Ad Code

బయో మెట్రిక్స్‌ అంటే ?





ఈ పదం సర్వ సాధారణమైంది. ప్రభుత్వ పథకాలలో, ఆఫీసులలో దీని వాడకం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. సురక్షితకు మారు పేరైంది. దానిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బయో అంటే జీవం, మెట్రిక్‌ అంటే ప్రమాణం. ఒక వ్యక్తి లేదా ప్రాణికి సంబంధించిన కొన్ని ప్రత్యేక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని ఐడెంటీని గుర్తించడాన్ని బయో మెట్రిక్‌ అంటారు. ఇది వ్యవసాయం, వైద్య రంగాల్లో 20 శతాబ్దం నుండి వినియోగంలోకి వచ్చింది. దీని ద్వారా వ్యక్తి యొక్క లక్షణాలను కంప్యూటర్‌ ద్వారా విశ్లేషించి ఆ వ్యక్తికి సంబంధించినవి నిర్ధారించవచ్చు.
నేర పరిశోధనలో నేస్తం
ఇది నేర పరిశోధనలలో నేరస్తులను కనుగొనడానికి దోహదపడుతుంది. నేర స్థలంలో వేలి ముద్రలు, కాలి ముద్రలను అందరికీ తెలిసిందే. కొన్ని సందర్భాలలో ఆ ప్రదేశాల్లో దొరికిన సిగరెట్‌ పీకలు, రక్తపు మరకల ఆధారంగా జరిగే పరిశోధనల్లో ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. అలాగే పరీక్ష హాలులోకి అనుమతించడానికి హాల్‌ టిక్కెట్లపై అభ్యర్థి ఫొటోతో పాటు పుట్టు మచ్చలు ఎక్కడ ఉన్నాయో తెల్పడం జరుగుతుంటుంది. పాస్‌పోర్ట్‌, వీసాలలో జుట్టు, కనుపాపల రంగు వంటివి కూడా పేర్కొనబడతాయి. ప్రభుత్వ పథకాలలో కను పాపలు, వేలిముద్రల ద్వారా ఐడెంటీ కార్డులను జారీ చేయడం ఇప్పుడు మనం చూస్తూనే వున్నాయి. ఇవి అన్నీ బయోమెట్రిక్‌ పద్ధతుల ద్వారా చేసే పనులే.
బయోమెట్రిక్‌ పద్ధతులు
బయోమెట్రిక్‌లో రెండు పద్దతులున్నాయి. ఒకటి గుర్తించడం, రెండవది నిర్థారించడం. ఈ రెండు ప్రక్రియలలోనూ అనేకాంశాలు పరిగణనలోకి తీసుకోబడతాయి. వేలి ముద్రలు, ముఖం, కనుపాపలు వంటివి భౌతికాంశాలు. సంతకం, కీబోర్డు, మౌస్‌ వంటి పరికరాలను ఉపయోగించే విధానం, మాట్లాడే తీరు వంటి అంశాలను ప్రవర్తన సంబంధించిన అంశాలంటారు. వీటి ఆధారంగా ఒక వ్యక్తిని ఖచ్చితంగా గుర్తించడం, అవి ఆ వ్యక్తికి సంబంధించినవే అని నిర్ధారించవచ్చు.
బయో మెట్రిక్‌ పరికరాలు
బయో మెట్రిక్‌ ద్వారా వ్యక్తులను గుర్తించడానికి రకరకాల పద్ధతులను వినియోగించ్చు. దీనికోసం పలురకాల టెక్నాలజీలు ఆవిర్భంచాయి. నేరం చేయబోయే ముందు వ్యక్తి నాడీ మండలంలో జరిగే ప్రకరణలను గుర్తించే బ్రైన్‌ ఫింగర్‌ ప్రింటింగ్‌. వేలిముద్రలను పరిశీలించి కంప్యూటర్‌ ద్వారా విశ్లేషించే ఫింగర్‌ ప్రింటింగ్‌. కనుపాలను పోల్చి చూడడం ద్వారా వ్యక్తిని గుర్తించగలిగే ఐరిష్‌ రికగేషన్‌. మాటలను గుర్తించగలిగే వాయిస్‌న రికగేషన్‌, ముఖ కవళికలు గుర్తించగలిగే ఫేస్‌ రికగేషన్‌ మొదలైనవి వీటిలో కొన్ని.
కీలకమైన సమాచారాన్ని కలిగి వున్న కంప్యూటర్లు లేదా నెట్‌వర్క్‌లలో పనిచేస్తున్న వ్యక్తికి దానిని వినియోగించడానికి అధికారం లేదా అనుమతి వుందా? లేక నేరానికి పాల్పడుతున్నాడా అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడం ద్వారా సైబర్‌ నేరాలను నివారించవచ్చు. దీనికి పాస్‌వర్డ్‌ల కన్నా బయోమెట్రిక్‌ విధానం సురక్షితం. ఈ పద్ధతి అనేకచోట్ల విరివిగా వాడకంలోకి కూడా రావడం మనం గమనించవచ్చు.
-శాంతి

Post a Comment

0 Comments

Close Menu