Ad Code

ఎన్.ఎ.టి - ఎన్.టి.ఆర్

 టాలీవుడ్ చరిత్రలో నందమూరి తారక రామారావుది ఓ ప్రత్యేక చరిత్ర. చాలా మంది నటులు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకోడం లక్ష్యంగా సొంత సినిమా నిర్మాణం చేపడతారు. ఎన్ టి ఆర్ మాత్రం తన అభిరుచికి అనుగుణమైన చిత్రాలు తీయడానికే  స్వీయ చిత్ర నిర్మాణానికి దిగారు. అలా రూపుదిద్దుకున్నదే నేషనల్ ఆర్ట్ ధియేటర్స్ బ్యానర్. 1953లో ప్రారంభమైన నేషనల్ ఆర్ట్ థియేటర్స్ నిజానికి ఎన్.టి.ఆర్ కాలేజీ రోజులనాటి నాటకాల కంపెనీ. తను సినిమాల్లోకి వచ్చి స్థిరపడి సొంత చిత్ర నిర్మాణం చేయాలనుకున్నప్పుడు సెంటిమెంటల్  గా నేషనల్ ఆర్ట్ ధియేటర్స్ నే కంటిన్యూ చేశారు. ఎన్.ఎ.టి బ్యానర్ లో ఎన్టీఆర్ నిర్మించిన మొదటి సినిమా పిచ్చిపుల్లయ్య. కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసి సినిమా రంగానికి వచ్చిన తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఎన్.ఎ.టి వారి తొలిచిత్రం పిచ్చిపుల్లయ్య మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. పెరుగుతున్న నగర సంస్కృతి, పతనమౌతున్న గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ, దిగజారుతున్న విలువలు నేపధ్యంగా సినిమా కథ సాగుతుంది. పిచ్చిపుల్లయ్య మ్యూజికల్ గా కూడా పెద్ద విజయం.  ఎన్.టి.ఆర్ రూమ్మేట్  టి.వి.రాజు మ్యూజిక్ చేసిన ఈ సినిమాలో అద్భుతమైన మెలోడీలు ఉన్నాయి. అనిసెట్టి రాసిన ఎల్లవేళలందు నీ చక్కని చిరునవ్వులకై పాట ఘంటసాల, రావు బాలసరస్వతిల యుగళ గాత్రంలో చాలా ఆహ్లాదంగా సాగుతుంది. 

పిచ్చిపుల్లయ్య తర్వాత మరో ప్రయోజనాత్మక చిత్రాన్ని నిర్మించాలని సంకల్పించారు నందమూరి తారక రామారావు. ఈ సారి తీసే సినిమాకు దర్శకుణ్ణి మార్చారు. అమ్మలక్కలు టైమ్ లో పరిచయం అయిన యోగానంద్ తో సినిమా మొదలు పెట్టారు. అప్పటికి గ్లామర్ హీరోగా పాతాళభైరవి, పెళ్లి చేసి చూడు సినిమాలతో అదరగొట్టేస్తున్నాడు ఎన్.టి.ఆర్. డీ గ్లామర్ రోల్ తో తోడుదొంగలు చిత్రంతో మరోసారి ఆడియన్స్ ముందకు వచ్చారు. ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ ఈ రెండూ సినిమాకు కీలకం. ఈ రెండు శాఖల్లోనూ విశేష అనుభవం ఉన్న యోగానంద్ ను తన రెండో  సినిమాకు దర్శకుడుగా నియమించుకున్నారు ఎన్.టి.ఆర్. యోగానంద్ మొదటిసారిగా డైరక్ట్ చేసిన అమ్మలక్కలు హీరో కూడా ఎన్.టి.ఆరే కావడం విశేషం. దర్శకుడుగా యోగానంద్ కు నిర్మాతగా ఎన్.టి.ఆర్ కూ రెండవ చిత్రం తోడుదొంగలు.  తోడు దొంగలు కూడా ప్రయోజనాత్మక చిత్రమే. పల్లెల్లో రైసుమిల్లుల ప్రవేశం మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా రైతులను దోపిడీ చేయడం గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను నీరు కార్చడం లాంటి అంశాలతో సినిమా సాగుతుంది. జాతీయ స్థాయిలో పురస్కారాలు సాధించిన తోడు దొంగలు ఆర్ధికంగా మాత్రం నిర్మాత రామారావుకు నష్టాన్నే మిగిల్చింది. తక్కువ బడ్జట్ తో కేవలం 21 రోజుల్లో నిర్మించిన తోడు దొంగలు ఫ్లాప్ అయినా...క్రిటిక్స్ మాత్రం గొప్ప సినిమాగా సర్టిఫై చేశారు. అంతే కాదు...చైనాలో జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో బహుమతులు గెల్చుకొచ్చింది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రంగా తోడు దొంగలు చరిత్రలో నిల్చిపోయింది.   మొదటి రెండు సినిమాలూ ఆర్ధికంగా నష్టాన్నే మిగల్చడంతో మూడో సినిమా మాస్ ఎలిమెంట్స్ తో చేయాలని భావించారు రామారావు. అప్పటికి ఎన్.టి.ఆర్ జానపద హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఆ ఉద్దేశ్యంతోనే జానపద కథతో సినిమా మొదలు పెట్టారు. దానికీ దర్శకత్వ బాధ్యతలు యోగానంద్ కే అప్పగించారు ఎన్.టిఆర్. జయసింహ. నేషనల్ ఆర్ట్ ధియేటర్స్ బ్యానర్ లో మొదటి విజయవంత మైన చిత్రం. 1955లో విడుదలైన జయసింహ అద్భుత విజయం సాధించింది. ఈ నాటి ఈ హాయి కలకాదోయి నిజమోయీ ఇప్పుడు విన్నా హాయిగా ఉంటుంది. టి.వి.రాజు సంగీత ట్యూను కట్టిన సముద్రాల రచన ఘంటసాల, లీల గాత్రాల్లో ఎంత అద్భుతంగా ప్రాణం పోసుకుందో...అంతే అద్భుతంగా తెరమీద కూడా హాయిని పంచింది. జయసింహ విజయం తర్వాత ఎన్.టి.ఆర్ వెనక్కి తిరిగి చూడలేదు. కమలాకర దర్శకత్వంలో భక్త పుండరీకుడి కథను తెరకెక్కించే ప్రయత్నం ప్రారంభించారు. తమిళ్ లో విడుదలైన హరిదాసు ప్రేరణగా పాండురంగ మహత్మ్యం ప్రారంభమైంది.  నందమూరి నటించిన అరవై ఒకటో చిత్రంగా 1957 నవంబర్ 28న విడుదలై అఖండ విజయం సాధించింది పాండురంగ మహత్మ్యం. ఈ సినిమాకు కమలాకర కామేశ్వర్రావును దర్శకుడుగా తీసుకోవడం ఎన్టీఆర్ సాహసోపేత నిర్ణయం. 

అప్పటికి కమలాకర డైరక్ట్ చేసిన చంద్రహారం, పెంకిపెళ్లాం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. పైగా ఆ రెంటిలోనూ ఎన్టీఆరే హీరో. అయినా పిల్చి పాండురంగ మహత్మ్యం అప్పగించారు ఎన్.టి.ఆర్. అలా కమలాకరకు  తొలి హిట్టు అందించింది కూడా ఎన్.టి.ఆరే. ఎన్ ఎ టి ఆస్థాన సంగీత దర్శకుడు టి.వి.రాజు పాండురంగ మహత్మ్యానికి అజరామరమైన సంగీతం అందించారు. హే కృష్ణా ముకుందా మురారి పాట అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఒక అద్భుతమే. 1961 సంవత్సరం తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం సృష్టించిన సినిమా ఎన్.ఎ.టి బ్యానర్ నుంచి వచ్చింది. నందమూరి తారక రామారావు తొలిసారి మెగాఫోన్ పట్టిన చిత్రం సీతారామకళ్యాణం విడుదలైంది. అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం టైటిల్స్ లో డైరక్టర్ గా ఎవరి పేరూ కనిపించదు. ఎన్.టి.ఆర్ గురువు కె.వి.రెడ్డి మాత్రం మొదటి సారి డైరక్షన్ చేస్తూ...రావణుడి పాత్రేమిటని రామారావు మీద చిరాకు పడ్డారట.  తిరుగులేని కథానాయకుడుగా ఎదిగిన ఎన్.టిఆర్  దర్శకత్వం చేపట్టేందుకు రడీ అయ్యారు. సీతారామ కళ్యాణం సినిమా చేస్తున్నారనగానే అందరూ ఎన్.టి.ఆర్ రాముడుగా నటిస్తున్నాడనుకున్నారు. కానీ రాముడు పాత్రకు హరనాథ్ ను తీసుకుని తాను రావణుడి పాత్ర చేయబోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు  ఎన్టీఆర్. 

ఎన్.టి.ఆర్ రావణుడి పాత్ర చేయడం అది రెండోసారి. అంతకుముందు భూకైలాస్ చిత్రంలో ఎన్.టి.ఆర్ రావణ పాత్ర పోషించారు.  రావణ పాత్ర మీద తనకు ప్రత్యేక అభిమానం ఉందని అప్పట్లో ఆంధ్రపత్రిక ఇంటర్యూలో స్పష్టం చేశారు ఎన్.టి.ఆర్. సీతారామ కళ్యాణానికి రామారావు దర్శకత్వం వహించినా స్క్రీన్ మీద దర్శకత్వం ఫలానా అని వేయరు.  సీతారామకళ్యాణం చిత్రానికి దర్శకత్వం వహించమని కె.వి.రెడ్డిని కోరారు రామారావు. ఆయన సరే అన్నారు. తీరా రామారావు రావణుడి పాత్ర చేయాలనుకుంటున్న విషయం తెల్సి డ్రాప్ అయ్యారు. అసలా  పాత్రేమిటని కె.వి.రెడ్డి కోప్పడ్డారు. కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూసే అలవాటు లేని నందమూరి తారక రాముడు ముందుకే కొనసాగాడు. రామారావు రావణ పాత్ర వెనుక ఆయన తాత్వికత ఇమిడి ఉంది.. ఎన్.టి.ఆర్ మీద త్రిపురనేని రామస్వామి  ప్రభావం ఉంది. ఆయన ఎక్కువ కాలం నివసించిన తమిళనాడులో...ద్రవిడ ఉద్యమ ప్రభావం కూడా రామారావు మీద అనివార్యంగా పడింది. ఈ రెండూ కల్సి ఆయనకు ఒక తాత్విక భూమికను అందచేశాయి. ఆర్య అనార్య బేధాలతో పాటు అగ్రకులాల ఆధిపత్యం మీద తిరగబడ్డ వీరుల చరిత్రలను ఎన్.టి.ఆర్ ఆకళింపు చేసుకున్నారు. ఆ క్రమంలోనే రావణుడి పాత్ర మీద శ్రద్ద కలిగింది. 

 సీతారామ కళ్యాణం తర్వాత మళ్లీ జానపద కథతో రూపొందిన  చిత్రం కూడా పెద్ద విజయాన్నే అందుకుంది. రావణ పాత్ర లాగే...తాను అభిమానించే మరో పౌరాణిక పాత్ర దుర్యోధనుడి రూపురేఖలు తీర్చే పని సాగించారు ఎన్.టి.ఆర్.   

 1962లో గులేబకావళి కథ పేరుతో జానపద చిత్రాన్ని నిర్మించారు ఎన్.టి.ఆర్. గుళేబ‌కావ‌ళి క‌థ ద‌ర్శ‌కుడుగా ఎన్టీఆర్ పేరువేసుకోని రెండ‌వ చిత్ర‌ము.... సినారే మొదటిపాట రాసింది కూడా ఈ చిత్రంలోనే. జోసఫ్ విజయా కృష్ణమూర్తి మ్యూజిక్ చేసిన ఈ సినిమాలో ప్రతి పాటా సూపర్ హిట్టే. 

