Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Saturday, November 13, 2021

చందమామపై ఆక్సిజన్‌

 

చంద్రుడి ఉపరితలం పై పొరల్లో 800 కోట్ల మందికి కనీసం లక్ష సంవత్సరాల పాటు సరిపడినంత ఆక్సిజన్‌ దాగి ఉన్నదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనిని వెలికి తీయగలిగితే చందమామపై మానవ జీవనం అనే కల నిజం కావొచ్చని పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనలు పెరుగుతున్న వేళ మార్స్‌, చంద్రుడిపై జీవనం గురించిన ఊహలు పెరుగుతున్నాయి. ఈ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా భూమికి దగ్గరగా ఉన్న చందమామ మీదకు ఇప్పటికే మనిషి వెళ్లి వచ్చాడు. అక్కడ ఆక్సిజన్‌ను అందించగలిగితే మనుషులు జీవించడం అసాధ్యమేం కాదన్న అంచనాలున్నాయి. ఉన్న కొద్దిపాటి వాయువులు కూడా హైడ్రోజన్‌, నియాన్‌, ఆర్గాన్‌ లాంటివే ఉన్నాయి. ఇవి జీవం మనుగడకు ఉపయోగపడవు. అయితే ఇటీవల అక్కడి మట్టి నమూనాలపై జరిపిన పరిశోధనల్లో.. చంద్రుడి ఉపరితలం పైపొరల్లోని మట్టిలో ఆక్సిజన్‌ ఉన్నట్టు తెలిసింది. ఈ పైపొరలను రిగోలిథ్‌ అంటారు. రిగోలిథ్‌లో 45% దాకా ఆక్సిజన్‌ ఉండొచ్చని అంచనా. భూమి లాగే చంద్రుడి గర్భంలో కూడా సిలికా, అల్యూమీనియం, ఇనుము, మెగ్నీషియం ఆక్సైడ్‌ల వంటి ఖనిజాలు ఉంటాయి. ఈ ఖనిజాల్లోనే ఆక్సిజన్‌ నిక్షిప్తమై ఉంటుంది. దీనిని నేరుగా పీల్చలేం. మనిషి పీల్చడానికి అనువైన ఆక్సిజన్‌గా మార్చాలంటే ఎలక్ట్రోలైసిస్‌ లాంటి ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. దీని కోసం ఈ మట్టి పొరల్లోని ఆక్సైడ్‌లను ద్రవ రూపంలోకి మార్చాలి. ఇలాంటి సాంకేతిక ఇప్పటికే భూమిపై ఉంది. కాబట్టి భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఈ సాంకేతికతను చంద్రుడిపై వాడి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటివరకు చంద్రుడి మట్టిపై జరిపిన పరిశోధనలను బట్టి రిగోలిథ్‌లో ఒక్కో క్యూబిక్‌ మీటర్‌లో 630 కిలోల ఆక్సిజన్‌ ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మనిషి బతకాలంటే రోజుకు 800 గ్రాముల ఆక్సిజన్‌ చాలు. అంటే 630 కిలోల ఆక్సిజన్‌తో మనిషి రెండు ఏండ్లు బతకొచ్చు. రిగోలిథ్‌ 10 మీటర్లు ఉందనుకొంటే.. దాని నుంచి 800 కోట్ల మందికి లక్ష సంవత్సరాలు సరిపడా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయవచ్చు.


No comments:

Post a Comment

Popular Posts