపోవడం వల్ల యూజర్‌కు ఫోన్ మెమొరీ ఎక్కువ అందుబాటులో ఉంటుంది. భారోస్‌ ఇన్‌స్టాల్ చేసుకున్న ఫోన్లకు ప్రైవేట్‌ యాప్‌ స్టోర్‌ సర్వీస్‌  అందుబాటులో ఉంటుంది. ఇందులో సురక్షితమైన, గోప్యతకు భంగం కలిగించని యాప్‌లు మాత్రమే ఉంటాయి. వీటిని టెక్‌ నిపుణులు వివిధ దశల్లో పరిశీలించిన అనంతరం పాస్‌లోకి అనుమతిస్తారు. దీనివల్ల యూజర్‌కు నమ్మకమైన యాప్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. సాధారణంగా ప్లేస్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌లో ఉండే కొన్ని థర్డ్‌పార్టీ యాప్‌లు యూజర్‌ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంటాయి. ఈ నేపథ్యంలో భారోస్‌ ద్వారా యూజర్లు పూర్తి సురక్షితమైన యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ఓఎస్‌కు సంబంధించిన అప్‌డేట్‌లు అన్ని నేటివ్‌ ఓవర్‌ ది ఎయిర్‌ ద్వారానే వస్తాయని డెవలపర్స్ చెబుతున్నారు. దీనివల్ల యూజర్‌ ప్రమేయం లేకుండా ఓఎస్ అప్‌డేట్‌లు అన్ని ఆటోమేటిగ్గా ఇన్‌స్టాల్‌ అవుతాయి. ఫోన్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండటం వల్ల ఫోన్‌లో డేటా కూడా సురక్షితంగా ఉంటుందని అంటున్నారు. భారోస్‌తో ఫోన్‌ బ్యాటరీ పనితీరు మరింత మెరుగవుతుందని జాండ్‌కె కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం యూజర్ల ఫోన్లలో ఉన్న ఓఎస్‌ల కంటే భారోస్‌తో బ్యాటరీ పనితీరు రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతుందని తెలిపింది. డీఫాల్ట్‌ యాప్స్‌ లేకపోవడం, యూజర్‌ తనకు అవసరమైన యాప్స్‌ను మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవడం వల్ల బ్యాటరీపై భారం తగ్గుతుంది. ప్రస్తుతం ఈ ఓఎస్‌ను గోప్యత, భద్రత పరంగా సున్నితమైన సమాచారం వినియోగించే సంస్థలకు మాత్రమే అందిస్తున్నారు. ఒకవేళ ఏదైనా సంస్థ భారోస్‌ను ఉపయోగించాలనుకంటే ఆయా సంస్థలు ప్రైవేట్‌ 5జీ నెట్‌వర్క్ ద్వారా ప్రైవేటు క్లౌడ్‌ సేవలను ఉపయోగిస్తుండాలని డెవలపర్లు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu