Ad Code

నిరంతర ప్రేరణ "అమ్మ"''ప్రపంచ మానవాళి చరిత్రలో అతి గొప్ప సంఘటన 1917 అక్టోబర్‌ విప్లవం. భూతలంపై సమ సమాజం అనేది కలగా ఉన్నప్పుడు ఆ కలని సాకారం చేసిన విప్లవం అది. కాగా అక్టోబర్‌ విప్లవాని కంటే దశాబ్ధం ముందే ప్రజల్ని, విప్లవకారుల్ని ప్రభావితం చేసిన గొప్ప రచన మాక్సిమ్‌ గోర్కి 'అమ్మ' నవల.

జారుకు వ్యతిరేకంగా తిరుగుబాటుకి పిలుపిచ్చినందున వారంటు రావటంతో ముందు జర్మనీకి అక్కడ నుండి ఫ్రాన్స్‌కి ఆ తర్వాత అమెరికాకూ వెళ్ళి అమెరికాలోనే ఈనవల రాశాడు. ఇంగ్లీషులో మొదట రాయబడిన ఈ నవల తర్వాత 1906లో రష్యన్‌ భాషలోకి అనువదించబడింది. ఇప్పటివరకూ 150 భాషల్లో తర్జుమా కాబడి కొన్ని కోట్ల ప్రతులు అమ్ముడయ్యాయి. ''ఈ నవల రష్యన్‌ ప్రతులు లక్షల్లో ముద్రించి ప్రజలకు చేర్చాలని ఎందుకంటే పాత ఉద్యమ విషయాలు కొత్త తరానికి తెలియవని'' లెనిన్‌ అన్నాడు. ఆ ప్రకారమే విప్లవానంతరం లక్షల ప్రతులు ప్రపంచమంతా విరజిమ్మారు.

ఇంతటి ఘనచరిత్ర కలిగిన ఈ నవల తెలుగు అనువాదం తెలుగులో 1934లో క్రొవ్విడి లింగరాజు గారు చేయగా వెలువడింది. కాంగ్రెసు నాయకులైన లింగరాజు గారు 'వీరబలి' అనే వ్యాసాన్ని కాంగ్రెస్‌ అనే పత్రికలో రాసినందుకు 124(ఎ) ఐపిసి కింద రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించగా ఈ నవల మొదటి భాగాన్ని 1932లో కన్ననూరు జైలులోనూ, రెండవ భాగాన్ని కోయంబత్తూరు జైలులోనూ అనువదించగా 1934లో ఆదర్శ గ్రంధమండలి తరపున గద్దె లింగయ్య గారు ప్రచురించారు. కాని వెంటనే అది నిషేధానికి గురై 1938లో రాజాజీ ప్రభుత్వం నిషేధం ఎత్తివేయటంలో రౌతు బుక్‌ డిపో (రాజమండ్రి) వారు ప్రచురించారు. రష్యా వారి కోరిక మేరకు లింగరాజు గారు మరోసారి అనువదించగా 1964 నుండి 'రాదుగా' ప్రచురణలు - మాస్కోవారి చేత 3 ముద్రణలు, 1969, 1976, 1981లో ప్రచురించబడ్డాయి. ఆ తర్వాత విశాలాంధ్ర, నవ చేతన వారిచేత ఎన్నిసార్లు ఎన్నివేల ప్రతులు ప్రచురించారో లెక్కలేదు.

ఇంకా ఈ నవలని పడాల రామారావు, శ్రీ విరించి గార్లు కూడా అనువదించారు. అలాగే ఈ నవల సంక్షిప్త అనువాదాలు తెలకపల్లి రవి, సహవాసి గార్లు కూడా చేశారు. నాటకంగా శ్రీశ్రీ, 'మాతృ హృదయం' పేరుతో తుమ్మల వెంకట్రామయ్య, కవిత్వంలో సుగం బాబు కూడా రాశారు. కాని ప్రస్తుతం లింగరాజు గారి పుస్తకం (విశాలాంధ్ర, నవచేతన) తెలకపల్లి రవి గారి పుస్తకం (ప్రజాశక్తి)లోనూ లభ్యమవుతున్నాయి. మిగిలిన రచనలు దొరికే అవకాశం లేదు. త్వరలో కొత్తగా డాక్టర్‌ ఎం.వి. రమణారెడ్డి గారి అనువాదం రాబోతోంది.

