Ad Code

కలకలం రేపుతున్న కొత్త మాల్‌వేర్!


కొద్ది రోజుల క్రితం జోకర్ మాల్‌వేర్ ఆండ్రాయిడ్ యాప్స్‌లో చేరి స్మార్ట్‌ఫోన్ యూజర్ల వివరాలు కాజేసింది. ఇప్పటికీ జోకర్ మాల్‌వేర్ చాలా యాప్స్‌లో బయటపడుతున్నాయి. యూజర్ల ప్రమేయం లేకుండా ప్రీమియం సర్వీసులకు సబ్‌స్క్రైబ్ చేయడమే జోకర్ మాల్‌వేర్ పని. దీంతో స్మార్ట్‌ఫోన్ యూజర్ల బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పుడు మరో మాల్‌వేర్ పలు దేశాల్లో కలకలం రేపుతోంది. BRATA కొత్త వేరియంట్లను సెక్యూరిటీ రీసెర్చర్లు కనుగొన్నారు. ఈ వైరస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తోంది. వారి ఇ-బ్యాంకింగ్ వివరాలు అంటే బ్యాంకు అకౌంట్ నెంబర్లు, యూజర్ నేమ్, పాస్‌వర్డ్ లాంటి వివరాలను కాజేస్తోంది. ఈ వివరాలన్నీ హ్యాకర్ల చేతుల్లోకి చేరుతున్నాయి. యూకే, పోలాండ్, ఇటలీ, స్పెయిన్, చైనా, లాటిన్ అమెరికాలో ఇప్పటికే BRATA కొత్త వేరియంట్లు బయటపడ్డాయి. 2021 డిసెంబర్ నుంచి కొత్త వేరియంట్ సర్క్యులేట్ అవుతోంది. ఈ మాల్‌వేర్ ఎంత డేంజరస్ అంటే బ్యాంకు వివరాలను కాజేయడం మాత్రమే కాదు... యూజర్ల స్మార్ట్‌ఫోన్ డేటాను మొత్తం డిలిట్ చేసేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేస్తుంది. BRATA ఆండ్రాయిడ్ మాల్‌వేర్‌ను తొలిసారిగా మల్టీనేషనల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన క్యాస్పర్‌స్కీ గుర్తించింది. తాజాగా BRATA కొత్త వేరియంట్‌ను Cleafy అనే కంప్యూటర్ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. ఇ-బ్యాంకింగ్ యూజర్లను టార్గెట్ చేసేందుకే కొత్త వేరియంట్ రూపొందించినట్టు తేల్చారు. గతంలో ఈ బ్యాంకింగ్ ట్రోజాన్‌ను వెబ్‌సైట్లలో పుష్ నోటిఫికేషన్స్ ద్వారా పంపేవారు. ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్స్ ద్వారా, థర్డ్ పార్టీ యాప్ స్టోర్ ద్వారా ఈ మాల్‌వేర్‌ను స్మార్ట్‌ఫోన్లలోకి పంపుతున్నారు హ్యాకర్లు. అంతేకాదు... ఎస్ఎంఎస్‌తో పాటు వాట్సప్ సందేశాల్లో కూడా ఈ మాల్‌వేర్ చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఈ మెసేజెస్ బ్యాంకు నుంచి పంపినట్టుగా ఉంటాయి. దీంతో యూజర్లు ఈజీగా మోసపోతున్నారు. బ్యాంకులే తమకు మెసేజెస్ పంపారనుకొని లింక్స్ క్లిక్ చేస్తున్నారు. హ్యాకర్ల ట్రాప్‌లో పడుతున్నారు. ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడర్ ద్వారా ఎంటర్ అవుతోంది. యాంటీవైరస్ యాప్స్ ఉన్నా వాటిని కూడా బైపాస్ చేస్తోంది. ఇప్పటివరకు మూడు BRATA వేరియంట్లు గుర్తించారు సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్లు. BRATA.A కొన్ని నెలల క్రితం బయటపడింది. జీపీఎస్ ట్రాకింగ్‌తో పాటు ఫ్యాక్టరీ రీసెట్ చేస్తుంది. BRATA.B వేరియంట్ కూడా ఇలాగే పనిచేస్తుంది. దీంతో పాటు బ్యాంక్ లాగిన్ వివరాలను సేకరిస్తుంది. ఇక BRATA.C వేరియంట్ ప్రైమరీ యాప్ కాకుండా సెకండరీ యాప్ డౌన్‌లోడ్ చేస్తుంది. మరి ఇలాంటి వేరియంట్లతో ఎలా జాగ్రత్తగా ఉండాలన్న సందేహాలు స్మార్ట్‌ఫోన్ యూజర్లకు వస్తుంటాయి. ఎప్పటికప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ చెక్ చేసి అవసరం లేని యాప్స్ డిలిట్ చేయాలి. ఇప్పటికే ఉన్న యాప్స్ ఒరిజినల్ యాప్సేనా కాదా అని చెక్ చేయాలి. థర్డ్ పార్టీ యాప్ స్టోర్ నుంచి యాప్స్ అస్సలు డౌన్‌లోడ్ చేయకూడదు. 

Post a Comment

0 Comments

Close Menu