ఇంగ్లాండ్ రాజధాని లండన్ కేంద్రంగా భారత్-బ్రిటన్ మధ్య సంబంధాలతో పాటు భారతీయుల కోసం పనిచేస్తున్న సంస్థ ఇండియా గ్లోబల్ ఫోరం. కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో ఇండియా గ్లోబల్ ఫోరం కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో పాటు ఇతర దేశాల్లోనూ తమ ఉనికిని విస్తరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా భారత్ కు చెందిన బీబీసీ టాప్ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ కరణ్ వర్మను నియమించుకుంది. భారత్ పాటు అంతర్జాతీయంగా ఇతర దేశాలతోనూ వ్యూహాత్మక భాగస్వామ్యాల ఏర్పాటు కోసం పనిచేస్తున్న ఇండియా గ్లోబల్ ఫోరం టీమ్ కు ఉదయ్ కరణ్ వర్మ నేతృత్వం వహించబోతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయంగా తమ ఉనికిని చాటుకుంటున్న ఇండియా గ్లోబల్ ఫోరం కు ఉదయ్ నాయకత్వం మరింత బలం చేకూర్చబోతోందని ఫోరం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇండియా గ్లోబల్ ఫోరం ఉదయ్ కరణ్ వర్మను నియమించుకోవడం వెనుక ఆయన ప్రొఫైల్ కీలకమని తెలుస్తోంది. ఇప్పటివరకూ భారత్ లో బీబీసీ టాప్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న ఉదయ్ కరణ్ వర్మ కు సంస్ధలో ఏడేళ్లకు పైగా పనిచేసిన అనుభవం ఉంది. ఇటీవల కంట్రీ మేనేజర్‌గా నియమించిన ఉదయ్ కు వ్యూహాత్మక భాగస్వామ్యాల విషయంలో అనుభవం ఉండటం ఐజీఎఫ్ కు కీలకంగా మారనుంది. దీంతో ఆయన్ను ఇండియా గ్లోబల్ ఫోరమ్‌లో ప్రెసిడెంట్ - బిజినెస్ రిలేషన్స్‌గా నియమించారు. ఈ నియామకం అనేక కీలకాంశాలతో సహా ఐజీఎఫ్ వ్యూహాలకు మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు. ఉదయ్ నియామకంపై ఇండియా గ్లోబల్ ఫోరమ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ మనోజ్ లాడ్వా స్పందిస్తూ " భారత్ తో పాటు ఐజీఎఫ్ కూ ఇది ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. తమ అద్భుతమైన టీమ్ లోకి ఉదయ్ ని స్వాగతిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వ్యాపార సంబంధాలను పెంపొందించడంలో ఉదయ్ అపారమైన అనుభవం భవిష్యత్తులో తమకు ఉపయోగ పడుతుందన్నారు. ఉదయ్ కరణ్ వర్మకు టాప్ బ్రాండ్లలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉందని, బీబీసీ, నెట్ వర్క్ 18,ఈఎస్పీఎన్-స్టార్ స్పోర్ట్స్, బీబీసీలో ఆయన కీలక హోదాల్లో పనిచేసారని తెలిపారు. అలాగే బీబీసీ స్టోరీవర్క్స్,బీబీసీ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌ను ప్రారంభించడం, ఆదాయం, కంటెంట్, వ్యూహాల్లో ఆయన నాయకత్వ పాత్ర ఉందన్నారు.
0 Comments