
తమిళనాడులో ఇప్పటికే ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు రూ.2,400 కోట్లతో కొనసాగుతున్నాయి. రానున్న కొన్ని నెలల్లో ఇక్కడ విద్యుత్తు స్కూటర్ల తయారీ ప్రారంభం కానున్నట్లు ఇటీవలే సంస్థ ప్రకటించింది. ఈ నేపద్యంలో ఈ స్కూటర్ గురించి ప్రకటన వెలువడినప్పటి నుంచి దీనిపై అంచనాలు నెలకొన్నాయి. ఈ స్కూటర్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతోందన్న సంకేతాలిస్తూ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ ఓ ట్వీట్ చేశారు. బెంగళూరు వీధుల్లో ఓలా స్కూటర్‌పై చక్కర్లు కొడుతున్న వీడియోను ఉంచారు. స్కూటర్‌కు సంబంధించిన పలు ఫీచర్లను వీడియో ద్వారా పరిచయం చేశారు. ఈ బైక్ 0-60 Kmph వేగాన్ని అతి తక్కువ సమయంలోనే అందుకుంటుందంటూ భవిష్ పేర్కొన్నారు. మార్చుకునేందుకు వీలుగా ఉండే లిథియం అయాన్ బ్యాటరీతో వస్తున్న ఈ స్కూటర్ సీటు కింది భాగంలో రెండు హాఫ్ హెల్మెట్లు పెట్టేంత ఖాళీ ప్రదేశం ఉంటుందని చూపించారు. టెలీస్కోపిక్ సస్పెన్షన్, అదిరిపోయే లుక్ వంటివి పరిచయం చేశారు. ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని తెలుస్తోంది. గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది.
0 Comments