Ad Code

ఐటీలో 4.5 లక్షల ఉద్యోగాలు?


భారతదేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో కోవిడ్-19 ఆంక్షలు దాదాపు ఎత్తివేశారు. దాంతో అన్ని రంగాల కార్యకలాపాలు పూర్తిస్థాయిలో పునః ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ ఇండస్ట్రీ భారీ ఎత్తున నియామకాలు చేపట్టడానికి సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇండియన్ ఐటీ సర్వీస్ ఇండస్ట్రీ అక్టోబర్ 2021 -మార్చి 2022 మధ్యకాలంలో 4.5 లక్షల ఉద్యోగులను చేర్చుకోనుందని మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ అన్‌ఎర్త్‌ఇన్‌సైట్ తాజా నివేదిక వెల్లడించింది. ఒకవైపు వలస ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతుండగా.. మరోవైపు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వేగవంతం చేయాలని సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఐటీ రంగంలో చేరే ఉద్యోగుల సంఖ్య పెరిగిపోనుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2022 ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలోనే 12 శాతం ఎక్కువగా ఉద్యోగులు ఐటీ రంగంలో చేరనున్నారని అన్‌ఎర్త్‌ఇన్‌సైట్ ఐటీ ఇండస్ట్రీ క్యూ2 ఇన్‌సైట్స్ & ఎఫ్‌వై22 ఫోర్‌కాస్ట్ రిపోర్ట్ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం 2022 ద్వితీయార్థంలో 17-19 శాతం అట్రిషన్ తో 1.5-1.75 లక్షల నికర ఉద్యోగుల చేరిక ఉండొచ్చని నివేదిక అంచనా వేసింది. ఇందులో లాటరల్స్, అనుభవజ్ఞులైన నిపుణుల నియామకం ఉంటుంది. డిమాండ్ ఎన్నడూ లేని విధంగా అధికంగా ఉండటంతో.. భారతదేశంలోని కంపెనీలు ఫ్రెషర్ల నియామకాలను కూడా పెంచుతున్నాయి. నివేదిక ప్రకారం, భారతదేశంలోని నేషనల్, మల్టీ నేషనల్ సంస్థలతో పాటు ఐటీ సంస్థలు ఎఫ్‌వై22లో ఇప్పటివరకు దాదాపు 2 లక్షల 50 వేల మంది ఫ్రెషర్లు నియమించుకున్నాయి. టీసీఎస్ 77 వేలు, ఇన్ఫోసిస్ 45 వేలు, కాగ్నిజెంట్ 45 వేలు, హెచ్‌సీఎల్ టెక్ 22 వేల ఫ్రెషర్లను నియమించుకున్నాయి. "భారతీయ సాంకేతిక సంస్థలు ఉద్యోగుల నైపుణ్యం పెంచే ప్రోగ్రామ్‌లపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. భారతదేశం, ప్రపంచ మార్కెట్లలోనూ ఇదే ట్రెండ్‌ను ఇండియన్ టెక్నాలజీ సంస్థలు కొనసాగిస్తున్నాయి. టాప్ 2 ఇండియన్ ఐటీ సంస్థలు ప్రతిభ ఆధారంగా వేర్వేరు ఉద్యోగుల కోసం ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లను అందిస్తున్నాయి. విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, మైండ్‌ట్రీ, ఎంఫాసిస్ వంటి ఇతర టైర్ I, టైర్ II సంస్థలు లెర్నింగ్, అప్‌స్కిల్లింగ్‌, రీస్కిల్లింగ్‌, విస్తరణ కొరకై ఉద్యోగుల కోసం ఒకే ఇంటర్‌ఫేస్‌ను రూపొందించడానికి కృషి చేస్తున్నాయి," అని నివేదిక పేర్కొంది. "ఎఫ్‌వై22లో అట్రిషన్ గరిష్టంగా 17-19 శాతంగా ఉండగా, ఎఫ్‌వై23లో ఇది 16-18 శాతంగా ఉంటుందని అంచనా. పరిశ్రమలో అట్రిషన్ అనేది సప్లై-సైడ్ సవాళ్ల వల్లే పెరుగుతుంది. ఈ సవాళ్లు తాత్కాలికమే కాగా ఎఫ్‌వై23 నుంచి సాధారణ స్థాయికి తగ్గే అవకాశాలు ఉన్నాయి" అని నివేదిక పేర్కొంది. క్లౌడ్ ఐటీకి ప్రధాన ఆదాయాన్ని సమకూర్చే వాటిలో ఒకటిగా నిలవనుంది. అన్‌ఎర్త్‌ఇన్‌సైట్ ప్రకారం, 2030 నాటికి ఐటీ సేవల పరిశ్రమకు క్లౌడ్ సేవలు 80 బిలియన్ నుంచి 100 బిలియన్ డాలర్ల వరకు ఆదాయం పెడతాయని అంచనా. క్లౌడ్ కొత్త టూల్స్, కొత్త అవకాశాలు, కనెక్ట్ చేసే కొత్త మార్గాలు, అల్గారిథమ్‌లను రూపొందించే కొత్త పద్ధతులతో ముందుకు వస్తోంది. తద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అగ్రశ్రేణి ఐటీ సేవల సంస్థలకు 2030 నాటికి ఈ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్, ప్లాట్‌ఫామ్ బిజినెస్ 15 బిలియన్ల నుంచి 20 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించగలదని నివేదిక పేర్కొంది. ఉత్పత్తులు, ప్లాట్‌ఫామ్ బిజినెస్ కోసం టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ సంస్థలు యూఎస్, ఆగ్నేయాసియా, భారతదేశంలో విస్తరణ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. టైర్-2, టైర్-3 సంస్థలైన పెర్‌సిస్టెంట్, రామ్‌కో, ఫైనాన్షియల్ టెక్నాలజీ, డెసిమల్ టెక్నాలజీస్ సంస్థలు యూఎస్, యూకే, యూఏఈ, సింగపూర్ ఆఫ్రికా వంటి గ్లోబల్ మార్కెట్‌ల ప్లాట్‌ఫామ్‌ల నుంచి భారీ ఎత్తున ఆదాయం సంపాదించనున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu