Ad Code

పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు


ప్రస్తుతం అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. ఎక్కువగా ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌ ధరలు పెరగనున్నాయి. ఇప్పటి విడుదలైన పలు మోడళ్లపై 7 నుంచి 10 శాతం వరకు అధికం కానుంది. సెమికండక్టర్‌ చిప్స్‌తో సహా ఇతర విడిభాగాల కొరత తీవ్రం కావడమే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీలు చెబుతున్నాయి. కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఇంటి నుంచి పని విధానం, ఆన్‌లైన్‌ క్లాసులు, సెమికండక్టర్లకు విపరీతంగా డిమాండ్ ఏర్పడి కొరతకు దారి తీసింది. ముందే పండగ సీజన్‌ ఉండటంతో డిమాండ్‌ అధికంగా ఉంటుంది. 4జీ చిప్‌సెట్స్‌పైనే ప్రభావం ఉంది. డిసెంబర్‌ వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

వేధిస్తున్న చిప్‌ల కొరత..

5జీ చిప్‌సెట్ల సరఫరా కాస్త మెరుగ్గా ఉంది. మాస్‌ మార్కెట్‌ 5జీ చిప్‌సెట్స్‌ సరఫరా తక్కువగా ఉంటుంది. కొరత కారణంగా పెరుగుతున్న చిప్‌ ధరలు స్మార్ట్‌ఫోన్‌ తయారీదారుల విడిభాగాల బిల్లును గణనీయంగా ప్రభావితం చేశాయి. ఇది ప్రస్తుతం కస్టమర్లపై, కొత్త మోడళ్ల విడుదలపైనా ఉంటుందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ ప్రొడక్ట్స్‌ విభాగంలో ప్రధానంగా స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్‌టాప్స్‌ మార్కెట్‌ కొన్ని బ్రాండ్లకే పరిమితమైంది. ఇవి పెద్ద కంపెనీలే కాదు, నిధులు, విడిభాగాల సరఫరా విషయంలోనూ అగ్రస్థానంలో ఉంటాయని ఇండియన్‌ సెల్యులార్, ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) చైర్మన్‌ పంకజ్‌ మొహింద్రూ పేర్కొన్నారు. అయితే చిప్‌ల కొరత అధికంగా ఉండటంతో మొబైల్, ఆటోమొబైల్ రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే మొబైల్స్ రేట్లు పెరుగుతాయని కౌంటర్ పాయింట్ పరిశోధన సంస్థ తెలిపింది.

మొబైల్‌ ఫోన్‌ పరిశ్రమపై విడిభాగాల కొరత ప్రభావం మరో ఆరు నెలల పాటు ఉండవచ్చని కౌంటర్‌ పాయింట్‌ రిసెర్చ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాతక్‌ అన్నారు. దేశీయ పరిశ్రమకు ఎక్కువగా చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలో చైనాలో పెరిగిన రవాణా చార్జీలు సైతం చిప్‌ కొనుగోళ్లను భారం చేస్తున్నాయి. దీంతో కొత్త మోడళ్ల తయారీ తగ్గిపోయి ప్రస్తుత మోడళ్ల ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. రిలయన్స్‌ జియో 4జీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల కూడా చిప్‌ల కొరత కారణంగా వాయిదా పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

జూన్‌లో 3.3 కోట్లకుపైగా దిగుమతులు:

ఈ ఏడాది జూన్‌ నెలలో దేశంలో స్మార్ట్‌ఫోన్‌ దిగుమతులు గతంతో పోలిస్తే 82 శాతం పెరిగాయి. ఆయా కంపెల ద్వారా 3.3 కోట్లకుపైగా యూనిట్లు భారత్‌కు వచ్చాయి. ఇందులో షియోమీ వాటానే అత్యధికంగా 28.4 శాతం ఉంది. ఆ తర్వాత సామ్‌సంగ్‌ 17.7 శాతంగా, వివో 15.1 శాతంగా, రియల్‌మీ 14.6 శాతంగా, ఒప్పో 10.4 శాతంగా ఉన్నట్లు రిసెర్చ్‌ సంస్థ కౌంటర్‌పాయింట్‌ తెలిపింది.

స్మార్ట్‌ఫోన్‌ ఇండస్ట్రీకి సవాళ్లు

ఆసియా దేశాల్లో తయారీపై కరోనా లాక్‌డౌన్ల ప్రభావం అధికంగా పడింది. ఇక 4జీ చిప్‌సెట్ల సరఫరా పడిపోవడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. దీంతో ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. బ్యాక్‌ ప్యానెల్స్‌, బ్యాటరీలకూ కొరత తీవ్రంగా ఏర్పడింది. అంతేకాకుండా డిస్‌ప్లే ప్యానెళ్లు-డ్రైవర్లు, పవర్‌ మేనేజ్‌మెంట్‌ ఐసీల లభ్యత తగ్గిపోవడం, కస్టమర్ల డబుల్‌ బుకింగ్‌లతోనూ ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో స్మార్ట్‌ఫోన్‌ ఇండస్ట్రీకి సవాళ్లుగా మారాయి.

Post a Comment

0 Comments

Close Menu