Ad Code

రిషి కపూర్


 రిషి కపూర్  హిందీ సినిమా నటుడు, దర్శకుడు. ఇతని 1970లో తన తండ్రి రాజ్ కపూర్ దర్శకత్వంలో తీసిన మేరా నామ్ జోకర్ చిత్రంతో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రంలో ఇతడు నటించిన పాత్రకు ఉత్తమ కళాకారుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం దక్కింది. రిషి కపూర్ ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో ఒక పంజాబీ కుటుంబంలో జన్మించారు. ఇతడు నటుడు, దర్శకుడు అయిన రాజ్‌కపూర్, కృష్ణ మల్హోత్రా దంపతుల రెండవ కుమారుడిగా జన్మించారు. పృథ్వీరాజ్ కపూర్ ఇతని తాత. ఇతని విద్యాభ్యాసం తన సోదరులతో కలిసి ముంబైలోని కాంపియాన్ స్కూల్, అజ్మీర్ లోని మేయో కాలేజీలో జరిగింది. ఇతని సోదరులు రణధీర్‌ కపూర్‌, రాజీవ్ కపూర్, మేనమామలు ప్రేమ్‌నాథ్, రాజేంద్రనాథ్, బాబాయిలు శశి కపూర్, షమ్మీ కపూర్ అందరూ సినిమా నటులే. ఇతనికి రితూ నందా, రీమా జైన్ అనే ఇద్దరు చెల్లెళ్లున్నారు. ఇతడు 1970లో తన తండ్రి రాజ్‌కపూర్ దర్శకత్వంలో తీసిన మేరా నామ్ జోకర్ చిత్రంలో చిన్ననాటి రాజ్‌కపూర్‌ పాత్రలో నటించారు.1973లో డింపుల్ కపాడియాతో కలిసి బాబీ చిత్రంలో యువ ప్రేమికుడిగా నటించారు. ఈ చిత్రంలో నటనకు ఉత్తమ నటుడిగా 1974లో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ గెలుచుకున్నారు. 1973 నుండి 2000 వరకు ఇతడు 92 సినిమాలలో ప్రధాన పాత్రలను పోషించారు. వాటిలో 51 చిత్రాలలో సోలో హీరోగా, 41 చిత్రాలలో ఇతర హీరోలతో కలిసి జంటగా నటించారు. వాటిలో మొత్తం 36 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి. ఇతడు తన భార్య నీతూసింగ్‌తో కలిసి 11 చిత్రాలలో జంటగా నటించారు. ఇంకా ఇతడు సులక్షణా పండిట్, పర్వీన్ బాబీ, రంజితా కౌర్, రీనారాయ్, జీనత్ అమన్, షబ్నా అజ్మీ, మౌసమీ చటర్జీ, ఫరీదా జలాల్, జయప్రద, పద్మినీ కొల్హాపురి, కిమ్‌ యశ్‌పాల్, టీనా మునిమ్‌, తనూజ, రతి అగ్నిహోత్రి, శ్రీదేవి,మాధురీ దీక్షిత్, జూహీ చావ్లా వంటి తారలతో కలిసి నటించారు. బాబీ, లైలా మజ్ను, సర్‌గం, కర్జ్, ప్రేమ్‌ రోగ్, నగీనా, కభీ కభీ, హమ్‌ కిసీసే కమ్‌ నహీ, సాగర్ మొదలైనవి ఇతడు నటించిన చిత్రాలలో విజయవంతమైన కొన్ని చిత్రాలు. ఇతడు 1999లో "ఆ అబ్ లౌట్ ఛలేఁ" అనే సినిమాకు దర్శకత్వం వహించారు.

2001 నుండి మరణించేవరకు సహాయనటుడిగా పలు చిత్రాలలో నటించారు. రిషి కపూర్ తన సహనటి నీతూసింగ్‌ను 1980, జనవరి 22న వివాహం చేసుకున్నారు. వీరికి రణ్‌బీర్ కపూర్, రిధమా కపూర్ అనే సంతానం కలిగారు. రణ్‌బీర్ నటుడిగా, రిధమ డిజైనర్‌గా రాణించారు. ఇతడు నటీమణులు కరిష్మా కపూర్, కరీనా కపూర్‌లకు బాబాయి. గొడ్డు మాంసం తినే హిందువుగా ఇతడు సోషియల్ మీడియాలో వివాదాస్పదమయ్యారు.ఇతడు మీనా అయ్యర్‌తో కలిసి తన జీవితచరిత్ర ఖుల్లం ఖుల్లా : రిషి కపూర్ అన్‌సెన్సార్డ్ అనే పేరుతో రచించారు.ఈ పుస్తకం 2017 జనవరి 15న విడుదలయ్యింది. ఇతనికి కాన్సర్ వ్యాధి సోకిందని 2018లో తెలిసింది. చికిత్స నిమిత్తం ఇతడు న్యూయార్క్ వెళ్లారు. ఒక ఏడాదిపాటి చికిత్స పొందాక ఇతడు 2019 సెప్టెంబర్ 26న భారతదేశానికి తిరిగివచ్చారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఇతడిని 2020 ఏప్రిల్ 29న ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఇతడు 2020, ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 5:20 గంటలకు మరణించారు.

Post a Comment

0 Comments

Close Menu