 రవికాంత్ నగాయిచ్ కెమేరా వర్క్ చేసిన గులేబకావళి కథ 1962 సంక్రాంతి బరిలో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో  ట్రిక్ షాట్స్ చాలా గొప్పగా చిత్రీకరించారు రవి. గుళేబకావళి కథ తర్వాత రవి నగాయిచ్ తో రామారావుకు చాలా క్లోజ్ ఫ్రెండ్ షిప్ ఏర్పడింది.  

 రావణపాత్రతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఎన్.టి.ఆర్ ఈ సారి దుర్యోధన పాత్ర పోషిస్తున్నట్టు ప్రకటించి మరో సంచనలనం సృష్టించారు. భాస నాటకాల్లో దుర్యోధనుడి పాత్ర కాస్త విభిన్నంగా ఉంటుంది. అదే శైలి ఎన్.టి.ఆర్ అనుసరించారు. శ్రీ కృష్ణపాండవీయం చిత్రం టైటిల్స్ లో మొదటిసారి దర్శకత్వం నందమూరి తారక రామారావు అని పడుతుంది. చరిత్ర ప్రకారం రామారావు తొలి సారి దర్శకత్వం వహించిన చిత్రంగా కృష్ణ పాండవీయం రికార్టులకెక్కింది.  శ్రీ కృష్ణ పాండవీయంలో  కృష్ణుడుగా, దుర్యోధనుడుగా  ఎన్.టి.ఆర్ చెలరేగి నటించారు.  అప్పటి వరకు సి.ఎస్.ఆర్, ముదిగొండ లింగమూర్తి ధరించిన శకుని పాత్ర దూళిపాళతో చేయించారు ఎన్.టి.ఆర్.  సాధారణంగా కుటిలత్వం మాత్రమే చూపించే శకుని పాత్రలో మొదటిసారి క్రౌర్యాన్ని చూపించారు. దాన్ని ధూళిపాళ అద్భుతంగా ఆవిష్కరించారు.   శ్రీ కృష్ణ పాండవీయం చారిత్రాత్మక విజయం సాధించింది. జనరల్ ఆడియన్స్ మాత్రమే కాదు. సమీక్షకులు కూడా సినిమా గురించి పాజిటివ్ గానే రాశారు.  రామారావు ఏ పాత్ర వేస్తే ఆ సినిమాలో అదే హీరో అనే ప్రచారం మొదలైంది. దర్శకుడుగా ఎన్.టి.ఆర్ ప్రతిభకు తెలుగు ప్రేక్షకలోకం నీరాజనాలు పలికింది.  

 నేషనల్ ఆర్ట్ ధియేటర్స్ బ్యానర్ లో వచ్చిన చివరి చిత్రం  శ్రీ కృష్ణ పాండవీయం. ఆ తర్వాత వచ్చిన ఎన్టీఆర్ సొంత చిత్రాలు రెండు ఎన్ ఎ. టి రామకృష్ణ కంబైన్స్ బ్యానర్ లో వచ్చాయి. ఉమ్మడి కుటుంబం తర్వాత ఎన్ ఎ టి బ్యానరే కనిపించలేదు. రామకృష్ణా సినీ స్టూడియోస్ రంగం మీదకు వచ్చింది. ఎన్.ఎ.టి బ్యానర్ నిర్మాతగా నందమూరి త్రివిక్రమరావు పేరుండేది. ఆ తర్వాత ఆయన పేరు నిర్మాతగా కనిపించదు. ఎన్.ఎ.టి బ్యానర్ మీద వచ్చిన చిత్రాలన్నిటీకీ నిర్మాతగా నందమూరి త్రివిక్రమరావు పేరుండేది. కృష్ణ పాండవీయం తర్వాత ఆ బ్యానర్ లో వచ్చిన చిత్రం వరకట్నం.   ఎన్.టిఆర్ దర్శకత్వం వహించిన మొదటి సాంఘిక చిత్రం ఇదే. వరకట్న సమస్యను కాస్త సీరియస్ గానే చర్చకు పెట్టే ప్రయత్నం చేస్తారు రామారావు. చట్టాలను చేసి లాభమేముంది. మనిషిలో స్వార్ధం పోయే వరకు వరకట్న సమస్య తొలగించడం అనేది తేలిక కాదనే సందేశం ఇస్తారు.  

