Ad Code

ఐఫోన్ ద్వారా డిప్రెషన్‌, అల్జీమర్స్‌ గుర్తింపు !


టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తమ ఐఫోన్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. అలాగే అన్ని సంస్థల కంటే ముందే అద్భుతమైన టెక్నాలజీలను పరిచయం చేస్తోంది. ఇప్పటికే ఎన్నో ఉపయోగకరమైన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇది మరొక కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి సిద్ధమవుతోందని వార్తలొస్తున్నాయి. ఆందోళన, నిరాశ, అల్జీమర్స్ వంటి రుగ్మతల ప్రారంభ సంకేతాలైన కాగ్నిటివ్‌ డిక్లయిన్‌ను గుర్తించడానికి వీలుగా ఐఫోన్‌లో కొత్త టెక్నాలజీని చేర్చేందుకు యాపిల్ సంస్థ రెడీ అయ్యిందని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది  డిజిటల్ క్లూస్ సాయంతో కొత్త హెల్త్ చెకప్ టెక్నాలజీని యాపిల్ పరిచయం చేయనుందని వాల్ స్ట్రీట్ వెల్లడించింది. యాపిల్ తమ హెల్త్ పోర్ట్‌ఫోలియో పరిధిని విస్తరించేందుకు సరికొత్త టూల్స్ అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తోందని నివేదిక పేర్కొంది. ఈ టెక్నాలజీ అభివృద్ధి కోసం చేస్తున్న పరిశోధనలలో కొందరు ఐఫోన్ యూజర్లు పాల్గొననున్నారు. వారి ముఖ కవళికల విశ్లేషణ, మాట్లాడే విధానం, వారి నడక వేగం, నిద్ర, గుండె, శ్వాస రేట్లను పరిశోధకులు కొలిచే అవకాశం ఉంది. అలాగే వారి టైపింగ్ స్పీడ్, వారి అక్షరదోషాల సంఖ్య, వారు టైప్ చేసే కంటెంట్ తో సహా ఇతర డేటా ఆధారంగా యాపిల్ రీసెర్చ్ చేయనుంది. అయితే దీనివల్ల యూజర్ల ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే యాపిల్ సంస్థ తమ సర్వర్ లకు ఎలాంటి డేటా వెళ్లకుండా యూజర్ల ఫోన్ లోనే అన్ని రోగ నిర్ధారణలు జరిగిపోయేలా టెక్నాలజీని రూపొందిస్తున్నట్టు సమాచారం. వాల్ స్ట్రీట్ నివేదిక ప్రకారం, ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయాలని లాస్ ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియా యూనివర్సిటీ (UCLA)కి చెందిన యాపిల్ పరిశోధన భాగస్వామ్యాలు నిర్ణయించాయి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌తో పాటు స్వల్ప కాగ్నిటివ్‌ డిక్లయిన్ పై అధ్యయనం చేసే ఔషధ కంపెనీ అయిన బయోజెన్‌తో కలిసి యాపిల్ భాగస్వామ్యాలు రీసెర్చ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే యూసీఎల్ఎతో చేపడుతున్న యాపిల్ ప్రాజెక్ట్ పేరు "సీబ్రీజ్ (Seabreeze)" కాగా.. బయోజెన్‌తో చేస్తున్న యాపిల్ ప్రాజెక్ట్ పేరు "పై(Pi)". నివేదికల ప్రకారం, యూసీఎల్ఎ అధ్యయనం ఈ ఏడాది నుంచి 3,000 మంది వాలంటీర్ల డేటాను విశ్లేషించనుంది. బయోజెన్ వచ్చే రెండేళ్లలో 20,000 యూజర్ల డేటాను విశ్లేషించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వీరిలో సగం మందిని స్వల్ప మానసిక సమస్యలతో బాధపడే వారినే బయోజెన్ నియమించుకోనుంది. త్వరలోనే యాపిల్ మానసిక సమస్యలను సైతం గుర్తించే సామర్థ్యం ఉన్న టెక్నాలజీని తీసుకోస్తుందన్న వార్తలు యూజర్లలో ఆసక్తిని రేపుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu