Ad Code

గూగుల్ డాక్యుమెంట్స్‌లో కొత్త ఫీచర్‌ !


డాక్యుమెంటేషన్, టైపింగ్ ఆన్‌లైన్ టూల్ గూగుల్ డాక్స్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా టెక్స్ట్ వాటర్‌మార్క్ అనే ఓ కొత్త ఫీచర్‌ను గూగుల్ డాక్స్‌కు విడుదల చేసింది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు తమ డాక్యుమెంట్స్ లోని ప్రతి పేజీలో టెక్స్ట్ వాటర్‌మార్క్‌ను ప్లేస్ చేయొచ్చు. ఏదైనా డాక్యుమెంట్ ఫైల్‌ను షేర్ చేయడానికి ముందు దాని స్టేటస్ తెలియజేయడానికి యూజర్లు "కాన్ఫిడెన్షియల్" లేదా "డ్రాఫ్ట్" వంటి టెక్స్ట్ వాటర్‌మార్క్‌లను సృష్టించి ప్రతి పేజీలోనూ యాడ్ చేయొచ్చు. ఈ టెక్స్ట్ వాటర్‌మార్క్ ఆప్షన్‌ గూగుల్ డాక్స్ లోని ఇన్‌సర్ట్‌ మెనూలో ఉంటుంది. ఈ ఆప్షన్ వాటర్‌మార్క్ టెక్స్ట్ ఫాంట్, సైజు, ట్రాన్స్‌పరసీ, పొజిషన్ వంటి వాటిని కస్టమైజ్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. దీనివల్ల డాక్యుమెంట్‌లు మరింత ప్రొఫెషనల్‌గా కనిపిస్తాయి. వర్క్‌స్పేస్ కస్టమర్లు, జీ సూట్ బేసిక్ యూజర్లు, బిజినెస్ కస్టమర్లతో సహా యూజర్లందరికీ గూగుల్ డాక్స్ వాటర్‌మార్క్ ఫీచర్‌ను గూగుల్ అందుబాటులోకి తెస్తోంది. గూగుల్ కంపెనీ జనవరి 24న ఈ ఫీచర్‌ను రోల్‌అవుట్‌ చేయడం ప్రారంభించింది. మరికొద్ది రోజుల్లో ఇది యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గూగుల్ డాక్స్‌లోని వాటర్‌మార్క్ కేవలం గూగుల్ టూల్ కు మాత్రమే పరిమితం కాదు. ఈ వాటర్‌ మార్క్ టెక్స్ట్ అనేది మైక్రోసాఫ్ట్ వర్డ్ నుంచి డాక్యుమెంట్‌లను ఇంపోర్ట్ చేసేటప్పుడు లేదా ఎక్స్‌పోర్ట్‌ చేస్తున్నప్పుడు అలాగే ఉండిపోతుంది. గతేడాది సెప్టెంబరులో గూగుల్ సంస్థ గూగుల్ డాక్స్‌లో ఇమేజ్ వాటర్‌మార్క్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది డాక్యుమెంట్‌లోని ప్రతి పేజీలో ఇమేజ్ వాటర్‌మార్క్‌ను ఇన్‌సర్ట్‌ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. యూజర్లు తమ డాక్యుమెంట్లకు కంపెనీ లోగోలు, బ్రాండింగ్ వంటివి జోడించడానికి ఈ ఫీచర్ సహకరిస్తుంది. సేఫ్ ఫైల్‌లను నావిగేట్ చేయడంలో యూజర్లకు సహాయపడే కొత్త అప్‌డేట్‌ను గూగుల్ డ్రైవ్‌కు గూగుల్ ఇటీవలే తీసుకొచ్చింది. మళ్లీ ఇప్పుడు గూగుల్ డాక్స్‌కు చక్కటి ఫీచర్ అందించి యూజర్లను ఫిదా చేసింది. అయితే గూగుల్ డ్రైవ్‌లో వచ్చిన కొత్త అప్‌డేట్‌తో యూజర్లు ఇప్పుడు ప్రమాదకరమైన ఫైల్‌ను ఓపెన్ చేసేటప్పుడు "వార్నింగ్ బ్యానర్"ని చూడగలుగుతారు. అక్టోబర్‌లో గూగుల్ క్లౌడ్ నెక్స్ట్ 2021లో మొదటిసారిగా ఈ వార్నింగ్ బ్యానర్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఇది గూగుల్ డ్రైవ్‌, గూగుల్ డాక్స్, షీట్‌లు, స్లయిడ్‌లు, డ్రాయింగ్‌ల యూజర్లకు విడుదలయ్యింది. 2022 ప్రారంభంలో గూగుల్ ఆండ్రాయిడ్ 'ఎకోసిస్టమ్'ని మరింత సమగ్రంగా, స్పష్టమైనదిగా మార్చే ప్రణాళికలను ప్రకటించింది. యాపిల్ ఉత్పత్తులు ఎలా పరస్పరం ఇంటర్ లింక్ అయ్యి సాఫీగా వర్క్ అవుతాయో ఆ విధంగా ఆండ్రాయిడ్ ఉత్పత్తులను అనుసంధానించేలా 'ఎకోసిస్టమ్'ని మార్చేందుకు ఓ ప్రణాళిక రూపొందించింది. అంతేకాదు, ఇది స్మార్ట్ హోమ్ డివైజ్ లు , క్రోమ్ బుక్ లకు ఫాస్ట్ పెయిర్ టెక్నాలజీని విస్తరిస్తున్నట్లు ప్రకటించింది.

Post a Comment

0 Comments

Close Menu