Ad Code

నగల దొంగల్ని పట్టిచ్చిన వాట్సప్ గ్రూప్!


చెన్నైలోని వేపేరికి చెందిన మహిపాల్ నగలు తయారు చేస్తుంటాడు. జనవరి 17న వేపేరిలోని తన ఇంటి నుంచి 365 గ్రాముల నగలతో బయల్దేరాడు. ఆటో మాట్లాడుకొని ఈవీకే సంపత్ రోడ్డు మీదుగా వెళ్లాడు. కొంతదూరం వెళ్లాక చూస్తే ఇంటి నుంచి తీసుకొచ్చిన నగలు మిస్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆలస్యం చేయకుండా పెరియమేడు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే నగల యజమాని అయిన మహిపాల్ ఇక్కడే కాస్త తెలివిగా ఆలోచించాడు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. చెన్నైలో నగలు తాకట్టుపెట్టుకునే పాన్ బ్రోకర్స్‌కు, నగల వ్యాపారులకు ఒక కామన్ వాట్సప్ గ్రూప్ ఉంది. అసోసియేషన్ ఆఫ్ జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్‌ను ఆశ్రయించాడు. జరిగిన విషయం చెప్పి మిస్ అయిన నగల ఫోటోలను వారి వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ చేయించాడు. నగలు దొంగిలించిన వారు ఖచ్చితంగా ఏదో ఓ నగల షాపులో అమ్మడం ఖాయం. మహిపాల్ కూడా సరిగ్గా ఇదే అంచనా వేసి పాన్ బ్రోకర్స్ వాట్సప్ గ్రూప్‌లో నగల ఫోటోలు పోస్ట్ చేయించాడు. ఎవరైనా ఆ నగలు అమ్మడానికి వస్తే సంప్రదించాలని వివరాలు కూడా ఇచ్చాడు. మహిపాల్ అంచనా కరెక్ట్ అయింది. జనవరి 23న పురసవాల్కంలోని ఓ పాన్ బ్రోకర్ దగ్గరకు రమేష్ అనే వ్యక్తి నగలు అమ్మడానికి వచ్చాడు. అప్పటికే ఆ పాన్ బ్రోకర్ తన వాట్సప్ గ్రూప్‌లో మహిపాల్ పోస్ట్ చేసిన ఫోటోలను చూశాడు. తన దగ్గరకు అమ్మడానికి తీసుకొచ్చిన నగలు కూడా అవే. వాట్సప్ గ్రూప్‌లో ఉన్న నగల ఫోటోలు, రమేష్ అనే వ్యక్తి తీసుకొచ్చిన నగలు మ్యాచ్ కావడంతో సదరు పాన్ బ్రోకర్ ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే మహిపాల్‌కు సమాచారం ఇచ్చాడు. మహిపాల్ కూడా ఏమాత్రం లేట్ చేయకుండా పెరియమేడు పోలీసులకు ఇన్ఫామ్ చేశాడు. అంతే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు రమేష్‌ను విచారిస్తే తనకు వెంకటేష్ అనే స్నేహితుడు ఈ నగలు ఇచ్చినట్టు చెప్పాడు. అతను ఓ ఆటోడ్రైవర్. విచారణ కొనసాగించిన పోలీసులు వెంకటేష్‌తో పాటు అతని భార్య సంగీతను కూడా అరెస్ట్ చేశారు.  తనకు ఈ నగలను తన తల్లి కళ, తన మామ జోతి ఇచ్చినట్టు విచారణలో వెల్లడించాడు. పోలీసులు జోతిని విచారించారు. ఈవీకే సంపత్ రోడ్డులో తనకు ఈ బ్యాగు దొరికినట్టు చెప్పాడు. అందులో నగలు ఉండటంతో తన చెల్లెలికి, తన అల్లుడికి ఇచ్చినట్టు జోతి వెల్లడించాడు. విచారణ కొనసాగించిన పోలీసులు 365 గ్రాముల నగలను స్వాధీనం చేసుకున్నారు. దొరికిన నగలను పోలీసులకు ఇవ్వకుండా పంచుకున్నందుకు నలుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే జోతి నగల బ్యాగును తీసుకెళ్లినట్టు తేలింది. ఈ కేసులో నగల యజమాని తెలివిగా వ్యవహరించడంతో వారంలోపే దొంగలు దొరికిపోయారు. పాన్ బ్రోకర్స్ వాట్సప్ గ్రూప్‌లో ఫోటోలు షేర్ చేయాలన్న ఆలోచన బాగా పనిచేసింది. 

Post a Comment

0 Comments

Close Menu