Ad Code

4జీ కంటే 5జీ విస్తరణ ఖర్చు తక్కువే !


దేశ టెలికాం పరిశ్రమలో 4Gలాగా 5G సేవల రోల్‌అవుట్ క్యాపిటల్ తక్కువగా వుండే అవకాశాలు కన్పిస్తున్నాయి.  రాబోయే మూడు సంవత్సరాల్లో దేశంలో 70 శాతం ఏరియాను 5జీ కవరేజీలోకి తెచ్చేందుకు భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్ రూ. 45,400 కోట్లు మూల ధన వ్యయం చేయనుంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ దేశంలో 75 శాతం మేర 5జీ కవరేజీని విస్తరించడానికి రూ. 65,500 కోట్లు ఖర్చు చేయనుంది. అయితే ఈ మూలధన వ్యయం అనేది 4G నెట్ వర్క్ విస్తరణకు గతంలో ఈ రెండు టెలికామ్ కంపెనీలు వెచ్చించిన దాని కంటే తక్కువే. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి భారతి ఎయిర్‌టెల్ 85%, జియో 95% 5జీ కవరేజీని సాధించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాయి. అప్పటివరకు అంటే.. వచ్చే నాలుగైదు ఏళ్లలో ఎయిర్‌టెల్ రూ. 66,600 కోట్లు, జియో రూ. 94,000 కోట్ల మూలధన వ్యయం చేయనున్నాయి. ఎయిర్‌టెల్ మూడేళ్లలో రూ.75,000 కోట్ల 5జీ క్యాపెక్స్‌కు మార్గదర్శకంగా నిలిచింది. ఈ రెండు కంపెనీలు 2023, 2024 ఆర్ధిక సంవత్సరాలలో 5జీ నెట్ వర్క్ విస్తరణకు ఎక్కువ ఖర్చు చేయనున్నాయి.2025 నుంచి వాటి మూలధన ఖర్చులు తగ్గిపోతాయి.ఈనేపథ్యంలో Jio ఇప్పటికే రూ.2 లక్షల కోట్ల విలువైన 5G పెట్టుబడులను ప్రకటించింది. ఇందులో 5జీ స్పెక్ట్రమ్‌పై రూ. 90,000 కోట్లు మరియు 5జీ నెట్‌వర్క్ విస్తరణకు రూ. 60-70,000 కోట్లు ఉన్నాయి. ఒకసారి గతంలోకి వెళ్తే 2016-17లో ఎయిర్ టెల్ 4జీ నెట్ వర్క్ విస్తరణకు రూ. 1,11,500 కోట్లు ఖర్చు చేసింది. ఇక అదే సమయంలో టెలికాం లోకి తొలిసారి వచ్చిన జియో 4జీ నెట్ వర్క్ కోసం అత్యధికంగా రూ.2,27,400 కోట్లను ఖర్చు చేయాల్సి వచ్చింది. సెల్ టవర్లు, మరియు ఆప్టిక్ ఫైబర్‌ నెట్ వర్క్ నిర్మాణ ఖర్చులు కూడా ఇందులో ఉన్నాయి. ఎయిర్‌టెల్ వద్ద 900 MHz, 1,800 MHz, 2,100 MHz , 2,300 MHz అనే నాలుగు 4G బ్యాండ్‌లతో పాటు ఒక 5G స్పెక్ట్రమ్ బ్యాండ్ (3,500 మెగాహెర్ట్జ్) ఉంది. రిలయన్స్ జియో వద్ద 700 MHz మరియు 3,500 MHz కెపాసిటీ కలిగిన రెండు 5G బ్యాండ్‌లతో పాటు 800 MHz, 1,800 MHz మరియు 2,300 MHz సామర్థ్యం కలిగిన మూడు 4G బ్యాండ్‌లు ఉన్నాయి. ఈ ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా హై-స్పీడ్ 5జీ టెలికం సేవలు అందుబాటులోకి తెస్తామని రిలయన్స్ జియో ఇటీవల పునరుద్ఘాటించింది. `నెలల వారీగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నగరాలు, పట్టణాలు, తాలూకాల పరిధిలో జియో 5జీ సేవలు విస్తరించాలన్న లక్ష్యాన్ని చేరుకుంటున్నాం. 2023 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి తహసీల్‌, తాలుకా, పట్టణం పరిధిలో 5జీ సేవలు అందుబాటులో ఉంటాయి` అని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. ఇప్పటి వరకు దేశంలోని 277 నగరాల పరిధిలో జియో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దేశంలో 2024 నాటికి 15 కోట్ల 5జీ మొబైల్‌ సబ్‌స్క్రైబర్లు ఉంటారని నోకియా అంచనా వేసింది.అదే సమయంలో 2024 కల్లా దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సబ్‌స్కైబర్ల సంఖ్య 99 కోట్లకు చేరుతుందని నోకియా పేర్కొంది. అలాగే అప్పటికీ 2జీ వినియోగించే వారి సంఖ్య 15 కోట్లుగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌లో 35 కోట్ల 2జీ సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు తెలిపింది. మరోవైపు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2 కోట్ల 5జీ కస్టమర్లు ఉన్నట్లు వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu