Ad Code

దేశవ్యాప్తంగా 7,432 పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ EV స్టేషన్లు !


దేశంలో ఎలక్ట్రిక్ కార్లు, బైక్స్, స్కూటర్స్ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.దేశవ్యాప్తంగా 7,432 పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ EV స్టేషన్లను ఏర్పాటు చేయడానికి మూడు PSU చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ. 800 కోట్లు మంజూరు చేసింది. FAME ఇండియా ఫేజ్ 2 స్కీమ్ ఈ నిధులను మంజూరు చేసినట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం లకు మంత్రిత్వ శాఖ ₹560 కోట్లు లేదా మొత్తంలో 70 శాతం ఫండ్స్ ను ఇప్పటికే విడుదల చేసింది. తొలి విడతగా దేశంలోని ఆయా చమురు మార్కెటింగ్ కంపెనీల రిటైల్ అవుట్‌ లెట్‌లలో EV పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌ల అప్‌స్ట్రీమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఛార్జింగ్ పరికరాలను అమరుస్తారు. వీటి ఇన్‌స్టాలేషన్ మార్చి 2024 నాటికి పూర్తవుతుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,586 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. కొత్త 7,432 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌ల జోడింపు EV ఛార్జింగ్ ఎకోసిస్టమ్‌కు గణనీయమైన పుష్ అవుతుంది. ఎలక్ట్రిక్ 2-వీలర్స్, 4-వీలర్స్, లైట్ కమర్షియల్ వెహికల్స్, మినీ వెహికల్స్ ఛార్జింగ్ కు అవాంతరాలు తొలగిపోతాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్ ఎకోసిస్టమ్‌కు ఈ చర్య ఊతం ఇస్తుంది. దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మారేలా ప్రోత్సహిస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కర్ణాటక, కేరళ, తమిళనాడులోని 15 హైవేలపై 19 EV ఫాస్ట్ ఛార్జింగ్ కారిడార్‌లను ఇప్పటికే ప్రకటించింది. ఒక్కో కారిడార్‌లలో దాదాపు ప్రతి 100 కి.మీకి ఒక EV ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. కేరళలో 19 ఇంధన కేంద్రాలతో మూడు కారిడార్లు, కర్ణాటకలో 33 ఇంధన కేంద్రాలతో 6 కారిడార్లు, తమిళనాడులో 58 ఇంధన కేంద్రాలతో 10 కారిడార్‌లను ప్రారంభించినట్లు తెలిపింది. BPCL ఇంధన స్టేషన్ల వద్ద 125 కి.మీల వరకు డ్రైవింగ్ పరిధిలో ఒక్కో EVని ఛార్జ్ చేసేందుకు కేవలం 30 నిమిషాలు పడుతుంది. రెండు ఛార్జింగ్ స్టేషన్ల మధ్య 100 కి.మీల దూరం ఉంటుందని చెప్పారు. ఫాస్ట్ ఛార్జర్లు వినియోగానికి చాలా ఈజీగా ఉంటాయని తెలిపారు. అవసరమైతే సహాయక సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu