Ad Code

శ్రయద్వాలు

 




పూర్వము పెద్దిభొట్టు అనే గొప్ప కవి వుండేవాడు. ఇతను మంచి సంస్కృత సాహిత్యము,శాస్త్ర పాండిత్యము గలవాడు. పెద్దిభొట్టు నిరాడంబరుడు మంచి వాడు. నిజాయితీ పరుడు. ధనాశ లేదు వచ్చిన దానితో నిరాడంబరముగా జీవితము గడిపే వాడు. శిష్యుల వద్ద కూడా ఎక్కువ డబ్బు తీసుకునేవాడు కాదు. అందుకే బీదతనము లోనే వుండినాడు. అతని తోడల్లుడు ఘనాంతము, వేద విద్య నేర్చినవాడు. మంచి కండ పుష్టి కలిగినవాడు. దురాశా పరుడు. అతడు ఎక్కువ ధనము సంపాదించి ధనవంతుడుగా పేరు పొందినాడు. అతనికి పెద్దిభొట్టు అంటే చులకన. అత్తగారింట్లో కూడా చిన్నల్లుడినే ఎక్కువ గౌరవంగా చూసేవారు. అందుకని పెద్దిభొట్టు అత్తగారింటికి వెళ్ళేవాడుకాదు. ఒకసారి మామగారి వూరిలో పండితసభకు పెద్దిభోట్టును, అతని తోడల్లుడి నీ ఆహ్వానించారు అందుకని పెద్దిభొట్టు ఆ గ్రామమునకు వెళ్లి అత్తగారింట బస చేయవలిసి వచ్చెను. 5 రోజుల  సభ కనుక 5 రోజులు వుండవలసి వచ్చెను. అత్తగారు చిన్నల్లుడికి గదిలో పట్టెమంచం మీద, పెద్దల్లుడికి గది బయట వసారాలో క్రింద పడక ఏర్పాటు చేసింది. పెద్దిభోట్టుకు కోపము వచ్చిననూ వూరికే వుండెను మధ్యరాత్రిలో చిన్నల్లుడు లఘుశంక కోసం బయటకు వెళుతూ కావాలనే పెద్దిభొట్టు ను కాలితోతన్ని పొరబాటున తగిలిందని "క్షమద్వం" ""క్షమద్వం" (క్షమించండి) అని చెప్పి వెళ్లి పోయాడు. మరుదినము కూడా అలాగే కాలితో తన్ని క్షమద్వమ్ క్షమద్వమ్ అని అన్నాడు. మూడో రోజు కూడా అలాగే చేశాడు. పెద్దిభోట్టుకు బాగా కోపం వచ్చింది విసురుగా లేచి చిన్నల్లుడి సిగ పట్టుకొని లాగి పోగారుబోతా! ప్రతిదినము కావాలని తన్నుచూ క్షమద్వమ్ అని అంటావా? అతన్ని వంగ బెట్టి నీకు ఒక క్షమద్వము తెలిసిన నాకు ముప్పది  రెండు "శ్రయద్వములు " వచ్చును ఏమనుకున్నావో నా దెబ్బ చూసుకో అని వీపు మీద ప్రథమా ద్వితీయా యేషు శ్రయద్వం, ద్వితీయా తృతీయా యేషు శ్రయద్వం,తృతీయా చతుర్థెషు శ్రయద్వం అంటూ 32 శ్రయద్వాలు సుస్వరముతో చెప్తూ 32 పిడి గుద్దులు వెన్నెముకలు విరుగునట్లు గుద్దెను.(యిట్లు 32 శ్రయద్వములు వున్న వేద మంత్రమున్నది) చిన్నల్లుడు కిక్కురుమనక భరించెను. అందరూ లేచిన తనకవమాన మగునని. అప్పటి నుండీ పెద్దిభొట్టు పట్ల భయభక్తులతో మెలగు చుండెను. అప్పటినుండీ ఎవరైనా తన్నులు తిని వచ్చిన, వాడికి బాగా "శ్రయద్వము"లు తగిలినవి అని అనేవారు. అదొక పారిభాషిక పదముగా లోకములో మిగిలిపోయింది.

Post a Comment

0 Comments

Close Menu