Ad Code

ఎల్‌ఐసీ స్పెషల్ స్కీమ్


భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) పాలసీదారులు ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రద్దైన పాలసీలను తిరిగి అమల్లోకి తీసుకొచ్చేందుకు ఎల్‌ఐసీ ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. 'స్పెషల్‌ రివైవల్‌ క్యాంపెయిన్‌' పేరుతో ఆగస్టు 23, 2021 ప్రారంభించింది. అక్టోబరు 22, 2021 వరకు ఇది కొనసాగుతుందని ఎల్‌ఐసీ వెల్లడించింది. గత ఐదేళ్లుగా ప్రీమియం చెల్లించకుండా ఉన్న పాలసీలను పునరుద్ధరణ చేసుకునేందుకు ఈ పథకంలో వీలవుతుందని ఎల్‌ఐసీ తెలిపింది. ప్రీమియం చెల్లింపునకు అవకాశం ఉండి, ఇంకా వ్యవధి ఉన్న పాలసీలను కొన్ని నిబంధనల మేరకు తిరిగి అమల్లోకి తీసుకురావచ్చు. చెల్లించాల్సిన ప్రీమియాలకు లేట్ ఫీలో కొంత సబ్సిడీ ఇస్తున్నట్లు ఎల్‌ఐసీ పేర్కొంది. అయితే టర్మ్‌ పాలసీలకు, అధిక రిస్కు ఉన్న పాలసీలకు ఈ రాయితీ వర్తించదు. ఆరోగ్య పరీక్షల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వడం లేదు. రూ.లక్ష లోపు ప్రీమియం చెల్లించే వారికి లేల్ ఫీలో 20శాతం రాయితీ లభిస్తుంది. రూ.లక్షా నుంచి రూ.3 లక్షల లోపు ప్రీమియం ఉంటే 25 శాతం లేట్ ఫీ తగ్గుతుంది. రూ.3 లక్షలు, ఆపైన ప్రీమియానికి వర్తించే లేట్ ఫీలో 30 శాతం రాయితీ ఉంటుందని వెల్లడించింది. అనివార్య కారణాల వల్ల ప్రీమియాన్ని సకాలంలో చెల్లించని పాలసీదారులకు ప్రయోజనం కల్పించేందుకు ఈ పునరుద్ధరణ పథకం తోడ్పడుతుందని ఎల్‌ఐసీ వివరించింది.

దేశంలోనే భారీగా నిధులు సమీకరిస్తుందని భావిస్తున్న ఎల్‌ఐసీ ఐపీఓ నిర్వహించేందుకు 16 మర్చంట్‌ బ్యాంకర్లు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 7 విదేశీ సంస్థలు కాగా.. 9 దేశీయ సంస్థలు ఉన్నాయి. ఆగస్టు 24 (మంగళవారం), 25 (బుధవారం) తేదీల్లో పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం ముందు ఈ సంస్థలు తమ ప్రతిపాదనలు ఇవ్వనున్నాయి. విదేశీ బ్యాంకర్లలో బీఎన్‌పీ పరిబాస్‌, సిటీగ్రూపు గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా, డీఎస్‌పీ మెరిల్లించ్‌ (ఇప్పుడు బీఓఎఫ్‌ఏ సెక్యూరిటీస్‌గా పిలుస్తున్నారు), గోల్డ్‌మన్‌ శాక్స్‌ (ఇండియా) సెక్యూరిటీస్‌, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్‌ అండ్‌ కేపిటల్‌ మార్కెట్స్‌ (ఇండియా), జేపీ మోర్గాన్‌ ఇండియా, నోమురా ఫైనాన్షియల్‌ అడ్వయిజరీ అండ్‌ సెక్యూరిటీస్‌ (ఇండియా)లు మంగళవారం ప్రజంటేషన్‌ ఇవ్వనున్నాయి. బుధవారం 9 దేశీయ మర్చంట్‌ బ్యాంకర్లు- యాక్సిస్‌ కేపిటల్‌, డీఏఎం కేపిటల్‌ అడ్వయిజర్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, జేఎం ఫైనాన్షియల్‌, కోటక్‌ మహీంద్రా కేపిటల్‌, ఎస్‌బీఐ కేపిటల్‌ మార్కెట్‌, యెస్‌ సెక్యూరిటీస్‌ ఇండియాలు ప్రజంటేషన్‌ ఇవ్వనున్నాయి. ఎల్‌ఐసీ ఐపీఓ కోసం మర్చంట్‌ బ్యాంకర్ల నియామకానికి జులై 15న దీపమ్‌ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందుకు ఆగస్టు 5తో గడువు ముగిసింది. మొత్తంగా 10 మర్చంట్‌ బ్యాంకర్లను నియమించుకోవాలని దీపమ్‌ భావిస్తుంది. ఇవన్నీ ఒక బృందంగా ఎల్‌ఐసీ మెగా ఐపీఓను నిర్వహించనున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu