Ad Code

అంతర్యామి !

 

దైవం ఉన్నాడా అనే విషయంపై మనిషి మనసు ఎప్పుడూ సంశయాత్మకంగానే ఉంటుంది. దేవుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడ ఉంటాడు? ఈ ప్రశ్నలు సామాన్యుడినే కాదు, మేధావిని సైతం వేధిస్తూనే ఉంటాయి. ఎంత వెతికినా, ఎవరిని అడిగినా, వీటికి సరైన సమాధానం దొరకదు. రామకృష్ణ పరమహంస రూపంలో వివేకానందుడికి కలిగిన ఆ అదృష్టం, ఎవరికోగాని అందదు. దైవాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ప్రతి మనిషిలో సహజంగా ఉన్నప్పటికీ, ఎలా అనేది అంతు పట్టదు. ఆవు అనగానే ఆవు రూపాన్ని ఊహించుకున్నట్లే, దైవం అనగానే ఒక వ్యక్తిగానో వస్తువుగానో మనిషి ఊహించుకుంటాడు. కంటితో ఆవును చూసినట్లే, దైవాన్ని చూడాలనుకుంటాడు. అది సాధ్యపడక, దైవం లేడని సంశయిస్తాడు. కాని తాను గ్రహించలేనివి, ఊహకు అందనివి లేవనడం సరికాదని తోస్తుంది. ఇలా తనలో తాను తర్కించుకుంటూ, విషయాలను లోతుగా పరిశీలించడం మొదలుపెడతాడు. గాఢ నిద్ర(సుషుప్తి)లో మనిషికి నేను అనే స్ఫురణ కూడా ఉండదు. తన ఉనికిని సైతం మరిచిపోయిన మనిషికి, సుఖంగా నిద్రించానని మెలకువ వస్తే గాని తెలియదు. ఇంద్రియాతీతమైన ఈ స్థితిని సూక్ష్మంగా గమనించిన మనిషి, తర్కానికి బుద్ధికి గోచరించనంత మాత్రాన, అవి సత్యప్రమాణాలు కావనుకోడు. దీనితో దైవం అగోచరమైనా, లేడని భావించడు. సూక్ష్మబుద్ధితో విశ్వాన్ని ఒకసారి పరికిస్తే, సృష్టిలో ఒక నియతి సుస్పష్టంగా కనపడుతుంది. ఒకదానితో మరొక దానికి సంబంధం ఉండి సమన్వయం చేసిన గొప్ప వ్యవస్థగా గోచరిస్తుంది. ఎక్కడ అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయో అక్కడ ఒక మేధాశక్తి పనిచేస్తూ ఉండాలి, అదే దైవం అయి ఉండవచ్చు అనే బలమైన అనుమానం మనిషికి కలుగుతుంది. దైవం ఉనికిని పసిగట్టి, అందని ఆ దైవాన్ని అందుకోవడం ఎలాగన్న మథనం మనిషి మదిలో మొదలవుతుంది. ఇవి శేష ప్రశ్నలుగా మిగిలితే, విశ్వాసం వెనుతిరిగి నాస్తికవాదంవైపు వెళ్ళే ప్రమాదం ఉంది. వీటికి సమాధానం కావాలంటే మనిషికి కాస్త శాస్త్ర పరిజ్ఞానం అవసరం. గణితంలో విషయాలను తెలుసుకునేందుకు గణితశాస్త్ర సూత్రాలను, సిద్ధాంతాలను ఒక క్రమపద్ధతిలో అధ్యయనం చేస్తారు. అలాగే దైవం గురించి తెలుసుకోవాలంటే, దాన్ని బోధించే ఆధ్యాత్మిక శాస్త్రాల సూచనలను పాటిస్తూ, విషయాలను క్రమపద్ధతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. దైవం నిజస్వరూపం నిర్గుణ నిరాకారం. ఆయనను పూజించడం, దర్శించడం- దుర్లభం. దేని గురించి భక్తుడు వెతుకుతున్నాడో అది తానై ఉన్నందువల్ల, ఆ తత్వాన్ని కేవలం జ్ఞానంతోనే గ్రహించాలి అంటుంది బృహదారణ్యకం. బాహ్య ప్రపంచాన్ని చూడగలిగే నేత్రాలు తమను తాము చూసుకోలేవు. తమను తాము చూసుకోలేని కళ్లు, వాటి వెనక ఉన్న చైతన్యాన్ని ఎలా చూడగలవు అనేది ప్రశ్న. అందుకే దైవంపై అనుమానాలను వీడి, గురువులు చెప్పినట్లు కైలాసంలోనో వైకుంఠంలోనో గుడిలోనో మదిలోనో ఉన్నాడన్న దృఢనిశ్చయంతో భక్తిగా పూజించాలి.  భక్తి అనే ఈ ప్రాథమిక దశలో ఉత్తీర్ణత సాధిస్తేనే, దైవం నిజరూపం బోధపడుతుంది అంటుంది శాస్త్రం. లోక కల్యాణం కోసం నిర్గుణ నిరాకారుడైన పరమాత్మ, రాముడుగా కృష్ణుడుగా జన్మించాల్సి వచ్చింది. అనుకున్న కార్యాలు నెరవేర్చి, దేహత్యాగమూ చేయక తప్పలేదు. అలాగే భక్తుడి భక్తికి బద్ధుడై, నిర్గుణ పరమాత్మ క్షణకాలం అయినా సగుణంగా దర్శనమివ్వక తప్పదు.  అదే భక్తి ఔన్నత్యం.

Post a Comment

0 Comments

Close Menu