Ad Code

71 వేల అకౌంట్లు బ్యాన్​...!


పబ్జీకి ప్రత్యామ్నాయంగా భారత్​లోఅడుగుపెట్టిన బ్యాటిల్​ గ్రౌండ్స్ మొబైల్​ ఇండియా గేమ్​కు గణనీయమైన ఆదరణ లభిస్తోంది. అతి కొద్ది రోజుల్లోనే ఈ గేమ్​ రికార్డు స్థాయిలో డౌన్​లోడ్స్ సాధించింది. అయితే కొంతమంది యూజర్లు గేమ్​ గెలవడానికి చట్టవిరుద్దమైన హ్యాకింగ్ పద్దతిని ఎంచుకుంటున్నారని గేమ్​ డిజైన్​ చేసిన క్రాఫ్టన్​ సంస్థ గుర్తించింది. దీంతో, వరుసగా ఖాతాలపై నిషేధం విధిస్తూ వారికి షాకిస్తోంది. ఇప్పటికే లక్షకు పైగా ఖాతాలను నిషేధించిన క్రాఫ్టన్​ తాజాగా మరో 71,116 ఖాతాలపై ఉక్కు పాదం మోపింది. చట్టవిరుద్దమైన చర్యలకు పాల్పడినందుకు గాను 71,116 బ్యాటిల్​ గ్రౌండ్స్​ ఇండియా ఖాతాలపై నిషేధం విధించింది. డిసెంబర్ 27 నుంచి జనవరి 4 మధ్య కేవలం వారం రోజుల్లోనే మొత్తం 71,116 అకౌంట్లను బ్యాన్​ చేసింది. ఆటగాళ్లు గేమ్ ఫెయిర్ ప్లే విధానాన్ని ఉల్లంఘించినందుకు ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. నిషేధానికి గురైన ఆటగాళ్లు తప్పుడు పద్దతుల్లో గేమ్‌ గెలిచేందుకు ప్రయత్నించడమే కాకుండా ఇతర ఆటగాళ్లపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నారని గేమ్​ డిజైనర్​ క్రాఫ్టన్ పేర్కొంది. ఇలాంటి వారి ఆట కట్టించేందుకే యాంటీ-చీట్ సిస్టమ్​ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ సిస్టమ్​ ద్వారా ప్రతి వారం అనేక ఖాతాలపై నిషేధం విధిస్తూ వస్తోంది. అంతకుముందు వారం అనగా డిసెంబరు 20 నుంచి డిసెంబర్ 26 మధ్య క్రాఫ్టన్​ సంస్థ సుమారు 60,000 బ్యాటిల్​ గ్రౌండ్స్​ ఇండియా ఖాతాలను నిషేధించింది. ఇక, దాని ముందు వారంలో (డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 19) మధ్య సుమారు లక్షకు పైగా ఖాతాలను నిషేధించింది. ఏదేమైనప్పటికీ, ఇలా కఠిన చర్యలు తీసుకుంటున్నందున నిబంధనలు ఉల్లంఘించే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఎవరైనా వినియోగదారుని మోసం చేసినట్లు గుర్తిస్తే క్రాఫ్టన్​ సంస్థ ఆయా ఖాతాలను నిషేధిస్తుంది. మోసాన్ని ప్రోత్సహించడం లేదా ఇతరుల అకౌంట్​ను హ్యాక్​ చేసినట్లు గుర్తిస్తే అటువంటి అకౌంట్లను శాశ్వతంగా నిషేధిస్తుంది. వీటితో పాటు తప్పుడు ప్రోగ్రామ్​లు, మోసపూరిత ప్రకటనలు ఇచ్చే ఖాతాలను కూడా బ్యాన్​ చేస్తుంది. చట్టవిరుద్దమైన పద్దతిలో గేమ్​ ఆడేవారిని గేమ్ నుండి మాత్రమే కాకుండా మీ పరికరం నుండి కూడా నిషేధిస్తుంది. తద్వారా మీరు ఇకపై ఆ ఫోన్‌లో గేమ్‌ను ఆడలేరని గుర్తించుకోవాలి. "బ్యాటిల్​ గ్రౌండ్​ మొబైల్ ఇండియా మీకు ఆహ్లాదకరమైన గేమింగ్ వాతావరణాన్ని అందించడానికి చట్టవిరుద్ధమైన అకౌంట్లపై నిషేధం విధిస్తుంది. ఇటువంటి ఖాతాలను గుర్తించేందుకు ప్రత్యేక టీం పనిచేస్తుంది." అని ట్వీట్ చేసింది.

Post a Comment

0 Comments

Close Menu