Ad Code

'క్లౌడ్'కు నిపుణుల కొరత !

 

కరోనా మహమ్మారితో వర్క్ ఫ్రం హోం.. లెర్నింగ్ ఫ్రం హోం కల్చర్ పెరిగింది. దాంతోపాటు ఐటీ ప్రొఫెషనల్స్‌కు గిరాకీ ఎక్కువైంది. ఇంతకుముందు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌), డేటా అనలిటిక్స్ తదితర సాఫ్ట్‌వేర్‌లకు డిమాండ్ ఉండేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నిపుణుల అభివృద్ధి కోసం గతేడాది ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ సదస్సు నిర్వహించింది. తాజాగా క్లౌడ్ ప్రొఫెషనల్స్ కోసం అన్వేషణ పెరుగుతున్నది. దీంతో క్లౌడ్ ప్రస్తుతం మెయిన్‌స్ట్రీమ్‌, ఫౌండేషనల్ డిజిటల్ టెక్నాలజీగా అవతరించింది. తత్ఫలితంగా ఐటీ సంస్థలు క్లౌడ్ సొల్యూషన్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. కరోనా వల్ల గతేడాదిలో భారత్‌లోనే 3.8 లక్షల మంది క్లౌడ్ సొల్యూషన్స్ నిపుణులకు డిమాండ్ వచ్చింది. 2019తో పోలిస్తే 40 శాతం ఎక్కువ. కానీ, 1.15 లక్షల మంది నిపుణులను మాత్రమే ఇండియన్ ఐటీ సంస్థలు నియమించుకోగలిగాయి. మిగతా 2.65 లక్షల పోస్టులు అలాగే ఖాళీగా ఉన్నాయని టీసీఎస్‌, యాక్సెంజర్ భాగస్వామ్యంతో నాస్కామ్ రూపొందించిన నివేదిక వెల్లడించింది. క్లౌడ్ సొల్యూషన్స్ నిపుణుల కొరత వచ్చే నాలుగేండ్ల (2025) లో 7.69 లక్షలకు చేరుతుందని నాస్కామ్ అంచనా వేసింది. అదే ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలకు క్లౌడ్ నిపుణుల కొరత 20 లక్షలు దాటుతుందని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా క్లౌడ్ సొల్యూషన్స్‌లో శరవేగంగా టాలెంట్ పూల్ నిర్మాణానికి కార్యాచరణ రూపొందించుకోవాలని నాస్కామ్ నివేదిక సూచించింది. ఈ ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగితే క్లౌడ్ టాలెంట్ పూల్‌లో భారత్‌.. ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరవచ్చు. 17-18 లక్షల మంది క్లౌడ్ నిపుణులను ఇండియన్ ఐటీ రంగం పెంచుకుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం అన్ని విభాగాల్లో క్లౌడ్ విభాగంలో 6.08 లక్షల మంది నిపుణులతో భారత్ మూడోస్థానంలో ఉంది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సొల్యూషన్స్ కోసం డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. పబ్లిక్ క్లౌడ్ సర్వీసుల డిమాండ్‌ 2022 నాటికి 20 శాతం ఎక్కువై రెవెన్యూ 398 బిలియన్ల డాలర్లకు చేరుతుందని వరల్డ్ వైడ్ ఎండ్ యూజర్ గార్టనర్ పేర్కొంది. నాస్కామ్ మరో నివేదిక ప్రకారం 2025 నాటికి గ్లోబల్ క్లౌడ్ టర్నోవర్ 800 బిలియన్ల డాలర్లకు చేరుతుందని అంచనా. భారత్‌లో వచ్చే ఏడాది నాటికి 26% గ్రోత్‌తో 5.6 బిలియన్ డాలర్లకు చేరుతుంది.

Post a Comment

0 Comments

Close Menu