Ad Code

రికార్డు స్థాయి యూపీఐ పేమెంట్స్‌ !


ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) లావాదేవీలు రికార్డు అయ్యాయి. గత నెలలో 890 కోట్ల లావాదేవీలు జరిగితే వాటి విలువ రూ.14.07 లక్షల కోట్లు. మార్చితో పోలిస్తే విలువలోనూ, లావాదేవీల పరిమాణంలోనూ స్వల్పంగా వృద్ధిరేటు నమోదైంది. మార్చిలో 870 కోట్ల లావాదేవీలు జరిగితే వాటి విలువ రూ.14.05 లక్షల కోట్లు. గత నెల చివరి మూడు రోజుల్లోనే దాదాపు రూ.1.37 లక్షల కోట్ల విలువైన 100 కోట్ల లావాదేవీలు నమోదు కావడం ఆసక్తికర పరిణామం. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో ట్రాన్సాక్షన్లు విలువ ప్రకారం 59 శాతం, పరిమాణంలో 44 శాతం పురోగతి రికార్డయింది. గతేడాది ఏప్రిల్‌లో 558 కోట్లకు పైగా లావాదేవీలు నమోదైతే రూ.9.8 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. ఐటీ మినహాయింపు కోసం పెట్టుబడులు, చిన్న మొత్తాల్లో కొనుగోళ్లు, ఇయర్ ఎండ్ ట్రాన్సాక్షన్లు, ఆన్‌లైన్ పేమెంట్స్ .. ఈ ఏడాది మార్చిలో పెరిగాయి. దాని కొనసాగింపుగానే గత నెలలో యూపీఐ పేమెంట్స్ ఎక్కువయ్యాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది. అంతకు ముందు ఫిబ్రవరి (2023)లో 750 కోట్ల లావాదేవీల్లో రూ.12.35 లక్షల కోట్ల విలువైన పేమెంట్స్ జరిగాయి. గతంతో పోలిస్తే ఏప్రిల్ డిజిటల్ చెల్లింపులు పెరిగినా, గత మార్చితో పోలిస్తే ఇమిడియెట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్‌) సర్వీసులు స్వల్పంగా తగ్గాయి. మార్చిలో 497 మిలియన్ల లావాదేవీల్లో రూ.5.46 లక్షల కోట్ల ఐఎంపీఎస్ పేమెంట్స్ జరిగితే, ఏప్రిల్‌లో 496 మిలియన్ల ట్రాన్సాక్షన్లలో రూ.5.21 లక్షల కోట్ల చెల్లింపులే జరిగాయి. ఫిబ్రవరిలో 447.8 మిలియన్ల లావాదేవీల విలువ రూ.4.68 లక్షల కోట్లు. ఇదిలా ఉంటే గత నెలలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వద్ద టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ట్రాన్సాక్షన్లు స్వల్పంగా తగ్గాయి. మార్చిలో ఫాస్టాగ్ లావాదేవీలు 306.3 మిలియన్లు నమోదైతే, ఏప్రిల్‌లో 0.47 శాతం తగ్గి 305 మిలియన్లకే పరిమితం అయ్యాయి. అయితే, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.5067 కోట్ల నుంచి రూ.5149 కోట్లకు (రెండుశాతం) పెరిగాయి. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఫాస్టాగ్ పేమెంట్స్ పరిమాణంలో 15 శాతం, విలువలో 22 శాతం గ్రోత్ నమోదు చేశాయి. ఈ ఏడాది మార్చితో పోలిస్తే గత నెలలో ఆధార్ అనుసంధాన చెల్లింపుల వ్యవస్థ (ఏఈపీఎస్‌) చెల్లింపులు ఏడు శాతం తగ్గాయి. మార్చిలో 109.7 మిలియన్ల లావాదేవీలు నమోదైతే, ఏప్రిల్‌లో 102 మిలియన్ల లావాదేవీలకు పరిమితం అయ్యాయి. మార్చిలో రూ.30,541 కోట్ల చెల్లింపులు జరిగితే ఏప్రిల్‌లో రూ.29,640 కోట్లతోనే సరిపెట్టుకున్నాయి. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే ఫాస్టాగ్ పేమెంట్స్ నాలుగు శాతం పెరిగాయి.

Post a Comment

0 Comments

Close Menu