Ad Code

పెద్దనోట్ల రద్దు కొరడా!

 


స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రజల జీవితాల పాలిట ఇంత వినాశకరంగా పరిణమించిన ఆర్థిక చర్య ఈ పెద్ద నోట్ల రద్దు మాత్రమే. రూ.500. రూ.1000 నోట్ల రద్దు ద్వారా సాధించగలమని ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యాలలో ఏ వొక్కదానినీ సాధించలేకపోయింది.  2016 నవంబరు 8న మోడీ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రకటించిన లక్ష్యాలు నెరవేరడం జరిగేపని కాదని ముందే చాలామంది ఊహించారు. పెద్దనోట్ల రద్దు చాలా పెద్ద తప్పు అని దాదాపు ప్రతీ ఆర్థికవేత్తా అప్పుడే భావించారు. అందుకే ఏ కొద్దిమంది బాకా రాయుళ్ళో తప్ప అందరూ అప్పుడే దీనిని వ్యతిరేకించారు. నల్లధనం నిర్మూలన, దొంగనోట్ల బెడదను వదిలించు కోవడం, ఉగ్రవాదులకు నిధుల ప్రవాహాన్ని అరికట్టడం - ఈ మూడు లక్ష్యాలతో పెద్దనోట్ల రద్దు చేపట్టినట్టు ప్రభుత్వం తెలిపింది. అందులో దొంగనోట్ల బెడద, ఉగ్రవాదులకు నిధులు అనేవి ఊరికే చెప్పుకోడం కోసం చేర్చినవే తప్ప ప్రధానమైనవి కావన్న సంగతి అందరికీ తెలిసినదే. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అంచనాల ప్రకారం దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీలో దొంగనోట్ల శాతం చాలా స్వల్పంగానే ఉంది. వాటి బెడద వదిలించుకోవడం కోసం చలామణిలో ఉన్న నోట్లలో ఏకంగా 85శాతం నోట్లను రద్దు చేయడం ఎంతవరకూ సమంజసం అన్న ప్రశ్నకు సమాధానం లేదు.  ఇక ఉగ్రవాద బృందాలకు నిధులు అందే మార్గాలు చాలా ఉన్నాయి. పెద్దనోట్లను రద్దు చేయడం ద్వారా వాళ్ళకు నిధులు అందకుండా అరికట్టడం సాధ్యమే అని నిజంగా విశ్వసించినవారెవ్వరూ లేరు. అందుచేత నల్లధనాన్ని నిర్మూలించడం అన్నది ఒక్కటే ప్రధానమైన లక్ష్యం. పెద్దనోట్ల రద్దు ద్వారా దానిని సాధించవచ్చునని భావించడం బట్టి మోడీ ప్రభుత్వానికి నల్లధనపు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పని చేస్తుందో తెలియదని స్పష్టం అవుతోంది. అంటే అసలు దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పని చేస్తుందన్న విషయంపైన సైతం ఈ ప్రభుత్వానికి అవగాహన లోపించిందన్నమాట. నల్లధనం అంటే బాలీవుడ్‌ చిత్రాల్లో చూపించే విధంగా దిండుల్లో, పరుపులకింద, సూట్‌కేసుల్లో కట్టలకు కట్టలు నోట్లను దాచిపెట్టడం అని భావించడం వల్లనే నోట్ల రద్దు ద్వారా ఆ నల్లడబ్బును నిర్మూలించవచ్చునని మోడీ ప్రభుత్వం భావించింది. నిజానికి నల్లడబ్బు అంటూ వేరేగా ఏమీ ఉండదు. ప్రధానంగా పన్నులు చెల్లించకుండా ఎగ్గొట్టడానికి కొన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలను అధికారికంగా వెల్లడి చేయకుండా గుప్తంగా ఉంచడమే నల్ల వ్యాపారం. అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలకూ డబ్బు కావాలి. అనధికారికంగా జరిపే కార్యకలాపాలకూ డబ్బు కావాలి. ఈ అనధికారిక కార్యకలాపాలకు ఉపయోగించే డబ్బునే నల్లధనం అని అనవచ్చు. అటువంటి డబ్బు దిండుల్లోనో, పరుపులకిందో దాగివుండదు. నిత్యం చలామణిలోనే ఉంటుంది. ఈ డబ్బును అధికారిక కార్యకలాపాలనుండి అనధికారిక కార్యకలాపాలకు, లేదా అటునుండి ఇటువైపు మార్చుకుంటూ ఉండవచ్చు. అందుచేత మోడీ ప్రభుత్వం ఆశించిన విధంగా నల్లడబ్బు కలిగివున్నవాళ్ళంతా ఆ డబ్బును మార్చుకోడానికి బ్యాంకులకు రాకుండా ఉండిపోయినా, ఆ డబ్బంతా మురిగిపోయినా, నల్ల వ్యాపారం అక్కడితో ఆగిపోయేదేమీ ఉండదు.  తెల్ల డబ్బు నల్ల వ్యాపారం కొనసాగించడానికి మళ్ళుతుంది. అంటే అధికారిక కార్యకలాపాలవైపు నుండి అనధికారిక కార్యకలాపాల వైపు మళ్ళుతుంది. అప్పుడు కొంతకాలం పాటు నగదుకు కొరత ఏర్పడుతుంది. దాని ఫలితంగా కొంత కాలం ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. అంతే తప్ప నల్ల వ్యాపారమేమీ అరికట్టబడదు. ఆచరణలో జరిగింది చూస్తే మాత్రం 99శాతం పెద్దనోట్లు మార్పిడి నిమిత్తం బ్యాంకులకు వచ్చేశాయి. పెద్దనోట్ల రద్దు ప్రహసనం ఒక పెద్ద వైఫల్యం అని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఏం కావాలి? నల్లడబ్బు అంతా బ్యాంకులవద్దకు మార్పిడి కోసం రాకుండా నిలిచిపోతుందని ప్రభుత్వం ఆశించింది. అలా వస్తే దొరికిపోతామన్న భయంతో నల్లధనాన్ని కలిగివున్న వారంతా నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు రాకుండా ఆగిపోతారని ప్రభుత్వం అనుకుంది. కొత్తనోట్ల కింద మార్పిడి కోసం బ్యాంకుల వద్దకు రాకుండా ఆగిపోయిన నగదు ఎంత ఉంటుందో అంతమేరకు రిజర్వుబ్యాంకు రుణభారం తగ్గినట్టేనని, ఎంత మేరకు రుణభారం తగ్గుతుందో అంత మేరకు రిజర్వుబ్యాంకు తిరిగి కొత్త నోట్లను ముద్రించి ప్రజలకు పంచిపెట్టెయ్యవచ్చునని బీజేపీ అధికార ప్రతినిధులు ప్రతిపాదించారు. ఆ విధంగా ఎంతెంత సొమ్మును ప్రజలకు పంచవచ్చో అంచనాలు కూడా ప్రచారంలో పెట్టారు.  కాని 99శాతం నోట్లు మారకం నిమిత్తం ఎప్పుడైతే బ్యాంకులవద్దకు వచ్చాయో అప్పుడే ఈ లెక్కలన్నీ ఎంత పనికిమాలినవో, ఎంత తెలివితక్కువగా ప్రభుత్వం ఆశలు పెట్టుకుందో తేలిపోయింది. మొత్తం నోట్లరద్దు ప్రక్రియ అంతా పాత నోట్లకు బదులు కొత్తనోట్లను ముద్రించడంగా మిగిలింది. అది కూడా ప్రజానీకానికి చాలా అసౌకర్యాలు కలిగిస్తూ సాగింది. అయితే ఈ పెద్దనోట్ల రద్దు కేవలం ప్రజలను బ్యాంకుల ముందు గంటల తరబడి క్యూలలో నిలబెట్టే అసౌకర్యానికే (ఆ క్యూలలో కూడా కొంతమంది ప్రాణాలను కోల్పోయారు) పరిమితమైన వ్యవహారం కాదు. ఆర్థిక వ్యవస్థపై అది తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. మొత్తం చలామణిలో ఉండే కరెన్సీలో రద్దైన నోట్లు 85శాతం. ఒకేసారి ఏకంగా 85శాతం నోట్లు చలామణిలో లేకుండా పోవడంతో ఆర్థిక వ్యవస్థపై అది స్వల్పకాలిక ప్రభావాన్నే కాకుండా దీర్ఘకాలిక ప్రభావాన్ని కూడా చూపింది. మొత్తం రద్దైన నోట్ల స్థానంలో కొత్తనోట్లు రావడానికి 9నెలలు పట్టింది. ఈ కాలమంతా కరెన్సీకి కొరత ఏర్పడింది. దానివలన కరెన్సీ లావాదేవీలు ఎక్కువగా జరిగే చిన్న ఉత్పత్తుల రంగం అన్నింటికన్నా ఎక్కువ దెబ్బ తిన్నది. తమ రబీ పంటను అమ్ముకోడానికి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. తర్వాత సాగు చేసే పంటల నిమిత్తం విత్తనాలను, ఎరువులను కొనుగోలు చేయడానికి వారివద్ద డబ్బు లేకుండా పోయింది. అందుచేత వారు అప్పులు చేశారు. ఎవరైతే ఆ విధంగా అప్పులు చేసి పెట్టుబడి పెట్టలేదో, వారివద్ద పని చేసే కూలీలకు ఉపాధి లేకుండా పోయింది. ఆ కూలీలు అప్పులు చేసి ఇళ్ళకు తిరిగిపోయి తమ కుటుంబాలను ఆ అప్పులతో పోషించుకున్నారు. ఆ విధంగా చిన్న ఉత్పత్తుల రంగం, లేదా అసంఘటిత రంగం యావత్తూ అప్పులపాలైంది. దేశంలోని 
మొత్తం కార్మికులలో 94శాతం ఈ రంగంలోనే ఉన్నారని మనం మరిచిపోకూడదు. ఈ అప్పు ఆ రంగం మీద శాశ్వతమైన ముద్ర వేసింది. ఒకసారి ఉత్పత్తి క్రమంలో ఆటంకం వచ్చిందంటే ఆ నడిమి కాలంలో చేసిన అప్పు శాశ్వతంగా అప్పుగా మిగిలిపోతుంది. కొన్నిచోట్ల చేసిన ఉత్పత్తి అమ్ముడు పోకుండా ఉండిపోయినప్పటికీ, దానిని నిల్వ చేసుకుని, మరోవైపు ఉత్పత్తిని కొనసాగించారు. అయితే అలా కొనసాగించడానికి డబ్బు చేతిలో ఉండదు. (ఎందుకంటే అప్పటికే చేసిన ఉత్పత్తి అమ్ముడుపోలేదు కనుక) అందువలన వారు ఉత్పత్తి కొనసాగించడానికి అప్పు చేయవలసివచ్చింది. తర్వాత కాలంలో ఆ అప్పును వారు తిరిగి చెల్లించివేసివుండొచ్చు. కాని ఆ అప్పుమీద వడ్డీ మాత్రం వారికి పెనుభారమే అయింది. ఎందుకంటే ఆ కాలంలో వారికి అప్పు దొరకడమే చాలా కష్టం. దొరికినా చాలా ఎక్కువ వడ్డీకి మాత్రమే దొరుకుతుంది. ఆ అధిక వడ్డీ ఉత్పత్తిదారుల మెడకు గుదిబండే అయింది. ఆ విధంగా చిన్న ఉత్పత్తి రంగం తాలూకు రుణభారం స్థాయి శాశ్వతంగా పెరిగింది. ఆ తర్వాత కాలంలో తిరిగి యధాతధ స్థితిలో ఉత్పత్తిని వారు కొనసాగించగలిగినప్పటికీ, పెరిగిపోయిన వారి రుణభారం ఆ యూనిట్లను నష్టాలపాలు చేసింది. ఆ విధంగా నోట్లరద్దు వలన చిన్న ఉత్పత్తిరంగం తాత్కాలికంగా ఉత్పత్తిలో ఒడిదుడుకులకు లోనవడమే కాక, శాశ్వతంగా చితికిపోయింది. దాని ప్రభావం అనివార్యంగా అందులో పనిచేసే కార్మికవర్గం మీద పడింది. నేటికీ ఆ రంగం చితికిపోయివుంది. అందులోని కార్మికుల పేదరికం తీవ్రంగానే కొనసాగుతోంది. చిన్న ఉత్పత్తిరంగం దెబ్బ తినడం ప్రభావం ఆ రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. సంఘటిత రంగం మీద కూడా ఆ ప్రభావం పడింది. అందుకు వేరే కారణాలు ఉన్నాయి. సంఘటిత రంగంలో ఉత్పత్తి అయే అనేక సరుకులకు కొనుగోలుదారులు ఈ చిన్న ఉత్పత్తిరంగంలోనివారే. ఒకసారి వారికి మాంద్యం దెబ్బ తగిలాక, ఆదాయాలు పడిపోయాక వారి వినిమయం తగ్గిపోయింది. సంఘటిత రంగం ఉత్పత్తి చేసే సరుకుల వినిమయం కూడా అందులో భాగంగానే తగ్గిపోయింది. దాని వలన సంఘటిత రంగం కూడా దెబ్బ తిన్నది. ఆ విధంగా నోట్లరద్దు సంఘటిత రంగాన్ని కూడా దెబ్బ తీసింది. ఈ లోగా, బీజేపీ (ఎప్పటికప్పుడ కొత్త అబద్ధాలను పుట్టించడంలో దిట్ట) మరొక కొత్త కహానీని ముందుకు తెచ్చింది. ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం ఎక్కువగా ఉన్నందువల్లనే అవినీతి, నల్లధనం పెరిగిపోయాయని, నగదు రహిత లావాదేవీలను బాగా ప్రోత్సహిస్తే అన్ని లావాదేవీలూ నమోదు అవుతాయి గనుక అవినీతిని, నల్ల ధనాన్ని అరికట్టవచ్చునని ప్రచారం చేశాయి. ఎటువంటి అవినీతికి నల్ల ధనానికి అవకాశంలేని ఆర్థిక వ్యవస్థను నిర్మించే దార్శనికత గల మహానేతగా మోడీని కీర్తిస్తూ ఆకాశానికెత్తాయి. అయితే వాస్తవాల ముందు ఈ ప్రచారం కాస్తా తుస్సుమంది. ఒక దేశంలో నగదు వినియోగం ఎంత మోతాదులో ఉందో అంచనా వేయడానికి ఒక కొలబద్దగా ఆ దేశంలోని జీడీపీకి చలామణిలో ఉన్న నగదుకి మధ్య ఉన్న నిష్పత్తిని పరిగణిస్తారు. బీజేపీ ప్రచారం ప్రకారం నగదు వినియోగం తక్కువగా ఉంటే అక్కడ అవినీతి తగ్గిపోవాలి. మన దేశంతో పోల్చినప్పుడు జర్మనీ, జపాన్‌ వంటి దేశాలలో అవినీతి మోతాదు తక్కువ. కాని మన దేశంతో పోల్చినప్పుడు అక్కడ జీడీపీ-నగదు నిష్పత్తి ఎక్కువగా ఉంది. ఇంకో ఆసక్తి కరమైన విషయం ఉంది. నోట్లరద్దు కన్నా ముందు మన నగదు వినియోగం జీడీపీలో 12శాతంగా ఉండేది. నోట్ల రద్దు తర్వాత వెంటనే అది అంతకన్నా తగ్గిపోయింది. కాని ఇప్పుడు అది పెరిగి ఏకంగా 14శాతానికి చేరింది. (అంటే నోట్లరద్దు వలన అవినీతి పెరిగింది అని బీజేపీ ఒప్పు కోవాలి) ఆ విధంగా చూసినా నోట్లరద్దు ఒక విఫలమైన ప్రక్రియ. నోట్లరద్దుకు ఆదేశించిన మోడీ దానివలన ప్రజలు ఏన్ని విధాలుగా బాధలు పడతారో ఏమాత్రమూ పట్టించుకోలేదు. ఏ పాలకులైనా ప్రజల బాధలను పట్టించుకోకుండా అంత అన్యాయంగా ఎలా వ్యవహరించగలరు? ప్రజలను ఏదైనా ఒక షాక్‌కి గురి చేసి ఇబ్బందుల పాలు చేస్తే ''మనకి ఇన్ని ఇబ్బందులు ఉంటాయని తెలిసినా ప్రభుత్వం ఇటువంటి చర్య తీసుకుందంటే దాని వలన అంతకన్నా ఏదో గొప్ప లక్ష్యాన్ని సాధించడానికే సిద్ధపడివుండాలి'' అని అనుకుని ఆ ప్రజలు అబ్బురపడిపోతారు అని ఈ ప్రభుత్వం బలంగా భావిస్తోందన్నమాట. అజ్ఞానం, అహంకారం, కలిగి వుండడంతోబాటు ప్రజలకి షాకులిచ్చి అబ్బురపరిచేయ వచ్చుననే కోరిక ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉండడం ఎంత ప్రమాదకరమో తెలుసుకోడానికి ప్రజలు ఇప్పటికే చాలా మూల్యం చెల్లించారు.

                                                                                                                             ప్రభాత్‌ పట్నాయక్

                                         (స్వేచ్ఛానుసరణ)

Post a Comment

0 Comments

Close Menu