Ad Code

కోవాగ్జిన్ టీకా సమర్థత 77.8%

 


కొన్ని రోజుల కిందటి వరకు కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ మీద ప్రపంచ దేశాలకు అంతగా విశ్వాసం లేదు. పూర్తి నివేదికలు, క్లినికల్ ట్రయల్స్ వివరాలు పరిశీలించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల కోవాగ్జిన్‌ను అత్యవసర వినయోగానికి అనుమతి ఇచ్చి ఊరట కల్పించింది. డబ్ల్యూహెచ్‌వో అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితాలో కోవాగ్జిన్‌ను చేర్చిన వారం రోజుల తరువాత మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రతిష్టాత్మక మెడికల్ జర్నల్ లాన్సెట్ సైతం భారత్ బయోటెక్ రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్‌ మెరుగైన ఫలితాలు ఇస్తుందని పేర్కొంది. కోవాగ్జిన్ ఫేజ్ మూడు ట్రయల్స్ ఫలితాల ఆధారంగా కొవిడ్19 బాధితులపై 77.8 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని లాన్సెట్ జర్నల్ ప్రచురించింది. ఓవరాల్‌గా చూస్తే SARS-CoV-2 అన్ని రకాల వేరియంట్లపై 70.8 శాతం రక్షణ కల్పిస్తుందని గుర్తించారు. ఈ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ తయారు చేసింది. దేశంలోని 25 నగరాలలో దాదాపు 25,800 మందిపై అధ్యయనం చేశారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీలు వేగంగా తయారై అధిక కాలం రోగనిరోధకశక్తిని పెంచేందుకు దోహదం చేసింది. లక్షణాలు ఎక్కువగా ఉన్న కరోనా బాధితులపై 93.4 శాతం సమర్థవంతంగా పనిచేసిందని కోవాగ్జిన్‌ (BBV152)పై లాన్సెట్ జర్నల్ ప్రచురించింది. లక్షణాలు కనిపించని కరోనా బాధితులపై 63.6 శాతం రక్షణ కల్పించిందని తమ అధ్యయనంలో పేర్కొంది. అతి ప్రమాదకర వేరియంట్లలో ఒకటైన డేల్టా వేరియంట్‌పై 65.2శాతం, కప్పా వేరియంట్ పై 90 శాతం ప్రభావం చూపినట్లు గుర్తించారు. వ్యాక్సిన్ తయారుచేసిన తొలిరోజుల్లో ఇతర దేశాలు కోవాగ్జిన్‌ను విశ్వసించకపోగా, విమర్శలు చేశారు. కొన్ని సందర్భాలలో ట్రోలింగ్ సైతం జరిగింది. ప్లేస్‌బో గ్రూప్ సైతం చేసిన సర్వేలో మెరుగైన ఫలితాలు వచ్చినట్లు గుర్తించారు. 12.4 శాతం వారిపై అంతగా ప్రభావం చూపలేదని, కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని రిపోర్ట్ చేశారు. కేవలం 0.5 శాతం మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చాయి.  ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేకేత్తిస్తోన్న డెల్టా వేరియంట్‌ను సైతం కోవాగ్జిన్ మెరుగ్గా ఎదుర్కొందని నాంజింగ్‌ కేంద్రంగా పనిచేస్తున్న జియాంగ్జూ ప్రావిన్స్‌లోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌లో సేవలు అందించే చైనా నిపుణులు జింగ్ జిన్ లీ, ఫెంగ్ కై ఝూ తెలిపారని లాన్సెట్ జర్నల్‌లో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ప్లేస్ బో తీసుకున్న వారితో పోల్చితే కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారిలో పాజిటివ్ కేసులు తక్కువగా గుర్తించారు. లక్షణాలున్న కరోనా బాధితులపై లక్షణాలు లేని వారి కంటే అధిక ప్రభావం చూపిందని చైనా నిపుణులు అభిప్రాయపడ్డారు. మెరుగైన ప్రభావం ఫలితంగా కోవిడ్ వ్యాప్తిని త్వరగా అరికట్టవచ్చు. లాన్సెట్ జర్నల్ వెల్లడించిన కోవాగ్జిన్ సమర్థత, ప్రభావం ఫలితాలపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ స్పందించారు. లాన్సెట్ డేటాతో కోవాగ్జిన్ పై ప్రపంచ దేశాలకు పూర్తి అవగాహన వస్తుంది. కోవిడ్ మహమ్మారిపై సమర్థవంతంగా పనిచేసే వ్యాక్సిన్ల జాబితాలో కోవాగ్జిన్ చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. కొవిడ్ 19 వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్స్ చేయగా డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. లాన్సెట్ వివరాలు గమనిస్తే తాము ఎంత పారదర్వకంగా వ్యవహరించామో ప్రపంచ దేశాలకు సైతం తెలిసిందని భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా అన్నారు. కోవాగ్జిన్ ప్రమాణాన్ని మరింతగా పెంచుతాయని హర్షం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu