Ad Code

లైనక్స్‌ ఆధ్యుడు లైనస్‌ టోర్‌వాడ్స్‌



లైనక్స్‌ ఈ పదం తెలియని కంప్యూటర్‌ ప్రియులండరు. యునెక్స్‌, డాస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ రాజ్యమేలుతున్న రోజులలో వాటికి ధీటుగా ఉచిత లైనక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను సృష్టించిన ఘనత లైనస్‌ టోర్‌వాడ్స్‌దే. మైక్రోసాఫ్ట్‌ వాటి కంపెనీలను గడగడలాడించే స్థితికి వచ్చిన ఈ లైనక్స్‌ ఓఎస్‌ అభివృద్ధిలో ఎందరో మహానుభావులున్నప్పటికి ఆధ్యుడు మాత్రం లైనస్‌. బడా బడా కంపెనీలు సైతం లైనెక్స్‌ ఓఎస్‌ ఆధారంగా పనిచేసే సాఫ్ట్‌వేర్‌లను తయారు చేస్తున్నాయంటే దీని వాడకం ఏ విధంగా పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. సర్వర్లకు సైతం సురక్షిత ఓఎస్‌గా గణతకెక్కింది. అయితే ఒక కొరత మాత్రం ఇప్పటికీ వెంటాడుతుంది. అదేమంటే ముద్రణ రంగంలో పేజీనేషన్‌ వర్డ్‌ కంపోజింగ్‌, ఫొటోషాప్‌ తదితర సాఫ్ట్‌వేర్‌లను వేగవంతంగా పని చేయించే కృషి ఇంకా ఊపందుకోలేదు. దీనిని కూడా భర్తీ చేస్తే లైనెక్స్‌కు తిరుగేలేదు.
బడా కంపెనీల కబంధాస్తల నుండి కంప్యూటర్‌ వినియోగదారులను రక్షించినది ఈ లైనక్సే. లైసెన్స్‌ సాఫ్ట్‌వేర్‌లకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యమానికి నాంది పలికింది ఈ లైనెక్స్‌. మన రాష్ట్రంలో కూడా ఈ ఉద్యమం ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ ఫౌండేషన్‌ ద్వారా సాగుతుంది. ఔత్సాహిక ప్రోగ్రామర్లు ఈ సాఫ్ట్‌వేర్‌ని సోర్స్‌కోడ్‌తో సహా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకుని, తమకు నచ్చిన విధంగా మోడిఫై చేసుకొని వినియోగించుకోవడం, ఇతరులకు పంచడంతో పాటు నామ మాత్ర ధరకు వ్యాపారం చేసుకునే వీలు వుండటంతో ఇది ఎంతో ప్రీతిపాత్రమైంది. దీని అభివృద్ధికి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల మంది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు తమ వంతు కృషి చేసినప్పటికీ దీని ముఖ్యాంతర్భాగమైన కెర్నల్‌ని తయారుచేసి ప్రపంచానికి అందించి అమెరికాలోని శాంతాకార్లాలో ఉద్యోగిగానే సాధారణ జీవితం గడుపుతున్నాడు. కొన్ని వందల కోట్లను ఆర్జించే అవకాశానిన వదులుకుని, అత్యుత్తమ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ప్రజలకు అందించిన లైనస్‌ టోర్‌వాడ్స్‌ గురించి తెలుసుకుందాం.
1969 డిసెంబర్‌ 28న ఫిన్‌లాండ్‌లోని హెల్సంకీలో స్వీడీష్‌ మాట్లాడే మైనారిటీ కుంటుంబంలో లైనస్‌ టారోవాడ్స్‌ జన్మించాడు. ఆయన తాతగారు హెల్సింకీలోని విశ్వ విద్యాలంలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. ఆయన లైనస్‌ చిన్నతనంలో ఒక కంప్యూటర్‌ను బహూకరించాడు. ఆ కంప్యూటర్‌ యొక్క ఆర్కిటెక్చర్‌ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. విశ్వ విద్యాలయంలో కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌లో విద్యార్థిగా వున్నప్పుడు కొనుగోలు చేసిన కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కోసం వెదికే పనిలో భాగంగా తానే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తయారు చేయాలనే ఆసక్తి కలిగింది. అప్పటిలో పర్సనల్‌ కంప్యూటర్‌లలో డాస్‌ను ఉపయోగించేవారు. దాని మీద ఎటువంటి అప్లికేషన్‌లు రన్‌ చేయాలన్నా యునెక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ఉపయోగించేవారు. యూనివర్శిటీలో కూడా యునెక్స్‌నే నేర్పేవారు. అయితే అది పర్సనల్‌ కంప్యూటర్లలో పనిచేసేదికాదు. ఇది పని చేయాలంటే అత్యంత ఖరీదైన వర్క్‌ స్టేషన్లు అవసరముండేది. దీనితో సాధారణ వినియోగదారుడు దానిని వినియోగించడం సాధ్యమయ్యేదికాదు. అప్పట్లో పర్సనల్‌ కంప్యూటర్‌లలో యునెక్స్‌ని పనిచేయించడానికి మినిక్స్‌ వంటి కొన్ని ప్రాజెక్ట్‌లు నడిచినప్పటికీ అవి అంతగా విజయవంతం కాలేదు. దీనితో పర్సనల్‌ కంప్యూటర్‌పై పనిచేసే యునిక్స్‌ని పోలిన ఆపరేటింగ్‌ సిస్టమ్‌ని తయారుచేసే పనిని ప్రారంభించాడు. 1991 మొదట్లో ప్రత్యామ్నాయ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ యొక్క కెర్నల్‌ని తయారుచేసే పనిని పూర్తి చేశాడు. ఫ్రీ యునెక్స్‌కి హ్యాకర్‌ 'ప్రీయక్స్‌'కి పర్యాయపదంగా ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కి 'ప్రీయక్స్‌' అని పేరు పెట్టారు. అయితే దానిని ఎఫ్‌టిపి సైట్‌లో అప్‌లోడ్‌ చేసేటప్పుడు సైట్‌ మేనేజర్‌ ఈ పేరు బాగోలేదని లైనక్స్‌ అని పెట్టాడు.
తొలి వర్షన్‌ ఆవిష్కరణ
1991 అక్టోబర్‌లో లైనక్స్‌ 0.2 వర్షన్‌ని సైట్‌పై ఆవిష్కరించారు. కంప్యూటర్‌పై పని చేయగలిగే తొలి లైనక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఇదే. ఈ సందర్భంగా లైనస్‌ తోటి మినిక్స్‌ న్యూస్‌ గ్రూప్‌లోని ప్రోగ్రామర్లను ఈ కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేయడానికి, తమ స్వంత డైవర్‌లను వ్రాసుకోవడానికి ఆహ్వానించడంలో ఈ సరికొత్త విప్లవం ప్రారంభమైంది. ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ పనితనం చూసి ఆకర్షితులైన వినియోగదారులు దీనికి కొత్త ఫీచర్లు జోడించడం, స్వంత అప్లికేషన్లు తయారు చేయడం ప్రారంభించారు. ఔత్సాహిక ప్రోగ్రామర్లు తమ సమయాన్ని, అనుభవాన్ని, తెలివి తేటలనూ దీనిపై పెట్టి అన్ని రకాల అవసరాలకూ పనికివచ్చే ఆపరేటింగ్‌ సిస్టమ్‌గా తీర్చిదిద్దారు. ఎవరైనా ఇంటర్‌నెట్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకుని వినియోగించుకోవడం, ప్రోగ్రామింగ్‌ చేయడంతోపాటు ఈ ఓఎస్‌ని కలిగిన పిసినే వెబ్‌ సర్వర్‌గా వినియోగించుకోవడానికి వీలైంది. లైనస్‌ ఈ ఓఎస్‌ను ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ ఫౌండేషన్‌ వారి జిపిఎల్‌ (జనరల్‌ పబ్లిక్‌ లైసెన్స్‌)లో రిజిస్టర్‌ చేశారు. ఎవరైనా ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. మార్చుకోవచ్చు, అమ్ముకోవచ్చు, ఇతరులకు ఇవ్వవచ్చు. ఈ ఓఎస్‌తో పాటు తప్పనిసరిగా దాని సోర్స్‌కోడ్‌ను కూడా ఇవ్వవలసి వుంటుంది.

-సూరి

Post a Comment

0 Comments

Close Menu