Ad Code

బ్లాక్‌చైన్ టెక్నాలజీపై గూగుల్ ఫోకస్ ?


బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఇప్పుడు ట్రెండింగ్ టెక్నాలజీ. బిట్ కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీ కోసం ఈ టెక్నాలజీనే వాడటంతో ప్రస్తుతం అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఉపయోగించి డేటాను అత్యంత భద్రంగా స్టోర్ చేయొచ్చు. ఒక్కసారి బ్లాక్‌చైన్ టెక్నాలజీతో స్టోర్ చేసిన డేటాను హ్యాక్ చేసే చాన్స్ ఉండదు.. డేటాను చేంజ్ చేసే చాన్స్ ఉండదు. డేటాలో పారదర్శకత ఉంటుంది. ఇందులో డేటాను బ్లాక్స్ రూపంలో స్టోర్ చేస్తారు. ఇందులో స్టోర్ చేసే డేటా హైసెక్యూరిటీతో ఉంటుంది కాబట్టే.. క్రిప్టోకరెన్సీ కోసం ఈ టెక్నాలజీనే వాడుతున్నారు. ఇప్పటికే టాప్ ఎంఎన్‌సీ కంపెనీలు బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుతున్నాయి. తాజాగా గూగుల్ కూడా బ్లాక్‌చైన్ టెక్నాలజీపై కన్నేసింది. దాని కోసం సరికొత్త యూనిట్‌నే గూగుల్ ఏర్పాటు చేసింది. గూగుల్ ఏర్పాటు చేసిన కొత్త డివిజన్ బ్లాక్‌చైన్ టెక్నాలజీ మీద పనిచేయబోతోంది. బ్లాక్‌చైన్‌తో పాటు నెక్స్ట్ జనరేషన్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్‌, డేటా స్టోరేజ్ టెక్నాలజీ మీద ఆ యూనిట్ పనిచేయనుంది. దానికోసం గూగుల్‌లో ఇంజనీరింగ్ వైస్ ప్రెసెడెంట్‌గా ఉన్న శివకుమార్ వెంకటరామన్‌ను ఆయూనిట్‌కు ఫౌండింగ్ లీడర్‌గా గూగుల్ అపాయింట్ చేసింది. ఆ యూనిట్‌కు గూగుల్ ల్యాబ్స్ అనే పేరును పెట్టారు. గూగుల్ ల్యాబ్స్ ఇదివరకు ఉన్నదే. కొత్త ప్రాజెక్టుల టెస్టింగ్ కోసం దాన్ని ఒక ఇంక్యుబేటర్‌గా గూగుల్ ఉపయోగిస్తూ ఉంటుంది. తాజాగా బ్లాక్‌చైన్ టెక్నాలజీని డెవలప్ చేసే టీమ్ కూడా ఈ యూనిట్‌లోనే వర్క్ చేయనుంది. అసలు గూగుల్ బ్లాక్‌చైన్ టెక్నాలజీపై ఇంతగా ఫోకస్ పెట్టడానికి ముఖ్య కారణం.. క్రిప్టోకరెన్సీకి ప్రస్తుతం ఉన్న డిమాండ్ అయి ఉండొచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు. గూగుల్.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ మీద ఫోకస్ పెట్టింది అంటే.. ఖచ్చితంగా క్రిప్టో సర్వీస్‌లను త్వరలో గూగుల్ ప్రారంభించే అవకాశం ఉండొచ్చు అని అంటున్నారు. ఇప్పటికే గూగుల్‌కు చెందిన పేమెంట్ ప్లాట్‌ఫామ్ గూగుల్ పే.. పేమెంట్స్ సర్వీస్‌ను అందిస్తోంది. గూగుల్ పే ద్వారా క్రిప్టో సర్వీసులను కూడా ప్రారంభించే యోచనలో గూగుల్ ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ క్రిప్టోకరెన్సీని గూగుల్ పే ద్వారా యాక్సెప్ట్ చేసే చాన్సెస్ కూడా లేకపోలేవు అని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే.. ఇతర ఇంటిగ్రేషన్స్ కోసం కూడా బ్లాక్‌చైన్ టెక్నాలజీని గూగుల్ డెవలప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని పేమెంట్ గేట్‌వేలు.. క్రిప్టో పేమెంట్‌ను యాక్సెప్ట్ చేస్తున్నాయి. దీంతో ఇతర క్రిప్టోకరెన్సీల కంటే.. తనే సొంతంగా ఒక క్రిప్టోకరెన్సీని తీసుకొచ్చే యోచనలో గూగుల్ ఉన్నట్టుగానూ తెలుస్తోంది. దాని కోసమే బ్లాక్‌చైన్ టెక్నాలజీ యూనిట్‌ను గూగుల్ ప్రారంభించిందని.. దాని ద్వారా క్రిప్టో రిలేటెడ్ ఫీచర్లను గూగుల్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు సమాచారం. చూద్దాం మరి.. గూగుల్ సరికొత్త క్రిప్టోకరెన్సీని అందుబాటులోకి తీసుకొస్తుందా? తన సొంత క్రిప్టో కాయిన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తుందా అని. అటువంటి రోజు త్వరలో వచ్చే అవకాశాలు లేకపోలేవు అని కూడా టెక్ ఇండస్ట్రీ అంచనా వేస్తోంది.


Post a Comment

0 Comments

Close Menu