ఇజ్రాయెల్ సైన్యం తాజాగా దక్షిణ గాజాలోని ఓ జోన్‌లో గుడారాల కింద తలదాచుకున్న పాలస్తీనియన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో పాలస్తీనియన్లు సజీవంగానే ఇసుకలో సమాధి అయ్యారు. డజన్లకొద్దీ పాలస్తీనియన్లు మృతి చెందారని పాలస్తీనా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది. హమాస్ వ్యక్తులను లక్ష్యం చేసుకుని దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇళ్ల నుండి బయటకు వెళ్లమని ఆదేశాలు ఇచ్చినప్పటి నుండి వేలాదిమంది పాలస్తీనియన్లు ఈ టెంట్లకిందే తలదాచుకుంటున్నారు. తాజా దాడిలో కనీసం 65 మంది చనిపోయి లేదా గాయపడి ఉంటారు. అయితే ఇప్పటికే ఎంతోమందిని ఇసుకలో ఖననం చేయడం వల్ల.. తాజా మరణాల సంఖ్యను అంచనా వేయలేకపోయితున్నట్లు గాజా సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ వెల్లడించింది. కాగా, ఈ ఘటనపై ఓ పాలస్తీనియుడు రేద్ అబూ ముఅమ్మర్ మాట్లాడుతూ.. 'ఇజ్రాయెల్ సైన్యం మా గుడారాలపై దాడి చేసినప్పుడు నేను కూడా ఇసుకలో కూరుకుపోయాను. ఎలాగోలా నేను ఇసుక నుంచి బయటకు వచ్చి, నా భార్య, కుమార్తెల కోసం ఇసుకలో వెతికాను. ఆ ఇసుకలో నాకు మా పొరుగువారి శరీర భాగాలు కనిపించాయి. ఈ దాడిలో మా కుటుంబం మృతువు నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నాం' అని ఆయన అన్నారు. ఈ దాడిలో 40 మందికి పైగా మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు. చాలామంది ప్రజలు గల్లంతయ్యారని గాజా ప్రభుత్వ మీడియా పేర్కొంది.
0 Comments