సత్వర న్యాయం అందించాలంటే కోర్టుల్లో వాయిదాల సంస్కృతి మారాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. పెండింగు కేసులు భారీ స్థాయిలో పెరిగిపోవడం అతిపెద్ద సవాల్ అన్నారు. జిల్లా న్యాయవ్యవస్థ జాతీయ సదస్సులో ప్రసంగించిన ఆమె.. న్యాయాన్ని రక్షించాల్సిన బాధ్యత దేశంలోని న్యాయమూర్తులందరిపై ఉందన్నారు. ''కోర్టులకు హాజరు కావడమనేది సామాన్యులపై ఒత్తిడి పెంచుతుంది. కోర్టుల్లో వాయిదాల పద్ధతిని మార్చేందుకు అన్ని విధాలా కృషి చేయాలి. న్యాయాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది'' అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో మహిళా అధికారుల సంఖ్య పెరగడంపై సంతోషం వ్యక్తం చేశారు. భారత్ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌లు హాజరయ్యారు. మరోవైపు ముందురోజు ఇదే సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. మహిళలపై జరిగే నేరాల్లో బాధితులకు సత్వరం న్యాయం లభించాలని, అప్పుడే వారికి భద్రతపై భరోసా లభిస్తుందని ఉద్ఘాటించారు. ఈ క్రమంలోనే 2019లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల పథకాన్ని తీసుకువచ్చామని ప్రధాని మోడీ గుర్తుచేశారు.
0 Comments