తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెంకు చెందిన మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ఇన్‌ఛార్జి మాచర్ల ఏసోబు అలియాస్ ఎల్లన్న అలియాస్ జగన్ అలియాస్ రణదేవ్ దాదా (71) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో మంగళవారం భద్రతాదళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. టేకులగూడెంకు చెందిన మాచర్ల చంద్రయ్య, గట్టు మల్లమ్మ దంపతుల పెద్ద కుమారుడు ఏసోబు. దళిత కుటుంబంలో జన్మించిన ఆయన ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ ప్రాంతంలోని దొర వద్ద కొన్నాళ్లు పాలేరుగా పని చేశాడు. భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకు ఆకర్షితుడై దానికి నాయకత్వం వహించేవాడు. రాడికల్ యువజన సంఘం నాయకుడిగా పనిచేస్తూ.. 1991లో పీపుల్స్‌వార్ అన్నసాగర్ దళంలో చేరాడు. దళంలో అంచెలంచెలుగా అగ్రనేతగా ఎదిగాడు. వ్యూహరచనలో పేరు పొందాడు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏసోబు 33 ఏళ్ల ప్రస్థానం ముగిసింది. ఆయన భార్య లక్ష్మి గతేడాది మృతి చెందింది. ఏసోబుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. 2004లో మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరిపిన సమయంలో తన తండ్రిని కలుసుకున్నానని కుమారుడు మహేశ్‌చంద్ర కన్నీటిపర్యంతమయ్యాడు. ఏసోబుపై పోలీసులు గతంలో రూ.25 లక్షల రివార్డు ప్రకటించారు. దంతెవాడ-బీజాపుర్ జిల్లాల సరిహద్దు లోహగావ్, పురంగెల్, ఆండ్రీ అటవీ ప్రాంతాల్లో మంగళవారం మావోయిస్టు దళాలు-భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో మృతి చెందిన 9 మంది మావోయిస్టుల వివరాలను బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్, దంతెవాడ డీఐజీ కమలోచన్ కశ్యప్, ఎస్పీ గౌరవ్‌రాయ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. మృతుల్లో రణదేవ్‌తో పాటు పీఎల్‌జీఏ సభ్యురాలు శాంతి, ఏరియా కమిటీ సభ్యురాలు సుశీల మడకం, కట్టేకల్యాణ్ ఏరియా కమిటీ సభ్యురాలు గంగి ముచాకీ, సురక్షా దళ సభ్యురాలు లలిత, ఆంధ్రా-ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ గార్డ్ కవిత, మలంగీర్ ఏరియా కమిటీ సభ్యుడు కోసా మాద్వి మృతి చెందిన వారిలో ఉన్నారు. వీరిపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉంది. ప్లాటూన్ సభ్యుడు కమలేష్, సురక్షా దళ సభ్యురాలు హిడ్మే మడకం కూడా ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు.
0 Comments