Ad Code

చాణక్యుడికి అదే వరమైంది...!

 

ప్రాచీన భారతదేశంలో మగధ చాలా గొప్ప సామ్రాజ్యం. ఆ రోజుల్లో 16 గొప్ప రాజ్యాల్లో మగధ ఒకటి అని భావించేవారు. ప్రాచీన భారతదేశ సంస్కృతి, వైభవానికి ఈ రాజ్యం గొప్పకేంద్రం. ఇలాంటి రాజ్యంలో చనక రుషిగా ప్రసిద్ధుడైన గొప్ప పండితుడు చనకుడు. ఈయన కుమారుడే చాణక్యుడు. చనకుడి కుమారుడు కావడం వల్లే చాణక్యుడు అయ్యాడు. అయితే చిత్రం ఏమిటంటే చాణక్యుడు దంతాలన్నింటితో జన్మించాడు. సాధారణంగా దంతాలతో జన్మించిన వారు రాజు అవుతారని అంటారు. కుల ధర్మానికి వ్యతిరేకంగా కుమారుడు చక్రవర్తి కావడం తండ్రికి ఇష్టం లేదు. ఎందుకంటే తమది బ్రాహ్మణ వంశం. ఈ వంశానికి చెందిన వాడు బ్రాహ్మణ ధర్మం నిర్వర్తించాలి కానీ క్షత్రియ ధర్మం నిర్వహించకూడదు. ఈ ఉద్దేశంతో చనకుడు ఓ రాయి తీసుకుని కుమారుడి పళ్లు విరగ్గొట్టేందుకు ప్రయత్నించాడు. కొన్ని పగిలాయి, మరికొన్ని సగం సగం విరిగి అలాగే ఉండిపోయాయి. దీంతో చాణక్యుడి ముఖం వికారంగా తయారైంది. అసలే నలుపు, ఆపై విరిగి పళ్లు చూసేందుకే భయపడేవారంతా. అందగాడు కాకపోతేనేం అద్భుతమైన తెలివితేటలున్న వాడు చాణక్యుడు. బాల్యంలోనే నాలుగు వేదాల్లో అపారమైన పాండిత్యాన్ని సంపాదించాడు. కొడుకు తెలివితేటలు చూసి తండ్రి చనకుడు చాణక్యుడిని తక్షశిల విశ్వవిద్యాలయంలో చేర్పించాడు. చాణక్యుడు తరగతి గదిలోకి రాగానే వికృత రూపాన్ని చూసి విద్యార్థులంతా గేలి చేసేవారు. కానీ కొన్నాళ్లు గడిచేసరికి అపూర్వ ప్రజ్ఞ, ధారణాశక్తి ఏ స్థాయిలో ఉందో వారికి అర్థమైంది. దీంతో అప్పటి వరకూ రూపం చూసి భయపడిన వారంతా గౌరవంతో దగ్గరకు చేరడం ప్రారంభించారు. కొన్నాళ్లు విద్యాభ్యాసం అనంతరం అక్కడే ఆచార్యుడిగా విధులు నిర్వర్తించాడు చాణక్యుడు. అతడిని విద్యార్థులు ప్రధానాచార్యుడిగా సంబోధించేవారు. విద్యార్థులకు అత్యంత ప్రియమైన ఆచార్యుడిగా మారిపోయాడు. ఎందరో అభిమాన శిష్యులు ఉండేవారు. కానీ చిన్నప్పటి నుంచీ తన మనసులో కురూపి అనే ఫీలింగ్ మనసులో అలాగే ఉండిపోయింది. అయితే దంతాలతో జన్మించిన వ్యక్తి రాజు అవుతాడని తండ్రి భయపడినట్టే.. కింగ్ అవకపోయినా కింగ్ మేకర్ మాత్రం అయ్యాడు చాణక్యుడు.

Post a Comment

0 Comments

Close Menu