Ad Code

అంతరిక్షంలోకి చీమలు, అవకాడోలు

 


ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ఈరోజు అంతరిక్షంలోకి చీమలు, అవకాడోలు పంపింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం) లో ఉన్న ఏడుగురు వ్యోమగాముల కోసం చీమలు, 2 వేల కేజీలకు పైగా అవకాడోలు, నిమ్మకాయలు, ఐస్ క్రీమ్‌లు, మనిషెత్తు రోబో హ్యాండ్‌ను పంపించింది. ఈ సరంజామాతో కూడిన డ్రాగన్ క్యాప్సూల్‌ను ఫాల్కన్ రాకెట్ ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టారు. నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ఎక్స్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. మొత్తం 4,800 పౌండ్ల బరువైన (2,170 కేజీలు) పరికరాలు, ఇతర సామగ్రిని ఈ ప్రయోగం ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి చేరవేశారు. మంగళవారం ఇవి స్పేస్ స్టేషన్‌కు చేరుకోనున్నాయి. అమెరికాకు చెందిన ‘గర్ల్స్​ స్కౌట్స్’ నాసా ద్వారా చీమలను అంతరిక్షంలోకి పంపింది. స్పేస్​లో వీటిపై ప్రయోగాలు నిర్వహించనుంది. ఉప్పునీటి రొయ్యలు, కొన్ని మొక్కలను సైతం ప్రయోగాల కోసం పంపించింది. విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పంపిన విత్తనాలను (జన్యు పరిశోధనలో ఉపయోగించే ఒక చిన్న పుష్పించే మొక్క విత్తనాలు) సైతం డ్రాగన్ క్యాప్సూల్ మోసుకెళ్లింది. ఇక కాంక్రీట్, సోలార్ సెల్స్, తదితర మెటీరియల్‌ను​ సైతం ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి చేరింది. గిటాయ్ ఇంక్ అనే జపాన్ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసిన రోబోటిక్ చెయ్యిని అంతరిక్ష కేంద్రంలో వివిధ పరికరాల మరమ్మతులకు వినియోగించనున్నారు. వ్యోమగాములు చేసే ఇతర పనులు కూడా ఇది చేస్తుందని సంస్థ అధికారి టొయోటకా కొజుకి తెలిపారు. ఇలాంటి పరికరాలను మరికొన్ని పంపించనున్నట్లు చెప్పారు. 2025 నాటికి చంద్రుడిపై స్థావరాలు ఏర్పాటు చేసేందుకు ఈ పరికరాలను వినియోగించనున్నట్లు తెలిపారు. చంద్రుడి గర్భంలో ఉన్న విలువైన వనరులను తవ్వి తీసేందుకూ ఈ రోబో పరికరాలను ఉపయోగించనున్నారు.

Post a Comment

0 Comments

Close Menu