తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పట్టణం వరదనీటిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. వైష్ణవి పాఠశాల సమీపంలోని వాగులో రెండు కార్లు, ఆటోలు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. కారులో ఓ మృతదేహం ఉన్నట్లు అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. మృతుడిని రవి అనే వ్యక్తిగా నిర్ధరించారు. శ్రీమన్నారాయణ కాలనీలో మరో మృతదేహం లభ్యమైంది. మృతుడిని శ్రీనివాసనగర్‌కు చెందిన టీచర్ వెంకటేశ్వర్లుగా గుర్తించారు. శనివారం రాత్రి బైక్‌పై ఇంటికి వెళ్తూ వరదలో ఆయన గల్లంతయ్యారు. ఈ క్రమంలో ఆదివారం ఆయన మృతదేహాన్ని గుర్తించారు. పట్టణంలో వరద ధాటికి డివైడర్ల పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో పలు డివైడర్లను పగులగొట్టి సహాయక చర్యలు చేపట్టారు. అనంతగిరి, మేళ్లచెరువు రహదారులపై పూర్తిగా రాకపోకలను నిలిపేశారు. కోదాడ పెద్ద చెరువు మత్తడి దూకడంతో నయానగర్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్‌కు వెళ్లే జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
0 Comments