 ఆ తర్వాత వచ్చిన ఉమ్మడి కుటుంబం చిత్రానికి తిరిగి యోగానందే దర్శకత్వం వహించారు. ఎన్.ఎ.టి బ్యానర్ లో వచ్చిన సాంఘిక చిత్రాలన్నిటిలోనూ తప్పనిసరిగా ఏదో ఒక  సామాజిక సందేశం ఉండి తీరుతుంది. ఆ ధోరణిలోనే ఎంటర్ టైనింగ్ గా సాగే సందేశాత్మక చిత్రంగా ఉమ్మడి కుటుంబం రూపుదిద్దుకుంది.

 ఈ చిత్రాన్ని తర్వాత రోజుల్లో తన స్వీయ దర్శకత్వంలో బాలయ్య హీరోగా హిందీలో పునర్నిర్మించాలని రామారావు భావించారు. కానీ ఎందుచేతో ఆ పని జరగలేదు. ఉమ్మడి కుటుంబం తర్వాత ఎన్టీఆర్ నిర్మించిన చిత్రం కోడలు దిద్దిన కాపురం. ఇది ఎన్టీఆర్ ఎస్టేట్స్ పేరుతో నిర్మాణం జరుపుకుంది. నిర్మాతగా మాత్రం నందమూరి త్రివిక్రమరావు పేరే ఉంటుంది. యోగానంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ కొట్టింది. 1970లో విడుదలైన ఈ చిత్రం రామారావు తెలుగులో నటించిన రెండు వందలో చిత్రం కూడా.  రామకృష్ణ ఎన్ఎటి కంబైన్స్ బ్యానర్ లో వచ్చిన మరో చిత్రం తల్లా పెళ్లామా. ఈ చిత్రం కూడా సందేశాత్మకంగానే సాగుతుంది. తల్లిని , పల్లెను విడిచి తన సుఖమే తనదంటూ యువత వెళ్లిపోతోందనే ఆవేదన ఈ చిత్రంలో కనిపిస్తుంది. అందుకే తల్లా పెళ్లామా అని టైటిల్ పెట్టారు రామారావు.  ఎన్.టి.ఆర్ పిచ్చిపుల్లయ్య నుంచి కోడలు దిద్దిన కాపురం వరకు నిర్మించిన ప్రతి చిత్రంలోనూ తప్పనిసరిగా సందేశం ఉండేది. తన అభిరుచి, ఆలోచనల మేరకు ఆయన చిత్ర నిర్మాణం చేశారు. ఎక్కడా రాజీ పడలేదు. కథ మాటలు పాటలు అన్నీ ఒక ప్రణాళికతో సాగేవి. అన్నీ తానే అయి చిత్ర నిర్మాణం చేయడం ఎన్టీఆర్ స్టైల్. ఈ పద్దతి ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ కనిపిస్తుంది. తాతమ్మ కల చిత్రం నుంచి రామారావు స్వంత చిత్రాలన్నీ రామకృష్ణ స్టూడియోస్ బ్యానర్లోనే వచ్చాయి. నిర్మాతగా నందమూరి త్రివిక్రమరావు స్థానంలో నందమూరి తారక రామారావు పేరే తెరమీద కనిపిస్తుంది. దానవీరశూరకర్ణ చిత్రం నుంచి చీఫ్ కంట్రోలర్ అంటూ హరికృష్ణ పేరు రంగం మీదకు తీసుకువచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu