Ad Code

హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ !


హైదరాబాద్‌ నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టులో లాయర్ వేణుమాధవ్ పిటిషన్‌ దాఖలు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం చేయవద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్‌ తన పిటిషన్‌లో కోరారు. ఈ క్రమంలో హైడ్రాను కూడా పిటిషనర్‌ ప్రతివాదిగా చేర్చాలని కూడా కోరారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. మొదట హైడ్రాను ప్రతివాదిగా చేర్చడాన్ని కోర్టు తిరస్కరించింది. అనంతరం, పిటిషనర్‌ వాదనలతో ఏకీభవించిన కోర్టు, ట్యాంక్‌ బండ్‌లో నిమజ్జనాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ సందర్బంగా కోర్టు ధిక్కరణపై పిటిషనర్‌ ఆధారాలు చూపించలేకపోయారు అంటూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. నిమజ్జనం జరుగుతున్న చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్‌ సరికాదని కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా కోర్టులో పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతులు లేవంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ట్యాంక్ బండ్ మార్గంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గణేష్‌ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. మరోవైపు హుస్సేన్‌ సాగర్‌లో వినాయకుని నిమజ్జనాలకు అనుమతులు ఇవ్వకపోతే ఎక్కడ నిమజ్జనం చేయాలనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం విషయంలో ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 


Post a Comment

0 Comments

Close Menu