Ad Code

తోక చుక్కలా మారిన బుధగ్రహం !


సౌర కుంటుంబంలో భూమితోపాటూ మిగతా గ్రహాలను కూడా తరచూ గ్రహశకలాలు ఢీకొడుతూనే ఉంటాయి. అలాగే సౌర తుఫాన్లు సమస్యలు తెస్తూ ఉంటాయి. బుధగ్రహం సూర్యుడికి అతి దగ్గరగా ఉంటుంది. పైగా గ్రహాల్లో ఇదే చిన్నది. ఈ గ్రహాన్ని తరచూ సౌర తుఫాన్లు వెంటాడుతూ ఉంటాయి. అందువల్ల ఈ గ్రహానికి ఎప్పుడూ సమస్యలు ఉంటాయి. ప్రస్తుతం బుధగ్రహం సూర్యుడికి అతి దగ్గరగా ఉంది. దీన్నే పెరిహేలియన్ దశ అంటారు. ఈ దశలో సౌర తుఫాన్ల తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు చిన్న చిన్న గ్రహశకలాలు తరచూ ఈ గ్రహాన్ని ఢీకొట్టి పగిలిపోతూ దుమ్ములా మారుతుంటాయి. అటు సౌర తుఫాన్లూ, ఇటు గ్రహశకలాల దుమ్ము వల్ల మెర్క్యురీ గ్రహానికి ఇప్పుడో తోక తయారైంది. సోడియం వాయువులతో కూడిన ఆ తోక 2.4 కోట్ల కిలోమీటర్ల దూరం వరకూ ఉంది. పెరిహేలియన్ దశకు వెళ్లిన ప్రతిసారీ మెర్క్యురీకి ఇలాంటి తోక వస్తుంది. తిరిగి సూర్యుడికి కాస్త దూరంగా వెళ్లినప్పుడు ఈ తోక కూడా మాయమవుతుంది. భూమికి ఇలాంటి పరిస్థితి రాదంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి వైపు వచ్చే సౌర తుఫాన్లు మరీ తీవ్రంగా ఉండవు. వాటి వల్ల శాటిలైట్లకు మాత్రమే అప్పుడప్పుడూ సమస్యలు వస్తుంటాయి. గ్రహశకలాలు భూమిని ఢీకొట్టడం అనేది కూడా చాలా తక్కువ. చిన్న చిన్న రాళ్లు మాత్రమే అప్పుడప్పుడూ ఆకాశం నుంచి భూమిపై పడుతున్నాయి. ఇవేవీ భూమికి తోకను ఇవ్వలేవు. టెలిస్కోప్ ద్వారా తోకతో ఉన్న బుధగ్రహాన్ని ఈ నెలంతా చూడొచ్చు. కాకపోతే తోకను స్పష్టంగా చూడాలంటే మాత్రం 589 నానోమీటర్ ఫిల్టర్ వాడాలని చెబుతున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu