కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత గిరిరాజ్ సింగ్‌పై దాడికి యత్నం జరిగింది. బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఒక యువకుడు మంత్రిపై దాడికి ప్రయత్నించడంతో సింగ్ మద్దతుదారులు అతన్ని వెంటనే అదుపులోనికి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ''మౌల్వి తరహాలో దుస్తులు ధరించి గడ్డంతో ఉన్న యువకుడు ఒక పిటిషన్ తీసుకుని నా వద్దకు వచ్చాడు. పిటిషన్‌ను పరిశీలించాల్సిందిగా కోరాడు. జనతా దర్బార్ ముగిసిందని, సకాలంలో వచ్చి ఉండాల్సిందని అతనికి చెప్పాను. దాంతో అతను గట్టిగా కేకలేస్తూ నాకు వ్యతిరేకంగా నినాదులు చేశాడు. ఒక దశలో అతను భౌతిక దాడికి పాల్పడతాడని అనిపించింది. యువకుడు మాట్లాడిన తీరు చాలా దారుణంగా ఉంది. ఇలాంటి దాడులకు భయపడేది లేదు'' అని గిరిరాజ్ సింగ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' లో తెలిపారు. కాగా, ఈ ఘటనలో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు బెగుసరాయ్ ఎస్పీ మనీష్ తెలిపారు.
0 Comments