Ad Code

నండూరి వెంకట సుబ్బారావు


నండూరి వెంకట సుబ్బారావు ప్రసిద్ధ గేయ రచయిత. వీరి ఎంకి పాటలు ఆంధ్ర దేశమంతా సుప్రసిద్ధంగా ప్రబంధాలతో సమానంగా గౌరవించబడ్డాయి. వీరు పశ్చిమ గోదావరి జిల్లాలోని వసంతవాడలో చిన్న బాపన్న దంపతులకు జన్మించారు. వీరి ప్రాథమిక విద్య ఏలూరులోను, కళాశాల చదువు కాకినాడలోను సాగాయి. కొన్ని పరీక్షలలో తప్పడం మూలంగా మద్రాసుకు మకాం మార్చి వీరి బంధువైన బసవరాజు అప్పారావు గారి ప్రోత్సాహంతో ఎఫ్.ఏ. పరీక్షలో ఉత్తీర్ణులై, బి.ఎ. కోసం మద్రాసు క్రైస్తవ కళాశాలలో చేరారు. కొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేసి న్యాయశాస్త్రంలో పట్టా సంపాదించారు. 1926 నుండి ఏలూరులో న్యాయవాదిగా పనిచేశారు. తాను నమ్మిన కవితా మార్గాన్ని, దాని విశిష్టతను, కవిత్వంలోని మర్మాలను నిరంతరం బోధించే అప్పారావును తనకు గురువుగా భావించారు. గురజాడ అప్పారావు గారి ముత్యాలసరాలు చదివి దానిలోని కవన మాధుర్యానికి ముగ్ధులైనారు. లవణరాజు కల అనే కావ్యం వీరిని ప్రగాఢంగా ఆకర్షించింది. తన ఎంకి నాయుడు బావలు లవణరాజు కలలో నుండి మొలుచుకుని వచ్చినట్లుగా వీరి ఉనికిపట్టయిన ఏటిదరితోట లవణరాజు కలలోనిదిగా వ్యాఖ్యానించారు. ఎంకి పాటలు నండూరి వెంకట సుబ్బారావు రచించిన గేయ సంపుటి. తెలుగు సాహిత్యంలో ప్రణయ భావుకతకూ, పదాల పొందికకూ క్రొత్త అందాలు సమకూర్చిన ఈ రచనను "ఎంకిపాటల గాలి దుమారము" అని తెలుగు సాహితీకారులు పలు సందర్భాలలో ప్రస్తావించారు. ఎంకిపాటలలో సుబ్బారావు గోదావరి మాండాలికాన్ని విశాఖ రూపకబేధాలతో కలిపి ఉపయోగించారు. తెలుగు ఆధునిక సాహిత్యంపై ఆంగ్ల సాహిత్యంలోని "కాల్పనిక భావ కవిత్వం" ప్రేరణ వలన వెలువడిన రచనలలో "ఎంకి పాటలు" ఒక ప్రముఖ అధ్యాయం. ఈ భావ కవిత్వపు ఉద్యమంలో అప్పటి నవకవులు తమ సంస్కృతాంధ్ర సాహిత్య పరిచయాన్నీ, పాశ్చాత్య భావ కవితల పోకడలనీ సమ్మిళితం చేసి ఎన్నో ప్రణయ గీతాలు పలికారు. ఆ సందర్భంలోనే ఊర్వశి, హృదయేశ్వరి, శశికళ, వత్సల, ఎంకి వంటి ప్రణయ నాయికలు తెలుగు కవితాభిమానుల గుండెలలో స్థానం సంపాదించారు. నండూరి వెంకట సుబ్బారావు మద్రాసు క్రైస్తవ కళాశాలలో చదువుతున్న రోజులలో, 1917-1918 ప్రాంతంలో ఈ పాటలు వ్రాయసాగారు. ఒకసారి ఆయన ట్రాం బండిలో ఇంటికి వెళుతుండగా "గుండె గొంతుకలోన కొట్లాడుతాది" అనే పల్లవి రూపు దిద్దుకొన్నదట. ఆ పాట విని మిత్రులు ప్రోత్సహించారు. క్రమంగా "ఎంకి పాటలు" రూపు దిద్దుకొన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu