Ad Code

మహాకవి కాళిదాసు


కాళిదాసు జన్మతః ఒక పసుల కాపరి. నిరక్షరాస్యుడు. మందబుద్ధి, గొర్రెలు కాచుకుంటూ తిరిగే వాడు. ఆ దేశపు రాజకుమారి విద్యాధరి. ఆమె గొప్ప విదుషీ మణి. తనకంటే గొప్ప పండితుడినే భర్తగా స్వీకరిస్తానని ప్రతిజ్ఞ పట్టింది. ఆమె చేత పరాభవం పొందిన పండితులంతా కలిసి ఆమెను ఎలాగైనా ఒక మూర్ఖుడి కిచ్చి పెళ్లి చేయాలని కుట్ర పన్నుతారు. తాను  కూర్చున్న కొమ్మనే నరుకుతున్న కాళిదాసు వాళ్లకు తటస్థ పడతాడు. ఇతడే సరియైన జోడి రాజకుమారికి అనుకొని  అతనికి విలువైన ఆభరణాలు ధరింప జేసి కొన్ని మాటలు, సంజ్ఞలు నేర్పి నీకు రాజకుమారితో పెళ్లి జరిపిస్తామని చెప్పి అక్కడ సభలో యేమీ మాట్లాడవద్దని నీవు మౌన దీక్షలో వున్నావని చెప్తామని ఎలా ప్రవర్తించాలో నేర్పించి సభకు తీసుకొని వచ్చిఅతన్ని గొప్ప పండితుడిగా పరిచయం చేస్తారు. అతను ఒక సంవత్సరం పాటు మౌన దీక్ష చేపట్టారని ఎక్కువ మాట్లాడరని చెప్తారు.. అక్కడ రాజకుమారిని దీవించడానికి వాడికి ఇలా చెప్పమని చెప్తారు. "త్రిపీడా పరిహారోస్తు దినే దినే " అని అనమని వాడికి నేర్పిస్తారు. రాజకుమారి తనకు నమస్కరించగానే  కాళిదాసు  వాళ్ళు చెప్పినది మర్చిపోయి "త్రిపీడాస్తు దినే దినే " అని దీవిస్తాడు. యిదేమి దీవెన? అని అంతా ఆశ్చర్య పోతారు. పండితులు దాన్ని సమర్థిస్తూ రాజకుమారీ నీకు పొద్దున పూట పిల్లలతోబాధ , మధ్యాహ్నం పూట అతిధి సత్కారలతో బాధ, రాత్రి నీ భర్త తో బాధ దినమూ వుండాలని వారి దీవెన లోని అంతరార్థం. ఇవన్నీ సంతోష కరమైనవె కదా స్త్రీలకు! అని చెప్తారు. అతని మొహం లో ఒక దివ్య తేజస్సు కనపడుతుంది రాకుమారికి. పెళ్ళికి వొప్పుకొని పెళ్లి చేసుకుంటుంది. మొదటి రాత్రే తాను మోసపోయానని తెలుసుకున్న ఆమె అతన్ని నీవు పాండిత్యం సంపాదించుకొని వస్తేనే భర్తగా అంగీకరిస్తాను అంతవరకూ నాకు మొహం చూపించ వద్దని అంతఃపురం నుండి గెంటి వేస్తుంది.  ఆ అవమానంతో ఊరిబయట కాళీ దేవాలయానికి వెళ్లి కాళీ బిద్దియ్ (విద్య యివ్వు)అని పదే పదే జపిస్తుంటాడు. అతని నిష్కళంక భక్తికి మెచ్చిన దేవి  అతని నాలుకపై బీజాక్షరాలు వ్రాసి ఇవ్వాళ నుండి నీవు మహాకవి వై కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తావు అని ఆశీర్వ దిస్తుంది దేవి. దాంతో అతనికి అపారమైన పాండిత్యము, కవితాశక్తి లభిస్తాయి.అతను  తిరిగి అంతః పురానికి వెళ్లి విద్యధరిని కలవాలని అడుగుతాడు ఆమె తలుపు తీయకుండా  "ఆస్తి కశ్చిత్ వాగ్విశే షః?" .నీ వాక్కు తీరేమైన బాగు పడిందా? అని అడుగుతుంది. అందుకు కాళిదాసు "ఆస్తి కశ్చిత్ ప్రచండ వాగ్విశే షః " అని సమాధానం చెప్పి కొన్ని అద్భుత మైన శ్లోకాలు చెప్తాడు. ఆమె నిన్ను భర్తగా అంగీకరిస్తున్నాను అని అంటుంది. దానికి కాళిదాసు నీవు నాకు విద్యా భిక్ష పెట్టిన దానివి గురువు తో సమానం నేను నిన్ను భార్యగా చూడలేను అని సమాధానం యిస్తాడు. ఆమె ఎంత బ్రతిమలాడినా అంగీకరించడు. ఆమెకు కోపం వచ్చినన్ను ధిక్కరించి నందుకు గాను నీవు చివరకు ఒక ఆడుదాని కారణంగానే మరణిస్తావు అని శాపం యిస్తుంది. మహాప్రసాదం అని వెళ్లి పోతాడు. తర్వాత ఆమె తనను అడిగిన  'ఆస్తి కశ్చిత్ వాగ్విశేషః" అనే పదాల్లోని మొదటి పదం 'ఆస్తి' అనే పదం తో కుమారసంభవం లోని మొదటి శ్లోకాన్ని,'కశ్చిత్'అనే పదం తో 'మేఘసందేశం' లోని మొదటి శ్లోకాన్ని, ఋతుసంహారం లోని మొదటి శ్లోకాన్ని విశేషఃఅనే పదముతోనూ ప్రారంభిస్తాడు. , 'వాక్కు' అనే పదం తో 'రఘువంశ' కావ్యం లోని మొదటి శ్లోకాన్ని వ్రాశాడు. చివరకు విలాసవతి అనే వేశ్య కారణంగా కాళిదాసు మరణిస్తాడు. కాళిదాసు తన 'రఘువంశం' కావ్యాన్నిఆయన భార్య మొదటి రాత్రి అడిగిన ప్రశ్న లోని 'వాక్కు' అనే పదం తో ప్రారంభం చేశాడు. "అస్తి కశ్చిత్ వాగ్విశే షః" అని ఆవిడ అడిగింది. నీ వాక్కు లో ఏమైనా విశేషం వుందా? అంటే నీకు పాండిత్యమేమైనా వుందా? అని.వాక్కు అనే పదముతో రఘువంశ కావ్యాన్ని ప్రారంభం చేస్తాడు.

వాగర్థా వివా సంపృక్తౌ వాగర్థ ప్రతి పత్తయేత్ 

జగతౌ: పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ 

అర్థము:--వాక్కు,అర్థము కలిసి ఉన్నట్టు కలిసి వున్న, ప్రపంచానికే మాతా పితరులైన పార్వతీ పరమేశ్వరులను, నాకు వాక్కు,అర్థములతో ఈ కావ్యాన్ని వ్రాసే తెలివి ప్రసాదించమని కోరుతూ నమస్కరిస్తున్నాను.

Post a Comment

0 Comments

Close Menu