కలకత్తాకు చెందిన ''సావిక సాంస్కృతిక చక్ర' బృందం వారు గౌతం ముఖర్జి సారథ్యంలో 1978 నుంచి 'అమ్మ' బెంగాలీ నాటకాన్ని 2600 ప్రదర్శనలిచ్చారు. 16 మంది నటీనటులతో 13 దృశ్యాలుగా ప్రదర్శించబడే ఈ నాటకంలో అమ్మ పాత్రా గౌతం ముఖర్జీ, కొడుకు పావెల్‌ పాత్ర ఆయన సొంత కొడుకు ా సౌవిక్‌ ముఖర్జి నటించారు. 2018వ సంవత్సరం విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, హైదరాబాద్‌, చెన్నైలలో ఈ నాటకం ప్రదర్శించబడింది.

1950లో తమిళంలోనూ,1947లో మళయాళంలోనూ ఇతర భారతీయ భాషల్లో కూడా 50వ దశకంలో ఈ నవల వచ్చింది. మొదట ఈ నవలకు గోర్కి 'కామ్రేడ్స్‌' అని పేరు పెట్టి, తర్వాత టాల్‌స్టారు సలహాపై 'అమ్మ'గా మార్చాడు. కమ్యూనిస్టేతర శ్రేణుల్లోకి కూడా విస్తృతంగా ఈ నవల చొరబడటానికి ఇదీ ఒక కారణమే. ఇంత ప్రాచుర్యం గల నవల కథ క్లుప్తంగా ఇది : 1905 జార్‌ చక్రవర్తుల పాలనలోని చివరిదశలో మాస్కో తదితర ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలు వెలసి కార్మికులు యజమానుల పీడనకు గురవ్వటం ప్రారంభమైంది. అమ్మ నీలోవ్నా, ఆమె భర్త వాస్లోవ్‌, ఆమె కొడుకు పావెల్‌ ముఖ్యపాత్రలైనా కథాక్రమమంతా అమ్మ నీలోవ్నా చుట్టూ తిరుగుతుంది. గోర్కి జన్మస్థలమైన నిజ్నినోగ్రాడ్‌ నేపధ్యంలోనే కథ నడుస్తుంది (ఈ నగరానికి 1932లో గోర్కి పేరు పెట్టారు). 1902లో మేడే రోజున జరిగిన ప్రదర్శన అందులో ప్రసంగాలు కారణంగా పావెల్‌ని, మరి కొంతమందిని రాజద్రోహం నేరం కింద అరెస్టు చేసి, విచారణ తంతు ముగించి సైబీరియా ప్రవాసానికి పంపిస్తారు. నీలోవ్నా పోలీసుల కళ్ళు గప్పి ఫ్యాక్టరీలో తినుబండారాలు అమ్మే దానిలా వెళ్ళి పార్టీ కరపత్రాలు పంచుతూ భవిష్యత్‌ విప్లవానికి ప్రజల్ని నమాయత్తపరుస్తుంది.

తొలుత నీలోవ్నా ఒక సాధారణ గృహిణి. తాగుబోతైన భర్త వాస్లోవ్‌కి భార్యగా అణకువగా, భయంగా మెసులుకొనేది. వాస్లోవ్‌ మరణం తర్వాత కొడుకు పావెల్‌ పోషణలో ఉంటుంది. పావెల్‌ ఒక ఫ్యాక్టరీలో పనివాడుగా వుంటూ రహస్యంగా కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తుంటాడు. నిర్బంధం, అరెస్టులు, జైలు జీవితంతో పావెల్‌ తన స్థాయిని పెంచుకుంటాడు. పావెల్‌ స్నేహితులు హౌహెల్‌, అన్‌ద్రేరు, నతాషా, సాషా, రీబిన్‌, సవేలియా, యెగోల్‌, నికోలారు తదితరుల సంభాషణల్ని వింటూ భయమూ - ఉత్తేజం కలుగగా పావెల్‌ స్నేహితుల్ని కూడా అమ్మగా అభిమానిస్తుంది. సాఫా పావెల్‌ మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం తనకు చెప్పలేదని లోలోన అలిగినా వారికి ఉద్యమ సంబంధమైన బాధ్యత వాళ్ళ చేత సొంత సుఖాన్ని త్యాగం చేయిస్తుందని తెలిసి వారి ఉన్నత వ్యక్తిత్వాల్ని చూసి, ఆశ్చర్యపడింది.

