Ad Code

బ్లాక్‌చెయిన్ లో పెళ్లి తంతు!


పెళ్లంటే పందిళ్లు... సందళ్లు... తప్పెట్లు... తాళాలు... తలంబ్రాలు అని పాడుకునే రోజులు భవిష్యత్తులో ఉండవేమో? ఇప్పటికే ఆన్‌లైన్ పెళ్లిళ్లు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా స్నేహితులు, బంధువులు ప్రత్యక్షంగా లేకుండా వర్చువల్ పద్ధతిలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా బ్లాక్‌చెయిన్ వెడ్డింగ్ హాట్ టాపిక్‌గా మారింది. పూణెకు చెందిన అనిల్ నరసిపురం, శృతి నాయర్ బ్లాక్‌చెయిన్ వెడ్డింగ్‌తో వార్తల్లోకి వచ్చారు. వీరిద్దరు బ్లాక్‌చెయిన్‌లో పెళ్లి చేసుకున్నారు. భారతదేశంలో ఇలాంటి పెళ్లి ఇదే మొదటిది కావడం విశేషం. 2021 నవంబర్‌లో అనిల్ నరసిపురం, శృతి నాయర్ ఆన్‌లైన్‌లో పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. 'డిజిటల్ పంతులు'తో ఈ పెళ్లి నిర్వహించడం విశేషం.ఈ పెళ్లి ప్రత్యేకత ఏంటంటే ఈ పెళ్లి బ్లాక్‌చెయిన్‌లో జరగడమే. "నేను, శృతి ఇథీరియం స్మార్ట్ కాంట్రాక్ట్‌తో బ్లాక్‌చెయిన్ అఫీషియల్ వెడ్డింగ్ చేసుకున్నాం. పవిత్రమైన తమ వివాహబంధం, ఒకరిపట్ల మరొకరికి నిబద్ధతకు గుర్తుగా నాన్ ఫంజబుల్ టోకెన్‌ను  ఓపెన్‌సీ ప్లాట్‌ఫామ్‌లో ముద్రించాం" అని అనిల్ నరసిపురం లింక్డ్‌ఇన్ పోస్టులో వివరించారు. పెళ్లికూతురు ఉంగరంతో ఎన్ఎఫ్‌టీని క్రియేట్ చేయడం విశేషం. ఇక భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికి ఒకరు చేసుకున్న ప్రమాణాలు కూడా ఇందులో ఎంబెడ్ చేశారు. "మేము పెద్ద వాగ్దానాలు చేయం. కానీ వివాహ బంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చేయాల్సినదంతా చేస్తాం" అని అందులో రాయడం విశేషం. ఈ పెళ్లి కోసం వధూవరులు ఇద్దరూ క్రిప్టోకరెన్సీ వ్యాలెట్లను ఉపయోగించారు. డిజిటల్ పంతులుగా వ్యవహరించిన అనూప్ పక్కీ ఎన్‌ఎఫ్‌టీని ఓపెన్‌సీ ప్లాట్‌ఫామ్‌లో రూపొందించి తనకు ట్రాన్స్‌ఫర్ చేశారని అనిల్ నరసిపురం తెలిపారు. ఈ పెళ్లి వేడుక సమయంలో వధూవరులు ఇద్దరూ ల్యాప్‌టాప్స్‌తో కూర్చున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు గూగుల్ మీట్‌లో ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. "డిజిటల్ పంతులు అనూప్ పక్కీ ఆధ్వర్యంలో ఈ వివాహ వేడుక 15 నిమిషాల పాటు జరిగింది. ఆయన ఆశీర్వాదాలు అందుకున్న తర్వాత నేను ఎన్‌ఎఫ్‌టీని నా భార్య డిజిటల్ వ్యాలెట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశాను" అని అనిల్ నరసిపురం వివరించారు. ఈ ట్రాన్సాక్షన్ పూర్తైన తర్వాత వీరిద్దరినీ భార్యాభర్తలుగు ప్రకటించారు. ఇలా బ్లాక్‌చెయిన్‌లో పెళ్లి చేసుకున్న తొలి జంట తామేనని ప్రకటించారు. డిజిటల్ లెడ్జర్‌లో స్టోర్ చేసిన డేటాను ఎన్ఎఫ్‌టీ అంటారు. దీన్నే బ్లాక్‌చెయిన్ అని కూడా పిలుస్తారు. ఈ డిజిటల్ అసెట్ విభిన్నమైనది. పరస్పరం మార్చుకోవడానికి వీలులేనిది. ఫోటోలు, వీడియోలు, ఆడియో, ఇతర డిజిటల్ ఫైల్స్‌తో ఎన్ఎఫ్‌టీలు రూపొందించవచ్చు. ఇది యాజమాన్య హక్కుకు సంబంధించిన రుజువు లేదా ప్రామాణికతకు సంబంధించిన పబ్లిక్ సర్టిఫికెట్‌ను డిజిటల్ లెడ్జర్ అందిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu