ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో పలు ఆలయాలకు సంబంధించి జాతీయ మీడియాలో ఓ సంచలన కథనం పబ్లిష్ అయింది. కొన్ని హిందూ సంస్థలు, కొందరు హిందూ మత గురువులు అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో పలు ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించారని ఆయా కథనాల్లో ప్రస్తావించారు. ఇలా సాయిబాబా విగ్రహాన్ని తొలగించిన ఆలయాల జాబితాలో వారణాసిలోని బడా గణేశ్ ఆలయం కూడా ఉందని పేర్కొన్నారు. సనాతన్ రక్షక్ దళ్ సహా పలు హిందూ సంస్థలు వారణాసిలోని ఆలయాల నుంచి సాయి బాబా విగ్రహాలను తొలగించాలని డిమాండ్ చేశాయి. సనాతన్ రక్షక్ దళ్ అధ్యక్షుడు అజయ్ శర్మ మాట్లాడుతూ.. ''మేం సాయిబాబాకు వ్యతిరేకం కాదు. అయితే సాయిబాబా విగ్రహాలకు సాధారణ ఆలయాలలో చోటు ఇవ్వకూడదని మేం అంటున్నాం'' అని పేర్కొన్నారు. ''సాయిబాబాకు ప్రత్యేకంగా ఆలయాలు ఉండాలి. భక్తులు ఆ ఆలయాలకు వెళ్లి బాబాను దర్శించుకోవచ్చు. సనాతన ధర్మం ప్రకారం సూర్యుడు, విష్ణువు, శక్తి, గణేశుడు, శివుడి విగ్రహాలను మాత్రమే ఆలయాల్లో ప్రతిష్ఠించాలి'' అని అజయ్ శర్మ తెలిపారు. ఇంకొన్ని రోజుల్లోనే వారణాసిలోని బుధేశ్వర్, అగస్త్యేశ్వర్ ఆలయాల్లోని సాయిబాబా విగ్రహాలను కూడా తొలగిస్తారని ఆయన చెప్పారు. గతంలో శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. సాయిబాబాను పూజించడాన్ని ఆయన తప్పుపట్టారు. ''ప్రాచీన వేదాలు, పురాణాల్లో సాయిబాబా గురించి ప్రస్తావన లేదు'' అని స్వామి స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యానించారు. ''సాయిబాబాను మహాత్ముడిలా ఆరాధించుకోవచ్చు కానీ దేవుడిలా పూజించకూడదు'' అని ఆచార్య ధీరేంద్ర శాస్త్రి కామెంట్ చేశారు. అయితే వారణాసిలోని పలు ఆలయాల నుంచి సాయిబాబా పవిత్ర విగ్రహాలను తొలగించిన అంశంపై సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా స్పందిస్తూ.. ''ఇది బీజేపీ క్రియేట్ చేసిన కొత్త రాజకీయ డ్రామా'' అని విమర్శించారు. ''మహారాష్ట్రలో లక్షలాది మంది సాయిబాబా భక్తులు ఉన్నారు. హిందూ మతం ఎన్నో రకాల ఆలోచనా విధానాలు, వైఖరులు, సిద్ధాంతాలను విశాలమైన ఆలోచనలతో స్వీకరించింది. ఇప్పుడు ఇలాంటి వివాదానికి తెరలేపడం సరికాదు'' అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించాలనే డిమాండ్‌ను సాయిబాబా భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇతరుల మనోభావాలను గౌరవించాలని సూచిస్తున్నారు. మానవ జీవితానికి సరైన మార్గం చూపిన ఘనత సాయిబాబాదే అని అంటున్నారు.
0 Comments