Ad Code

technology

సాంకేతిక పరిజ్ఞానానికి మరికొంత సృజనాత్మకత జోడిస్తే ఆన్‌లైన్‌ వీడియోలో అద్భుతాలను ఆవిష్కరించవచ్చు. కళను ఆస్వాదిస్తూనే కాసులనూ ఆర్జించొచ్చు. లేటెస్ట్‌గా దూసుకువస్తున్న ఆన్‌లైన్‌ వీడియో ఇప్పుడు వెబ్‌ ప్రపంచంలో వీరవిహారం చేస్తోంది. ఆన్‌లైన్‌ వీడియోలో తమ సత్తా చాటేందుకు ఔత్సాహికులను పలు వెబ్‌సైట్లు ఆహ్వానిస్తున్నాయి. రివెర్‌, ఫ్లిక్య్సా, మెటాకేఫ్‌, ఆటమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తదితర సైట్లు అమెచ్చూర్‌ వీడియో ప్రొడ్యూసర్లు రూపొందించిన క్లిప్పింగ్స్‌ను ప్రదర్శిస్తూ వారికి ఎంతోకొంత రాబడినీ సమకూర్చుతున్నాయి. రెవిన్యూషేరింగ్‌ (రాబడి పంపిణీ) పద్ధతిలో అమెచ్యూర్‌ ప్రొడ్యూసర్ల నుండి హోమ్‌మేడ్‌ వీడియోను ఆయా వెబ్‌సైట్లు తమ సైట్లలో పొందుపరుస్తున్నాయి.
ఔత్సాహిక వీడియో ప్రొడ్యూసర్లు వీడియోను షూట్‌ చేసి ఎడిట్‌ చేసి దాన్ని ఈ వెబ్‌సైట్లకు సబ్‌మిట్‌ చేయడం ద్వారా ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయాన్ని ఆయా సైట్లతో వీరు పంచుకునే అవకాశం ఉంది. మెయిన్‌ క్లిప్‌కు ముందూ, తర్వాత ప్రకటనలను ప్రసారం చేయడం జరుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో వెబ్‌పేజ్‌ సరౌండింగ్స్‌లో కూడా ప్రకటనలకు అవకాశం ఉంటుంది. వీడియో ప్రొడ్యూసర్లకు చెల్లింపులు సాధారణంగా ఆ సైట్‌ వీక్షకుల సంఖ్యను బట్టి ఉంటుంది. 1000 వ్యూస్‌కు 200 రూపాయలు లేదా ఒక్కో క్లిక్‌కు 50 రూపాయల వరకూ వీడియో ప్రొడ్యూసర్లకు అందే వీలుంది. రాబడి వనరులు పరిమితంగానే ఉన్నా ఎక్కువ మంది వ్యూయర్లను ఆకర్షించే విధంగా క్లిప్పింగ్స్‌ను రూపొందించి సృజనాత్మకతకు పదును పెడితే డిజిటల్‌ ప్రపంచంలో దూసుకువెళ్చచ్చు. అమెచ్యూర్ల నుండి వీడియో క్లిప్లింగ్స్‌ను ఆహ్వానించే రివెర్‌.కామ్‌ ఏమంటున్నదో చూద్దాం...' రివెర్‌ను యూజ్‌ చేయడం చాలా ఈజీ. ఆన్‌లైన్‌ వీడియోను మార్కెట్‌ చేయడం ప్రారంభించిన ఒక్క ఏడాదిలోనే వీక్షకుల నుండి అనూహ్య స్పందన వస్తోంది' అని వెబ్‌సైట్‌ మార్కెటింగ్‌, కంటెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఏంజెలా యట్‌వాన్‌ అంటున్నారు.
గతంలో అమెచ్యూర్‌ వీడియోగ్రాఫర్లు ఊహించని రీతిలో వారి సృజనాత్మకతకు తగిన ప్రతిఫలాన్ని, గుర్తింపును వారు అందుకుంటున్నారని ఆమె చెప్పారు. 2005లో ప్రారంభమైన రివెర్‌ వీడియోల కోసం తొలిసారిగా రెవిన్యూ షేరింగ్‌ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆన్‌లైన్‌ వీడియో రంగానికి ఈ వెబ్‌సైట్‌ నాంది పలికింది. వీడియో ప్లే అనంతరం వచ్చే స్టిల్‌ ఇమేజెస్‌ నుండే కంపెనీకి ప్రధానంగా ఆదాయం సమకూరుతున్నదంటే అతిశయోక్తి కాదు. వీడియో క్లిప్‌కు ముందుగా టెలివిజన్‌ ప్రకటనల తరహాలో ఈ వెబ్‌సైట్‌ వీడియో కమర్షియల్స్‌ను ప్రవేశపెట్టి నూతన టెక్నాలజీతో పాటు ఆదాయ వనరులకూ తెరతీసింది. నిషేధిత లేదా అసభ్య, అశ్లీల కంటెంట్‌ మినహా అన్ని వీడియో ప్లేలను రివెర్‌ స్వాగతిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఒకటి కన్నా ఎక్కువ వెబ్‌సైట్లు