ప్రకృతి, మానవ తప్పిదం రెండూ కలిసి విజయవాడను కష్టాల్లోకి నెట్టేసింది. తప్పిదం ఎవరిదైనా విజయవాడవాసులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షాలు వారిని నట్టేటా ముంచేయడంతో బెజవాడవాసులు బిత్తరపోయారు. కట్టుబట్టలతో బయటపడిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి బాధ చూస్తుంటే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది. ఈ క్రమంలో బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు వీలైనంత కృషి చేస్తున్నారు. నిమిషం వృథా చేయకుండా సహాయ చర్యల్లో మునుగుతున్నారు. స్వయంగా రంగంలోకి దిగి సేవలు అందిస్తుండడంతో సీఎం చంద్రబాబుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ప్రశంసించడం గమనార్హం. వరదలతో చిక్కుకున్న విజయవాడను బుధవారం షర్మిల సందర్శించారు. ప్రకాశం బ్యారేజ్‌లో వరద ప్రవాహాన్ని పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. 'బుడమేరు సృష్టించిన భీభత్సo చాలా దారుణం. విజయవాడ మొత్తం అతలాకుతలమైంది. తీవ్ర నష్టం జరిగింది' అని తెలిపారు. బీజేపీ స్పందించకపోవడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఘోర విపత్తు సంభవించినా ప్రధాన మంత్రి మోడీ స్పందించకపోవడం దారుణం. బీజేపీ అధికారంలోకి రావడానికి రాష్ట్రం నుంచి 25 ఎంపీలపై ఆధారపడ్డారు. ఇప్పుడు మోదీకి రాష్ట్ర ప్రజల కష్టాలు కనపడడం లేదు. పదేళ్లుగా బీజేపీకి ఇతర పార్టీలు బానిసలుగా మారాయి' అని మండిపడ్డారు. 'ప్రత్యేక హోదా దగ్గర నుంచి ప్రతి అంశంలోను ఏపీకి మోడీ వెన్నుపోటు పొడిచాడు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఈ వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. కష్టాల్లో ఉన్న ఏపీని ఆదుకోవాలి' అని కేంద్ర ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. నష్టపరిహారాన్ని వెంటనే ప్రకటించాలని విజ్ఞపతి చేశారు. వరద సహాయాల్లో మునిగిన సీఎం చంద్రబాబుపై షర్మిల ప్రశంసించారు. 'విపత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు అభినందననీయం' అని షర్మిల తెలిపారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో బుడమేరు సమస్యను పరిష్కరించడానికి ఆపరేషన్ కొల్లేరు, బుడమేరు డైవర్షన్ స్కీమ్‌కి రూపకల్పన చేశారు' అని వివరించారు. 'బుడమేరు పరిసరాల్లో ఆక్రమణల వల్లే ఈ విపత్తు సంభవించింది' అని తెలిపారు. రాపిడ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి ఆక్రమణలు తొలగించకపోతే ఇలాంటి విపత్తులు సంభవిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. పదేళ్లుగా టీడీపీ, వైఎస్సార్‌సీపీ బుడమేరు సమస్య పట్ల శ్రద్ద చూపలేదని ఆరోపించారు. వెంటనే వరద సహాయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేసి బాధితులను ఆదుకోవాలని కోరారు. 'పడవలు కావాలనే వదిలారా? దీనికి భాద్యులు ఎవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి' అని డిమాండ్ చేశారు.
0 Comments