హైదరాబాద్ నుంచి అయోధ్యతో పాటు కాన్పూర్, ప్రయాగరాజ్ వెళ్లే ప్రయాణికులకు హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్-కాన్పూర్, హైదరాబాద్-అయోధ్య సర్వీసులు సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కాగా… ఇవి వారానికి నాలుగు రోజులు సర్వీసును అందిస్తాయి. హైదరాబాద్-ప్రయాగరాజ్, హైదరాబాద్-ఆగ్రా మధ్య సర్వీసులు సెప్టెంబర్ 28 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఇవి వారానికి 3 రోజుల సర్వీసును అందిస్తాయి. ఈ నూతన సర్వీసులపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాగరాజ్ - హైదరాబాద్ మధ్య సర్వీసులు మంగళవారం, గురువారం, శనివారం తేదీల్లో నడుస్తాయి. తొలి ఫ్లైట్ 166 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి శనివారం ఉదయం 08.55 గంటలకు బయల్దేరింది. హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికులకు ఇండిగో స్టేషన్ మేనేజర్ చంద్ర ఖాత్ స్వాగతం పలికారు. పలువురు ప్రయాణికులకు పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఆ తర్వాత ఉదయం 11.20 గంటలకు ప్రయాగరాజ్ నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ బయల్దేరింది. మొత్తం 145 ప్రయాణికులు వెళ్లగా… మధ్యాహ్నం 1. 10 గంటలకు హైదరాబాద్ కు చేరుకున్నట్లు ఇండిగో యాజమాన్యం వెల్లడించింది. మరోవైపు విశాఖ నుంచి కొత్తగా 4 విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ ఇటీవలనే ప్రకటించింది. సెప్టెంబర్ నెల నుంచి ఒక సర్వీస్, అక్టోబర్ నెలలో మరో మూడు సర్వీసులు ప్రారంభించనుంది. అక్టోబర్ 27న విశాఖ-విజయవాడ నూతన సర్వీసును ప్రారంభించనున్నారు. కొత్త సర్వీసులు విశాఖ నుంచి ప్రతిరోజూ ఉదయం 9.15 గంటలకు బయలుదేరతాయి. అక్టోబర్ నెలలో విశాఖ-హైదరాబాద్ సర్వీసును కూడా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ విమానం విశాఖ నుంచి బయలుదేరుతుంది. విశాఖ-అహ్మదాబాద్ మధ్య వారానికి మూడు రోజుల పాటు కొత్త సర్వీసును నడపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోషియేషన్ తెలిపింది.
0 Comments