'సొంత విషయాన్ని ప్రేమించే' స్థాయినుంచి 'అందరి కోసం దిగులుపడే' స్థాయికి పెరిగింది. పావెల్‌ కోర్టు ప్రకటన విప్లవకారుల్ని ఎంతో ఉత్తేజపరిచేదిగా ఉంటుంది. 'ఇక్కడ నేరస్తులూ లేరు, న్యాయాధిపతులూ లేరు. బందీలూ ా బంధించబడే వారూ మాత్రమే ఉన్నారు.. మేము విప్లవకారులం. కొందరు ఏ శ్రమా చేయకుండా ఇతరుల మీద సవారీ చేసినంత కాలం మరికొందరు కష్టం తప్ప ఇంకేమీ ఎరగని వాళ్లు ఉన్నంతకాలం మేము విప్లవకారులగానే కొనసాగుతాం' అంటాడు పావెల్‌. ఈ కోర్టు ప్రకటన, కోర్టుల్ని తమ ఉద్యమ ప్రచార వేదికలుగా మార్చాలనే ఆలోచన అనంతర కాలంలో డిమిట్రోవ్‌ (జర్మనీ), భగత్‌ సింగ్‌ (ఇండియా)లకు ప్రేరణ కలిగించింది.

'అమ్మ' నవల కంటే రచయిత గోర్కీ జీవితం మరింత ఆసక్తి కలిగిస్తుంది. గోర్కి అసలు పేరు అలెగ్జీ మాగ్జిమోనిష్‌ పెష్కోవ్‌. 1868 మార్చి 14న ఓల్గా నదీతీరాన ఉన్న నోవోగోరోడ్‌లో 1872లో జన్మించాడు. వడ్రంగి పని చేసే తండ్రి ఆ తర్వాత 1878లో తల్లి మరణించగా, తాతయ్య నానమ్మ పోషణలో కొంతకాలం ఉన్నాడు. నానమ్మ చెప్పే కథల కారణంగా కథాశిల్పం పరిచయమైంది. చెప్పుల షాపులో పనివాడిగా, ఓడలో వంట  చేసేవాడికి సహాయకునిగా, పిట్టలు పట్టేవాడిగా, గ్రంథాలయంలో గుమాస్తాగా, రొట్టెలు చేసేవానికి సహాయకునిగా దుర్భర దారిద్య్రం అనుభవిస్తూ రోడ్డు పక్క చెత్త కుప్పల్లో జీవించాడు.1888లో విప్లవకారులతో పరిచయమై రైల్వే యార్డులో కాపలావానిగా, బరువు తూచేవానిగా పనిచేశాడు. కొరెలెంకో అనే రచయితతో పరిచయమై 1892 నుంచి కథలు రాయటం ప్రారంభించాడు. 'మాక్సిమ్‌ గోర్కి' అనే కలం పేరు పెట్టుకున్నాడు. మాక్సిమ్‌ అంటే చేదు నిండినవాడని అర్థం. 1905లో జరిగిన తిరుగుబాటు (బ్లడ్‌ సండే) తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రకటన చేశాడు. తిరుగుబాటు విఫలం కావటంతో విదేశాలకు పోయాడు. అమెరికాకు, ఇటలీలోని కాప్రీ దీవికి వెళ్ళాడు.1908లో లెనిన్‌ కలిశాడు. తర్వాత కాలంలో క్షయవ్యాధి తిరగబెట్టటంతో లెనిన్‌ బలవంతంపై మళ్ళీ విదేశాలకు వెళ్ళాడు. 1928లో మళ్ళీ సోవియట్‌కి వచ్చాడు. ఎబ్రాడ్‌ అనే పత్రిక నిర్వహించాడు. 1936 జూన్‌18న మాస్కోలో అనారోగ్యంతో చనిపోయాడు.

సామాజిక సమానత్వం అనే సత్యం కోసం, సామ్యవాద సమాజ నిర్మాణానికి అంకితమవ్వాలనే దీక్షను, స్ఫూర్తిని ఈ నాటికీ ఈ నవల పాఠకులపై ప్రసరిస్తుంది. స్త్రీకి సాధ్యం కానిదేమీ లేదని ఈ నవల నిరూపిస్తుంది. 'ఇది కమ్యూనిస్టుల ప్రచార నవల' అనే విమర్శకు 'ప్రతి రచనా ప్రచారం కోసమే' (Every writing in one or another is a propaganda) అన్న బెర్నార్డ్‌ షా మాటలే సమాధానం. ఈ 115 ఏళ్ళ కాలంలో అమ్మ కల నిజం కావటం ఎంత అద్భుతమో, అది కరిగిపోవటం అంతకంటే విషాదం. ఆ కలను సాకారం చేసుకోవటానికి రష్యాలోను, మిగిలిన ప్రపంచంలోనూ, జనం ఎక్కువగానే ఉన్నారు. ఎందుకంటే అది నిజం కావాల్సిన కథ.

Post a Comment

0 Comments

Close Menu