కూడా వీడియో కంటెంట్‌ను ప్రదర్శించడం ద్వారా వచ్చే రాబడిని పంచుకుంటాయి. అయితే దీంతో ఇంటర్‌నెట్‌లో ఎక్కడైనా సదరు వీడియో దర్శనమివ్వచ్చు. అయితే హోస్టింగ్‌ వెబ్‌సైట్‌ మాత్రమే దీని బ్రాండ్‌ను, పర్యవేక్షణను కలిగిఉంటుంది. వివిధ వెబ్‌సైట్ల మధ్య ఈ తరహా రెవిన్యూషేరింగ్‌ ద్వారా వీడియోగ్రాఫర్లకు పెద్దఎత్తున రాబడి సమకూరడంతో పాటు విశ్వవ్యాప్తంగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. లాస్‌ఏంజెల్స్‌కు చెందిన పండాస్మాష్‌.కామ్‌ వినూత్న ప్రోగ్రామ్‌లతో మంచి గుర్తింపు సాధించింది. వినోదంతో కూడిన స్కిట్స్‌ రూపకల్పనలో ఇది ముందుంది. కంపెనీ డెవలప్‌ చేసిన 'మారియో కార్ట్‌' గేమ్‌ రియల్‌లైఫ్‌ వెర్షన్‌ విశేషాదరణ చూరగొంది. ఇందులో పాల్గన్న కళాకారులు తమ మిమిక్రీతో వ్యూయర్స్‌ను ఆకట్టుకుంటారు. ఈ వీడియోను ఫన్నీయోర్డి వంటి పలు విభిన్న వెబ్‌సైట్స్‌లో పొందుపరిచినట్లు పండాస్మాష్‌ కో ఫౌండర్‌ శామ్‌ గ్రీన్‌స్పాన్‌ చెబుతున్నారు.
గ్రీన్‌స్పాన్‌ ఆయన సహచరులు తమ ఆపరేషన్‌కు రివెర్‌.కామ్‌ సరైన ప్లాట్‌ఫాం అని చెబుతారు. ఆకర్షణీయ రెవిన్యూ షేరింగ్‌ను అందుకోవడమే కాకుండా వెబ్‌ హోస్టింగ్‌కు ఎలాంటి చెల్లింపులు అవసరం లేకపోవడమే ఈ వెబ్‌సైట్‌ ప్రత్యేకతగా గ్రీన్‌స్పాన్‌ బృందం భావిస్తోంది. అలాగే రివెర్‌ ఇప్పటికే తెచ్చుకున్న బ్రాండ్‌ ఇమేజ్‌ కూడా తమకు ఉపకరిస్తుందని వారంటున్నారు. రివెర్‌ను పలు ఔత్సాహిక వీడియోగ్రాఫర్లు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రపంచంలో పేరుప్రఖ్యాతులు ఆర్జించేందుకు తొలిమెట్టుగా పరిగణిస్తున్నారు. అయితే దీర్ఘకాలంలో ఈ వెబ్‌సైట్ల మనుగడ, అవి అందించే రెవిన్యూ షేరింగ్‌ మోడల్‌పై బిజినెస్‌ ప్రొఫెషనల్స్‌ పెదవివిరుస్తున్నారు. అరకొర లాభాలు, పేలవమైన క్వాలిటీ కంట్రోల్‌ ప్రమాణాలు, సాంకేతిక సవాళ్లు ప్రధాన అవరోధాలని వారంటున్నారు. ఫలితంగా ప్రకటనకర్తలూ ఆన్‌లైన్‌లో తమ ప్రకటనలను ఉంచేందుకు విముఖత చూపుతారని వీరు అభిప్రాయపడుతున్నారు. వీటన్నింటికి తోడు టెలివిజన్‌, రేడియోతో పోలిస్తే ఈ నూతన వినోద మాధ్యమం ప్రకటనల రేట్లు చాలా తక్కువగా ఉండటం మరో ప్రతికూల అంశమని అంటున్నారు.
ఏదేమైనా ఆన్‌లైన్‌ వీడియో వృద్ధి చెందాలంటే కంటెంట్‌లో, వీడియో క్లిప్పింగ్స్‌లో మరింత సృజనాత్మకత ఇనుమడించాలని, ముఖ్యంగా టెక్నలాజికల్‌ అడ్వాన్స్‌మెంట్‌ చోటుచేసుకోవాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇప్పుడిప్పుడే ముందుకొస్తున్న ఆన్‌లైన్‌ వీడియోకు క్రమంగా ఆదరణ పెరుగుతున్నదని, నెమ్మదిగా ఊపందుకుంటున్నదని రివెర్‌.కామ్‌ అంటోంది. అన్ని సవాళ్లను అధిగమిస్తుందని దృఢంగా చెబుతోంది. త్వరలోనే ఆన్‌లైన్‌ వీడియో తన మార్కెట్‌ను పెంచుకుని నూతన వినోద మాధ్యమంగా అందరినీ అలరిస్తుందని రివెర్‌ చెబుతోంది. కంటెంట్‌ మెరుగుపరుచుకని, కొత్తదనంతో వస్తే ఔత్సాహిక వీడియోగ్రాఫర్లను నేటి సైబర్‌యుగం స్వాగతిస్తోంది. మరి మన వీడియోగ్రాఫర్లూ ఈ నూతన మోడల్‌ను అందిపుచ్చుకునేందుకు రెడీ కావాలి.

Post a Comment

0 Comments

Close Menu