Ad Code

చంద్రబాబుతో లులు గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ భేటీ !

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి చూపుతోంది. సీఎం చంద్రబాబుతో ఆ సంస్థ ఛైర్మన్ యూసఫ్ అలీ భేటీ అయ్యారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులపై చర్చించారు. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు. లులు బృందంతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో పెట్టుబడులకు లులు గ్రూప్ నాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అనంతరం వైసీపీ హయాంలో లులు గ్రూప్ రాష్ట్రం నుంచి వెనక్కు వెళ్లింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెట్టుబడులపై ఆసక్తి చూపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ ఛైర్మన్ యూసఫ్ అలీ భేటీలో పెట్టుబడులపై కీలక చర్చ జరిగింది. విశాఖపట్నంలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్‌ మార్కెట్, మల్టీప్లెక్స్‌ల నిర్మాణంతోపాటు ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడులకు యూసుఫ్‌ అలీ ఆసక్తి చూపారు. సులభతర, వేగవంతమైన వ్యాపారానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు వారికి తెలిపారు. లులు గ్రూప్‌ వంటి సంస్థల రాకతో పారిశ్రామికవేత్తల్లో ఏపీలో పెట్టుబడులపై చర్చ జరుగుతుందని, ఇది రాష్ట్రానికి మేలుచేస్తుందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల్ని ప్రోత్సహించేందుకు తీసుకొస్తున్న నూతన పాలసీలను వివరించారు. ఏపీలో తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్‌ ఆసక్తి చూపడం, మూడు ప్రాంతాల్లో ప్రాజెక్టులకు ముందుకు రావడంపై సీఎం ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఛైర్మన్‌తోపాటు సంస్థ ప్రతినిధుల్ని సత్కరించారు. రూ.2,200 కోట్ల పెట్టుబడితో విశాఖలో షాపింగ్‌మాల్, 5వేల సీట్ల సామర్థ్యంతో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్‌ కేంద్రం, ఐదు నక్షత్రాల హోటల్‌ నిర్మాణంతో 10వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో 2018లో లులు గ్రూప్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 13.83 ఎకరాల భూములను కేటాయించడంతో లులు గ్రూప్‌ డిజైన్లు తయారు చేయించింది. ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ.. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ఒప్పందాన్నే రద్దుచేసింది. జగన్‌ ప్రభుత్వ తీరుతో నొచ్చుకున్న లులు గ్రూప్‌.. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టబోమని ప్రకటన విడుదల చేసింది. వెంటనే తెలంగాణ, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ సహా వివిధ రాష్ట్రాలు ఆహ్వానించడంతో అక్కడకు వెళ్లిపోయింది. తెలంగాణ, తమిళనాడుల్లో రూ.3,500 కోట్ల చొప్పున పెట్టుబడులతో ప్రాజెక్టులు ప్రారంభించింది. జగన్‌ తీరు నచ్చక వెళ్లిపోయిన ఆ సంస్థ ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం కావడంతో మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ తలుపు తట్టింది.

Post a Comment

0 Comments

Close Menu