అక్టోబర్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఇసుక రీచ్‌లలో ఇసుక పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం కారణంగా ఇసుక తవ్వకాలపై రకరకాల సమస్యలు వచ్చాయన్నారు. తాము త్వరలోనే పేదలందరికీ ఉచితంగా ఇసుక అందిస్తామని, ఇసుక సమస్యలు పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు. గత ఐదేళ్ల పాలనలో జరిగిన అవకతవకల వల్ల దెబ్బతిన్న వ్యవస్థలను తాము సరిదిద్దుతున్నామని చెప్పారు. జగన్ ఇసుకను ఆదాయ వనరుగా చూస్తే, తాము ప్రజలకు ఉచితంగా ఇసుక అందించాలని నిర్ణయించామన్నారు. వర్షాకాలంలో వరదల కారణంగా ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇసుక తవ్వకాలను నిలిపివేశామని, అక్టోబర్ 15 నుంచి రీచులను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే, బోట్ మెన్ సొసైటీలు, పట్టా భూముల్లో కూడా ఇసుక తవ్వకాలు చేపడతామని, రవాణా ఛార్జీల సమస్యను కూడా పరిష్కరించనున్నామని అన్నారు.
0 Comments